వాళ్లలా విశ్వాసం చూపించండి | యోబు
”నా యథార్థతను విడిచిపెట్టను”
ఆయన నేల మీద కూర్చున్నాడు, నడినెత్తి నుండి అరికాలు వరకు శరీరమంతా నొప్పి పుట్టించే పుండ్లతో నిండిపోయింది. ఒకసారి దీన్ని ఊహించుకోండి: ఆయన తల వంచుకొని, దిగాలుగా, ఒంటరిగా కూర్చున్నాడు. కనీసం తనమీద వాలుతున్న ఈగల్ని తోలుకునే శక్తి కూడా ఆయనకు లేదు. బూడిదలో కూర్చొని దుఃఖిస్తున్న ఆయనకు ఒంటిమీది పుండ్లను మట్టిపెంకుతో గోక్కునే శక్తి మాత్రమే ఉంది. ఒకప్పుడు ఆయన్ని గౌరవించినవాళ్లు ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు. స్నేహితులు, పొరుగువాళ్లు, బంధువులు ఆయన్ని విడిచిపెట్టేశారు. పిల్లలతో సహా అందరూ ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. తన దేవుడైన యెహోవా కూడా తనతో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ఆయనకు అనిపించింది. కానీ అది నిజం కాదు.—యోబు 2:8; 19:18, 22.
ఆయనే యోబు. “భూమిమీద అతనివంటివాడెవడును లేడు” అని దేవుడు అన్నాడు. (యోబు 1:8) ఆ మాటలు చెప్పిన వందల సంవత్సరాల తర్వాత కూడా, యోబును అత్యంత నీతిమంతుల్లో ఒకడిగా యెహోవా పరిగణించాడు.—యెహె. 14:14, 20.
మీరు కష్టాల్ని, ఊహించని బాధల్ని అనుభవిస్తున్నారా? అయితే, యోబు కథను తెలుసుకోవడం వల్ల మీరెంతో ఓదార్పు పొందుతారు. అంతేకాదు నమ్మకమైన ప్రతీ దేవుని సేవకునికి ఉండాల్సిన యథార్థత అనే లక్షణం గురించి ఇంకా బాగా అర్థంచేసుకోగలుగుతారు. మనుషులకు దేవుని మీద పూర్తి భక్తి ఉన్నప్పుడు, యథార్థతను చూపిస్తారు, కష్టాల్లో కూడా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తారు. ఇప్పుడు యోబు నుండి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం.
యోబుకు తెలియనిది ఏంటి?
యోబు జీవిత కథను, ఆయన చనిపోయిన కొంతకాలానికి మోషే అనే నమ్మకమైన వ్యక్తి రాసుంటాడు. దేవుని ప్రేరణ వల్ల మోషే, భూమ్మీద యోబుకు జరిగిన సంగతుల గురించే కాకుండా పరలోకంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల గురించి కూడా రాయగలిగాడు.
కథ మొదట్లో యోబు సంతృప్తికరమైన, సంతోషభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆయనొక పెద్ద ధనవంతుడు, బహుశా ఉత్తర అరేబియాలో ఉన్న ఊజు దేశంలో ఆయన గురించి తెలియనివాళ్లే లేరు, ఆయన్ని అందరూ గౌరవించేవాళ్లు. ఆయన పేదవాళ్లకు ఉదారంగా సహాయం చేసేవాడు, నిస్సహాయులకు అండగా నిలిచేవాడు. దేవుడు యోబును పదిమంది పిల్లలతో ఆశీర్వదించాడు. అయితే యోబు, దేవునితో తనకున్న సంబంధాన్నే అన్నిటికన్నా విలువైనదిగా ఎంచేవాడు. తన పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులాగే యోబు కూడా యెహోవాను సంతోషపెట్టడానికి శాయశక్తులా కృషిచేసేవాడు. వాళ్లలాగే యోబు తన పిల్లల తరఫున క్రమంగా దహనబలులు అర్పిస్తూ తన కుటుంబానికి యాజకుడిగా పనిచేశాడు.—యోబు 1:1-5; 31:16-22.
అయితే ఉన్నట్టుండి బైబిలు రచయిత పరలోకంలో జరుగుతున్న సంఘటనల గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఆ సంఘటనల గురించి బహుశా యోబుకు తెలిసుండకపోవచ్చు. నమ్మకమైన దేవదూతలు యెహోవా దేవుని ముందు సమకూడారు, సాతాను అనే తిరుగుబాటుదారుడైన దేవదూత కూడా అక్కడి వచ్చాడు. అతనికి యోబు అంటే ఇష్టం లేదని యెహోవాకు తెలుసు. అందుకే ఆయన, యోబు అసాధారణమైన యథార్థత గురించి సాతానుకు చెప్పాడు. అప్పుడు సాతాను ఏమాత్రం తడబడకుండా, “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా?” అని అన్నాడు. యథార్థంగా ఉండే ప్రజలంటే సాతానుకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే, అలాంటివాళ్లు యెహోవా పట్ల హృదయపూర్వక భక్తిని చూపించినప్పుడు సాతానొక ప్రేమలేని నమ్మకద్రోహి అని నిరూపిస్తున్నారు. కాబట్టి సాతాను, యోబు స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తున్నాడని వాదిస్తూ, ఒకవేళ ఆయనకు ఉన్నవన్నీ పోతే ఆయన ఖచ్చితంగా యెహోవాను ముఖం మీదే దూషిస్తాడని అన్నాడు.—యోబు 1:6-11.
ఇదంతా యోబుకు తెలిసుండకపోవచ్చు, కానీ సాతాను అబద్ధికుడని నిరూపించే గొప్ప అవకాశాన్ని యెహోవా ఆయనకు ఇచ్చాడు. యోబు దగ్గరున్నవన్నీ తీసేయడానికి యెహోవా సాతానుకు అనుమతిచ్చాడు. కానీ యోబుకు హాని చేయొద్దని చెప్పాడు. దాంతో అతను ఆతురతతో యోబును బాధించడం మొదలుపెట్టాడు. ఒక్కరోజులోనే యోబుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఆయన పశువులు, గాడిదలు, గొర్రెలు, ఒంటెలు అన్నీ చనిపోయాయని యోబుకు చెప్పారు. అంతేకాదు వాటిని చూసుకునే సేవకులు కూడా చంపబడ్డారు. తన గొర్రెలు, సేవకులు చనిపోవడానికి ఒక కారణం “దేవుని అగ్ని” అని ఆయనతో చెప్పారు. అది బహుశా మెరుపులు అయ్యుండవచ్చు. ఆ వార్త జీర్ణించుకోకముందే, ఇంకొక పెద్ద విషాద వార్త ఆయనకు తెలిసింది. తన పెద్ద కొడుకు ఇంట్లో తన పిల్లలందరూ ఉండగా హఠాత్తుగా సుడిగాలి రావడంతో ఆ ఇల్లు కూలిపోయి, వాళ్లందరూ చనిపోయారు.—యోబు 1:12-19.
ఆ సమయంలో యోబుకు ఎలా అనిపించివుంటుందో ఊహించడం కష్టం, అసాధ్యం కూడా. ఆయన తన బట్టలు చింపుకొని, తలవెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద కుప్పకూలిపోయాడు. అన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్లిపోయాడని యోబు అన్నాడు. నిజానికి సాతాను తన తెలివితేటలతో, అదంతా దేవుని వల్లే జరిగిందని అనిపించేలా చేశాడు. అయినప్పటికీ, సాతాను చెప్పినట్టు యోబు దేవున్ని దూషించలేదు. బదులుగా, “యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” అని యోబు అన్నాడు.—యోబు 1:20-22.
‘అతడు దూషించి నిన్ను విడిచిపోవును’
కోపంతో రగిలిపోతున్న సాతాను ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. దేవదూతలు యెహోవా ముందు సమకూడినప్పుడు అతను మళ్లీ అక్కడికి వచ్చాడు. అతను ఎన్ని దాడులు చేసినా యోబు యథార్థంగా ఉన్నందుకు యెహోవా మళ్లీ ఆయన్ని మెచ్చుకున్నాడు. అప్పుడు సాతాను, “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును” అని అన్నాడు. ఒకవేళ యోబు ఆరోగ్యం పాడైతే ఆయన దేవున్ని దూషిస్తాడని సాతాను నమ్మాడు. యెహోవా యోబుపై పూర్తి నమ్మకంతో ఆయన ఆరోగ్యాన్ని పాడుచేయడానికి సాతానును అనుమతించాడు. కానీ యోబు ప్రాణం తీయొద్దని చెప్పాడు.—యోబు 2:1-6.
ఆ వెంటనే, మొదటి పేరాలో చూసినట్లు సాతాను యోబుకు శరీరమంతా పుండ్లు వచ్చేలా చేశాడు. పాపం ఆయన భార్య, అప్పటికే పదిమంది పిల్లల్ని పోగొట్టుకొని గుండెకోత అనుభవిస్తుంటే, ఇప్పుడు తన భర్తను ఇలా నిస్సహాయ స్థితిలో చూడాల్సి వచ్చింది. ఆ బాధలో ఆమె, “నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము” అని అంది. ఇంతకుముందెప్పుడూ ఆమె అలా మాట్లాడలేదు. ఆమె తెలివితక్కువదానిలా మాట్లాడుతుందని యోబు అన్నాడు. కానీ ఆయన దేవున్ని దూషించలేదు, తన పెదవులతో ఏ పాపం చేయలేదు.—యోబు 2:7-10.
వాస్తవమైన ఈ విషాద కథ మీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సాతాను క్రూరంగా నిందించింది యోబును మాత్రమే కాదు, మొత్తం మానవజాతిని అతను నిందించాడు. “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా” అని అతను అన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, మనలో ఏ ఒక్కరూ యెహోవాకు పూర్తిగా యథార్థంగా ఉండలేరని సాతాను నమ్ముతున్నాడు. మీకు దేవుని మీద నిజంగా ప్రేమ లేదని, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దేవున్ని త్వరగా విడిచిపెట్టేస్తారని అతను అంటున్నాడు. మరో విధంగా చెప్పాలంటే, మీరు కూడా అతనిలానే స్వార్థపరులని అంటున్నాడు. అతను చెప్పేదంతా అబద్ధమని మీకు నిరూపించాలని ఉందా? ఆ అవకాశం మనలో ప్రతీఒక్కరికి ఉంది. (సామె. 27:11) ఆ తర్వాత యోబుకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఓదార్చడంలో విఫలమయ్యారు
యోబు కష్టాల గురించి తెలిసి ఆయన్ని చూడడానికి, ఓదార్చడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాళ్లను ఆయన సహచరులు లేదా స్నేహితులని బైబిలు పిలుస్తుంది. వాళ్లు యోబును దూరం నుండి చూసినప్పుడు, ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. నొప్పి వల్ల, జబ్బుతో శరీరం నల్లబడడం వల్ల యోబు అసలు పోల్చుకోలేని విధంగా తయారయ్యాడు. ఆ ముగ్గురు స్నేహితులు అంటే ఎలీఫజు, బిల్దదు, జోఫరు గట్టిగా ఏడుస్తూ, తలల మీద దుమ్ము పోసుకుంటూ బాధపడుతున్నట్లు నటించారు. ఒక వారమంతా పగలు-రాత్రి ఒక్కమాట కూడా మాట్లాడకుండా అక్కడే కూర్చుండిపోయారు. యోబును ఓదార్చడానికే వాళ్లు అలా మౌనంగా ఉన్నారని మనం పొరబడకూడదు. ఎందుకంటే వాళ్లు ఆయన పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆయన బాధలో ఉన్నాడని మాత్రమే వాళ్లు అర్థంచేసుకున్నారు, అది ఆయన్ని చూడగానే తెలుస్తుంది.—యోబు 2:11-13; 30:30.
చివరికి యోబే మాట్లాడడం మొదలుపెట్టాల్సి వచ్చింది. ఆయన ఎంతో బాధతో, తాను పుట్టిన రోజును శపించడం మొదలుపెట్టాడు. తర్వాత, ఎందుకంత బాధపడుతున్నాడో చెప్పాడు. దేవుడే తనకు ఆ బాధలు పెట్టాడని యోబు అనుకున్నాడు. (యోబు 3:1, 2, 23) యోబు ఇంకా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు, అయినప్పటికీ ఆయనకు ఓదార్పు అవసరమైంది. ఆయన స్నేహితులు మాట్లాడడం మొదలుపెట్టిన కాసేపటికే వాళ్లు మౌనంగా ఉండడమే మంచిదని ఆయన గుర్తించాడు.—యోబు 13:5.
బహుశా ఆ ముగ్గురిలో పెద్దవాడు, యోబు కన్నా ఎంతో పెద్దవాడైన ఎలీఫజు మాట్లాడడం ప్రారంభించాడు. కాసేపటి తర్వాత మిగతా ఇద్దరు కూడా మాట్లాడారు. నిజానికి, వాళ్లు ఏమీ ఆలోచించకుండా ఎలీఫజులాగే మూర్ఖంగా మాట్లాడారు. వాళ్లు చెప్పిన కొన్ని మాటలు తప్పు కాదన్నట్టు అనిపించవచ్చు. ఎందుకంటే దేవుడు ఉన్నతుడని, చెడ్డవాళ్లను శిక్షిస్తాడని, మంచివాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని ప్రజలు సాధారణంగా చెప్పే మాటలే వాళ్లూ చెప్పారు. అయితే వాళ్లకు యోబు మీద ఏమాత్రం జాలి, దయ లేవని మొదటినుండి వాళ్ల మాటల్లో కనిపించింది. ఎలీఫజు మాటలు తర్కబద్ధంగా ఉన్నట్టు కనిపించినా ఆయన ముఖ్యమైన సత్యాల్ని నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడాడు. దేవుడు మంచివాడు, ఆయన చెడ్డవాళ్లను శిక్షిస్తాడు; కాబట్టి యోబు శిక్ష అనుభవిస్తున్నాడంటే ఆయన ఏదో తప్పు చేసివుంటాడని ఎలీఫజు అన్నాడు.—యోబు 4:1, 7, 8; 5:3-6.
ఎలీఫజు మాటల్ని యోబు ఒప్పుకోలేదు, అవి తప్పని స్థిరంగా చెప్పాడు. (యోబు 6:25) అయినాసరే ఆ ముగ్గురు సలహాదారులు, యోబు ఖచ్చితంగా ఏదో పాపం చేసి దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని, అందుకే ఆ కష్టాలన్నీ వచ్చాయని అనుకున్నారు. యోబు గర్విష్ఠని, చెడ్డవాడని, దైవభయం లేనివాడని ఎలీఫజు నిందించాడు. (యోబు 15:4, 7-9, 20-24; 22:6-11) యోబు చెడ్డపనులు మానేయాలని, పాపం చేయడంలో ఆనందించకూడదని జోఫరు అన్నాడు. (యోబు 11:2, 3, 14; 20:4, 12, 13) బిల్దదు ఇంకా ఘోరంగా మాట్లాడాడు. యోబు కుమారులు ఏదో పాపం చేసివుంటారని, అందుకే వాళ్లకు తగిన శాస్తి జరిగిందని అన్నాడు.—యోబు 8:4, 13.
యథార్థత మీద దాడి!
తప్పుగా ఆలోచిస్తున్న ఆ మనుషులు, కేవలం యోబు యథార్థంగా లేడని నిందించడమే కాదు, అసలు యథార్థంగా ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదని కూడా అన్నారు. ఎలీఫజు తన మాటల మొదట్లో, అతనికి ఏదో ఆకారం కనిపించిందని, చాలా భయమేసిందని చెప్పాడు. అది కనిపించాక, దేవుడు ‘తన సేవకుల్ని నమ్మట్లేదు తన దూతల్లో లోపాలు కనుగొంటున్నాడు’ అనే విషయం తనకు అర్థమైందని చెప్పాడు. అతని మాటలు హానికరమైనవి, అవి దేవుని మీద విశ్వాసం కోల్పోయేలా చేయగలవు. ఎందుకంటే మనుషులు ఎప్పటికీ దేవున్ని సంతోషపెట్టలేరని అతను అంటున్నాడు. ఆ తర్వాత బిల్దదు, ఒక పురుగు యథార్థతకు విలువలేనట్టే యోబు యథార్థతకు కూడా దేవుని దృష్టిలో విలువలేదని అన్నాడు.—యోబు 4:12-18; 15:15; 22:2, 3; 25:4-6.
బాధలో కూరుకుపోయిన వాళ్లను ఓదార్చడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా? వాళ్లను ఓదార్చడం అంత సులభం కాదు. యోబు తెలివితక్కువ స్నేహితుల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు, ముఖ్యంగా ఎలా మాట్లాడకూడదో నేర్చుకోవచ్చు. ఆ ముగ్గురు ఎన్నో విషయాలు మాట్లాడారు. అవి తర్కబద్ధంగా, తెలివైన మాటల్లా అనిపించివుండవచ్చు. కానీ వాళ్లు యోబు మీద ఏమాత్రం కనికరం చూపించలేదు, కనీసం ఆయన్ని పేరుతో కూడా సంబోధించలేదు. గాయపడిన యోబు హృదయాన్ని వాళ్లు కొంచెం కూడా పట్టించుకోలేదు, ఆయనతో మృదువుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. a ఒకవేళ మీరు ప్రేమించేవాళ్లు ఎవరైనా బాధలో ఉంటే, వాళ్లమీద ఆప్యాయతను, శ్రద్ధను, దయను చూపించడానికి ప్రయత్నించండి. వాళ్ల విశ్వాసాన్ని బలపర్చండి. దేవుని మీద, ఆయన గొప్ప దయ, కరుణ, న్యాయం వంటి లక్షణాల మీద నమ్మకం ఉంచేలా సహాయం చేయండి. ఒకవేళ యోబు స్నేహితులే బాధలో ఉంటే, ఆయన అలాంటి సహాయమే చేసేవాడు. (యోబు 16:4, 5) తన స్నేహితులు తన యథార్థతను అదేపనిగా తప్పుబడుతున్నప్పుడు యోబు ఎలా స్పందించాడు?
యోబు స్థిరంగా నిలబడ్డాడు
పాపం యోబు, ఈ సంభాషణంతా మొదలయ్యే సమయానికే ఎంతో బాధలో ఉన్నాడు. తాను కొన్నిసార్లు వెర్రిమాటలు పలికానని, నిరాశలో అలా మాట్లాడానని మొదటినుండే చెప్పాడు. (యోబు 6:3, 26) ఎందుకో మనం అర్థంచేసుకోవచ్చు. ఆయన భరించలేనంత బాధలో ఉన్నాడు, అంతేకాదు అసలు ఏం జరుగుతోందో ఆయనకు అర్థంకాలేదు. తనకు, తన కుటుంబానికి జరిగిన చెడు సంఘటనలు హఠాత్తుగా చోటు చేసుకున్నాయి కాబట్టి, అందులోనూ మానవాతీత శక్తుల వల్ల జరిగినట్టు అనిపించాయి కాబట్టి, వాటికి కారణం యెహోవాయే అని యోబు అనుకున్నాడు. పైగా యోబుకు కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనల గురించి ఏమాత్రం తెలియదు, కాబట్టి ఊహాగానాల వల్ల తప్పుడు ముగింపుకు వచ్చాడు.
కానీ యోబు విశ్వాసం బలమైనది, స్థిరమైనది. యోబుకు, ఆయన స్నేహితులకు మధ్య జరిగిన పెద్ద సంభాషణలో యోబు పలికిన మాటల్లో ఆయన విశ్వాసం కనబడుతుంది. సత్యమైన, అద్భుతమైన, ప్రోత్సాహకరమైన ఆ మాటల నుండి నేడు మనం కూడా ప్రయోజనం పొందవచ్చు. ఆయన సృష్టిలో అద్భుతాల గురించి మాట్లాడినప్పుడు, దేవుడు తెలియజేస్తే తప్ప మనుషులు ఎప్పటికీ తెలుసుకోలేని విషయాల గురించి వివరించాడు. ఉదాహరణకు, యెహోవా “శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను” అని యోబు చెప్పాడు. ఆ వాస్తవాన్ని శాస్త్రజ్ఞులు వందల సంవత్సరాల తర్వాత తెలుసుకున్నారు. b (యోబు 26:7) యోబు తన నిరీక్షణ గురించి మాట్లాడినప్పుడు, పూర్వం జీవించిన ఇతర నమ్మకమైన దేవుని సేవకులకు ఉన్నలాంటి విశ్వాసాన్నే చూపించాడు. ఒకవేళ తాను చనిపోతే, దేవుడు తనను గుర్తుపెట్టుకుంటాడని, తనను మళ్లీ చూడాలనుకుంటాడని, తిరిగి బ్రతికిస్తాడని యోబు నమ్మాడు.—యోబు 14:13-15; హెబ్రీ. 11:17-19, 35.
ఇంతకీ యథార్థత గురించి తలెత్తిన ప్రశ్న సంగతేంటి? మనుషుల యథార్థతను దేవుడు పట్టించుకోడని ఎలీఫజు, అతని ఇద్దరు స్నేహితులు వాదించారు. వాళ్ల చెడ్డ ఆలోచన నిజమని యోబు నమ్మాడా? లేదు! మనుషుల యథార్థతను దేవుడు పట్టించుకుంటాడని యోబు బలంగా చెప్పాడు. ఆయన యెహోవా గురించి నమ్మకంగా ఇలా అన్నాడు, ‘ఆయన నా యథార్థతను గుర్తిస్తాడు.’ (యోబు 31:6, NW) తనను ఓదార్చడానికి వచ్చినవాళ్లు తప్పుడు తర్కంతో తన యథార్థతను తప్పుబడుతున్నారని యోబు స్పష్టంగా అర్థంచేసుకున్నాడు. దాంతో ఆయన చాలాసేపు మాట్లాడాడు, ఆయన ఎంత బాగా మాట్లాడాడంటే ఆ ముగ్గురు ఇక నోరు తెరవలేదు.
తన యథార్థత ప్రతీరోజు తాను ఎలా జీవిస్తున్నాడనే దాన్నిబట్టి తెలుస్తుందని యోబు అర్థంచేసుకున్నాడు. అందుకే ఆయన రోజూ చేసే పనుల్లో ఎలా యథార్థంగా నడుచుకున్నాడో వివరించాడు. ఉదాహరణకు, ఆయన అన్నిరకాల విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు, ఇతరులతో దయగా గౌరవంగా వ్యవహరించాడు, తన వివాహ జీవితాన్ని ఆనందిస్తూ మంచి నైతిక ప్రమాణాలు పాటించాడు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒకేఒక్క సత్య దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆయన నిండు హృదయంతో ఇలా అనగలిగాడు, “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.”—యోబు 27:5; 31:1, 2, 9-11, 16-18, 26-28.
యోబులా విశ్వాసం చూపించండి
మీరు యోబులాగే యథార్థతను ప్రాముఖ్యమైన లక్షణంగా చూస్తారా? మనం యథార్థతను మాటల్లో కాదు క్రియల్లో చూపించాలని యోబు అర్థంచేసుకున్నాడు. దేవునికి లోబడడం ద్వారా, ఎల్లప్పుడూ ఆఖరికి కష్టపరిస్థితుల్లో కూడా ఆయన దృష్టిలో సరైనది చేయడం ద్వారా హృదయపూర్వకంగా ఆయనపట్ల పూర్ణ భక్తిని చూపిస్తాం. అలా మనం, గతంలో యోబు చేసినట్టు యెహోవాను సంతోషపెడతాం, ఆయన శత్రువైన సాతానును ఓడిస్తాం. యోబులా విశ్వాసం చూపించడానికి ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు.
యోబు కథ ఇంతటితో అయిపోలేదు. ఆయన నిజంగా ప్రాముఖ్యమైన దాన్ని మర్చిపోయాడు. దానివల్ల తాను నీతిమంతుణ్ణని నిరూపించడంలో మునిగిపోయి దేవుని మంచితనాన్ని సమర్థించలేకపోయాడు. ఆయన్ని సరిదిద్దాల్సి వచ్చింది, విషయాల్ని యెహోవాలా చూడడానికి సహాయం చేయాల్సి వచ్చింది. మరోవైపు నొప్పితో, బాధతో సతమతమౌతున్న యోబుకు నిజమైన ఓదార్పు అవసరమైంది. ఎంతో విశ్వాసం, యథార్థత ఉన్న యోబుకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు? మరో ఆర్టికల్లో దానిగురించి చర్చించబడుతుంది.
a విచిత్రం ఏంటంటే, తాను అలాగే తన స్నేహితులు గట్టిగా మాట్లాడలేదు కాబట్టి యోబుతో దయగా మాట్లాడామని ఎలీఫజు అనుకున్నాడు. (యోబు 15:11) కానీ మృదువైన స్వరంతో పలికే మాటలు కూడా కఠినంగా, క్రూరంగా ఉండగలవు.
b మనకు తెలిసినంతవరకు, భూమిని ఒక వస్తువు లేదా పదార్థం మోయాల్సిన అవసరం లేదని సుమారు 3,000 సంవత్సరాల తర్వాతే శాస్త్రజ్ఞులు అర్థంచేసుకోవడం మొదలుపెట్టారు. అంతరిక్షానికి వెళ్లి ఫొటోలు తీశాకే, యోబు చెప్పింది నిజమని నిరూపించే బలమైన ఆధారాలు మనుషులకు దొరికాయి.