ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
బైబిలు ఇచ్చే జవాబు
ఇష్టంగా ముందుకొచ్చి, సరైన ఉద్దేశంతో వేరేవాళ్లకు ఏమైనా ఇవ్వడాన్ని బైబిలు ప్రోత్సహిస్తుంది. అలా ఇస్తే తీసుకున్నవాళ్లకే కాదు ఇచ్చినవాళ్లకు కూడా ప్రయోజనాలు ఉంటాయి. (సామెతలు 11:25; లూకా 6:38) యేసు ఇలా చెప్పాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొస్తలుల కార్యాలు 20:35.
ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఎప్పుడు ఉంటాయి?
స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు ప్రయోజనాలు ఉంటాయి. “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని బైబిలు చెప్తుంది.—2 కొరింథీయులు 9:7.
హృదయపూర్వకంగా ఇవ్వడం, దేవునికి ఇష్టమైన ఆరాధనలో ఒక భాగం. (యాకోబు 1:27) అవసరంలో ఉన్నవాళ్లకు ఉదారంగా ఇచ్చేవాళ్లు దేవునితో చేయిచేయి కలిపి పనిచేస్తారు, ఆయన అలాంటి ఉదారతను తనకు అప్పు ఇచ్చినట్లుగా భావిస్తాడు. (సామెతలు 19:17) అలా ఇచ్చేవాళ్లకు దేవుడే తిరిగి చెల్లిస్తాడు అని బైబిలు చెప్తుంది.—లూకా 14:12-14.
ఎలాంటప్పుడు ఇవ్వడం సరైంది కాదు?
స్వార్థంతో ఇవ్వడం సరైంది కాదు. ఉదాహరణకు:
వేరేవాళ్లను మెప్పించడానికి ఇవ్వడం.—మత్తయి 6:2.
తిరిగి ఏదైనా ఆశించి ఇవ్వడం.—లూకా 14:12-14.
రక్షణను లేదా దేవుని ఆమోదాన్ని కొనడానికి ఇవ్వడం.—కీర్తన 49:6, 7.
దేవునికి ఇష్టంలేని పనులకు మద్దతుగా ఇవ్వకూడదు. ఉదాహరణకు జూదం ఆడేవాళ్లకు, మత్తు పదార్థాలు, లేదా తాగుడుకు బానిసలైన వాళ్లకు డబ్బులు ఇవ్వడం తప్పు. (1 కొరింథీయులు 6:9, 10; 2 కొరింథీయులు 7:1) అలానే, ఏదైనా పని చేసుకుని ఆర్థికంగా తనను తాను చూసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా పనిచేయకుండా ఉండేవాళ్లకు ఇవ్వడం సరైంది కాదు.—2 థెస్సలొనీకయులు 3:10.
కుటుంబాన్ని చూసుకోకుండా ఇతరులకు ఇవ్వడం సరైంది కాదు. కుటుంబ పెద్దలు ఇంట్లో అవసరాలు చూసుకోవాలని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 5:8) కానీ సొంత కుటుంబాన్ని చూసుకోకుండా వేరేవాళ్లకే ఎక్కువగా ఇవ్వడం సరైంది కాదు. అలానే, ఆస్తులన్నీ “దేవునికి సమర్పించిన కానుక” అని చెప్పి వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి నిరాకరించినవాళ్లను యేసు తప్పుపట్టాడు.—మార్కు 7:9-13.