ఎందుకు ప్రార్థించాలి? దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడా?
బైబిలు ఇచ్చే జవాబు
అవును, జవాబిస్తాడు. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడని బైబిలు చెప్తుంది, కొంతమంది జీవిత అనుభవాలు కూడా ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి. బైబిలు ఇలా చెప్తుంది, “తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.” (కీర్త. 145:19) కానీ దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడా లేదా అనేది మీరు ఎలా ప్రార్థిస్తున్నారనే దానిమీదే ఆధారపడి ఉంది.
దేవుడు ఏం కోరుకుంటున్నాడు?
దేవునికి ప్రార్థించాలి. యేసుకు, మరియకు, సెయింట్లకు, దేవదూతలకు, విగ్రహాలకు ప్రార్థించకూడదు. ‘ప్రార్థన ఆలకించేవాడు’ యెహోవా దేవుడు మాత్రమే.—కీర్తన 65:2.
దేవుని ఇష్టానికి తగ్గట్టు ప్రార్థించాలి. ఎలా ప్రార్థిస్తే దేవుడు ఇష్టపడతాడో బైబిల్లో ఉంది.—1 యోహాను 5:14.
యేసు పేరున ప్రార్థించాలి, ఆ విధంగా యేసును ఘనపర్చాలి. “నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు” అని యేసు చెప్పాడు.—యోహాను 14:6.
విశ్వాసంతో ప్రార్థించాలి, అవసరమైతే ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా సహాయం చేయమని ప్రార్థించాలి.—మత్తయి 21:22; లూకా 17:5.
వినయంగా, నిజాయితీగా ఉండాలి. బైబిలు ఇలా చెప్తుంది, ‘యెహోవా ఉన్నతుడైనా, వినయస్థుల్ని గమనిస్తాడు.’—కీర్తన 138:6, NW.
పట్టుదలగా అడగాలి. యేసు ఇలా చెప్పాడు, “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది.”—లూకా 11:9.
దేవుడు ఏం పట్టించుకోడు?
మీరు ఏ తెగ లేదా దేశం అనేది దేవుడు పట్టించుకోడు. ‘దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ దేశంలో, దేవునికి భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.’—అపొ. 10:34, 35.
మీరు ఏ భంగిమలో ప్రార్థిస్తున్నారు అనేది దేవునికి ముఖ్యం కాదు. మీరు కూర్చొని, వంగి, మోకాళ్లూని, నిలబడి ప్రార్థించినా దేవుడు వింటాడు.—1 దినవృత్తాంతాలు 17:16; నెహెమ్యా 8:6; దానియేలు 6:10; మార్కు 11:25.
బిగ్గరగా ప్రార్థిస్తున్నారా, మనసులో ప్రార్థించుకుంటున్నారా అనేది దేవునికి ముఖ్యం కాదు. ఇతరులకు తెలియకుండా మనసులో చేసుకునే ప్రార్థనలకు కూడా దేవుడు జవాబిస్తాడు.—నెహెమ్యా 2:1-6.
మీ ఆందోళన పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదు. ‘మీరంటే పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా’ తనమీద వేయమని దేవుడు అందర్నీ ప్రోత్సహిస్తున్నాడు.—1 పేతురు 5:7.