జంతువులు పరలోకానికి వెళ్తాయా?
బైబిలు ఇచ్చే జవాబు
భూమ్మీద చాలా రకాల ప్రాణులు ఉన్నప్పటికీ, కేవలం కొద్దిమంది మనుషులే పరలోకానికి వెళ్తారని బైబిలు చెప్తుంది. (ప్రకటన 14:1, 3) అక్కడ వాళ్లు యేసుతో కలిసి రాజులుగా, యాజకులుగా పరిపాలన చేస్తారు. (లూకా 22:28-30; ప్రకటన 5:9, 10) కానీ మనుషుల్లో చాలామంది పరదైసుగా మారిన భూమ్మీద శాశ్వతంగా జీవించడానికి పునరుత్థానం అవుతారు.—కీర్తన 37:11, 29.
అయితే పెంపుడు జంతువులకు, కుక్కలకు ఒక పరలోకం ఉన్నట్లు బైబిలు చెప్పట్లేదు. అందుకు సరైన కారణమే ఉంది. ఎందుకంటే “పరలోక పిలుపు” పొందడానికి అర్హత సంపాదించే సామర్థ్యం జంతువులకు లేదు. (హెబ్రీయులు 3:1) అలా అర్హత సంపాదించాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి, విశ్వాసం ఉంచాలి, దేవుని ఆజ్ఞల్ని పాటించాలి. (మత్తయి 19:17; యోహాను 3:16; 17:3) కాబట్టి కేవలం మనుషులు మాత్రమే శాశ్వతకాలం జీవించేలా సృష్టించబడ్డారు.—ఆదికాండము 2:16, 17; 3:22, 23.
చనిపోయిన ప్రాణి పరలోకానికి వెళ్లాలంటే పునరుత్థానం అవ్వాలి. (1 కొరింథీయులు 15:42) బైబిల్లో ఎన్నో పునరుత్థానాల గురించిన ప్రస్తావన ఉంది. (1 రాజులు 17:17-24; 2 రాజులు 4:32-37; 13:20, 21; లూకా 7:11-15; 8:41, 42, 49-56; యోహాను 11:38-44; అపొస్తలుల కార్యాలు 9:36-42; 20:7-12) అయితే అవన్నీ మనుషుల పునరుత్థానాలే గానీ జంతువుల పునరుత్థానాలు కాదు.
చనిపోయిన జంతువులకు ఏమౌతుంది?
దేవుడు జంతువుల ప్రాణాన్ని, మనుషులు ప్రాణాన్ని రెండింటినీ ఒకేలా చూస్తున్నాడని బైబిలు చెప్తుంది. (సంఖ్యాకాండము 31:28) మనుషులైనా, జంతువులైనా ‘నేలమట్టి,’ “జీవవాయువు” నుండే తయారుచేయబడ్డాయి.—ఆదికాండము 2:7.
మనుషుల్లాగే జంతువులు కూడా చనిపోతాయని బైబిలు చెప్తుంది. (నిర్గమకాండము 19:13) చనిపోయాక మనుషులైనా, జంతువులైనా తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే. (ప్రసంగి 3:19, 20) ఇంకో మాటలో చెప్పాలంటే అవి ఉనికిలో ఉండవు. *
జంతువులు పాపం చేస్తాయా?
లేదు. పాపం చేయడం అంటే దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఆలోచించడం, భావించడం, ప్రవర్తించడం. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే సామర్థ్యం ఉన్న ప్రాణులే పాపం చేయగలుగుతాయి. కానీ జంతువులకు ఆ సామర్థ్యం లేదు. అవి జీవితకాలమంతా వాటి సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాయి. (2 పేతురు 2:12) ఏ పాపం చేయకపోయినా వాటి జీవితకాలం పూర్తయ్యాక అవి చనిపోతాయి.
జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించవచ్చా?
ప్రవర్తించకూడదు. దేవుడు మనుషులకు జంతువుల మీద అధికారం ఇచ్చాడు గానీ వాటితో క్రూరంగా ప్రవర్తించే హక్కు ఇవ్వలేదు. (ఆదికాండము 1:28; కీర్తన 8:6-8) దేవుడు చిన్నపక్షులతో సహా ప్రతీ జంతువు మీద శ్రద్ధ చూపిస్తాడు. (యోనా 4:11; మత్తయి 10:29) తన సేవకులు జంతువులతో దయగా ప్రవర్తించాలని ఆయన ఆజ్ఞాపించాడు.—నిర్గమకాండము 23:12; ద్వితీయోపదేశకాండము 25:4; సామెతలు 12:10.
^ పేరా 11 ఇంకా తెలుసుకోవాలనుకుంటే, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 6వ అధ్యాయం చూడండి