దేవుడు మనసు మార్చుకుంటాడా?
బైబిలు ఇచ్చే జవాబు
అవును, ప్రజలు తమ ప్రవర్తన మార్చుకున్నప్పుడు దేవుడు తన ఆలోచనను మార్చుకుంటాడు. ఉదాహరణకు, దేవుడు ఇశ్రాయేలీయులకు తన తీర్పు సందేశాన్ని పంపించినప్పుడు ఇలా చెప్పాడు, “వారి దుర్మార్గమునుబట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో.”—యిర్మీయా 26:3.
చాలా బైబిలు అనువాదాలు ఈ వచనాన్ని, దేవుడు తాను తీసుకురావాలనుకున్న నాశనం విషయంలో “సంతాపపడతాడు” లేదా “పశ్చాత్తాపపడతాడు” అని అనువదిస్తున్నాయి. దానివల్ల, ఆయన ఏదో పొరపాటు చేసి సంతాపపడుతున్నాడు అనే అర్థం వస్తుంది. కానీ, “సంతాపపడు” అనే మొదటి హీబ్రూ పదానికి “మనసు మార్చుకోవడం లేదా ఉద్దేశాన్ని మార్చుకోవడం” అని అర్థం. ఒక విద్వాంసుడు ఇలా రాశాడు “ఒక వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు, దేవుడు తన తీర్పుల్ని మార్చుకుంటాడు.”
అయితే, దేవుడు తన మనసు మార్చుకోగలడు కాబట్టి, ఆయన ప్రతీసారి తన మనసు మార్చుకోవాలి అని కాదు. దేవుడు తన మనసు మార్చుకోలేదు అని బైబిలు చెప్తున్న కొన్ని సందర్భాల్ని పరిశీలించండి:
బాలాకు తన మనసు మార్చి, ఇశ్రాయేలు జనాంగాన్ని శపించేందుకు దేవుడు అనుమతించలేదు.—సంఖ్యాకాండము 23:18-20.
ఇశ్రాయేలు రాజు సౌలు చెడుతనంలో బలంగా కూరుకుపోయినప్పుడు, అతన్ని రాజుగా తీసేయాలనే తన నిర్ణయాన్ని దేవుడు మార్చుకోలేదు.—1 సమూయేలు 15:28, 29.
తన కుమారుణ్ణి నిరంతరం యాజకునిగా ఉండేలా చేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఈ విషయంలో ఆయన తన మనసు మార్చుకోడు.—కీర్తన 110:4.
మరి, దేవుడు అస్సలు మారడని బైబిలు చెప్తుంది కదా?
అవును, “యెహోవానైన నేను మార్పులేనివాడను” అని దేవుడు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి. (మలాకీ 3:6) “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు” అని కూడా బైబిలు చెప్తుంది. (యాకోబు 1:17) దేవుడు తన మనసు మార్చుకుంటాడని బైబిలు చెప్తున్నదానికి ఇది విరుద్ధంగా లేదు. ఎందుకంటే, దేవుడు మార్పులేనివాడు అన్నప్పుడు దేవుడు తన లక్షణాల్ని, ప్రేమ-న్యాయం విషయంలో తన ప్రమాణాల్ని ఎప్పటికీ మార్చుకోడు అని అర్థం. (ద్వితీయోపదేశకాండము 32:4; 1 యోహాను 4:8) అయినప్పటికీ, ఆయన ప్రజలకు వేర్వేరు సమయాల్లో వేర్వేరు నిర్దేశాలు ఇవ్వవచ్చు. ఉదాహరణకు, దావీదు ఒక యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ఒకవిధమైన నిర్దేశాలిచ్చాడు, తర్వాత మరో యుద్ధం చేస్తున్నప్పుడు దానికి భిన్నమైన నిర్దేశాలిచ్చాడు. ఆ రెండు యుద్ధాల్లో దావీదు గెలిచాడు.—2 సమూయేలు 5:18-25.
మనుషుల్ని సృష్టించినందుకు దేవుడు బాధపడుతున్నాడా?
లేదు, కాని చాలామంది తనను లెక్క చేయనందుకు లేదా తిరస్కరిస్తున్నందుకు దేవుడు బాధపడుతున్నాడు. నోవహు కాలంలో జలప్రళయం రావడానికి ముందున్న పరిస్థితుల గురించి బైబిలు ఇలా చెప్తుంది, “తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.” (ఆదికాండము 6:6) ఈ లేఖనంలో “సంతాపము” అని అనువదించిన హీబ్రూ పదానికి “మనసు మార్చుకొను” అనే అర్థం కూడా ఉంది. జలప్రళయానికి ముందున్న చాలామంది ప్రజలు చెడ్డగా మారిపోయారు కాబట్టి దేవుడు వాళ్ల విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. (ఆదికాండము 6:5, 11) వాళ్లు అలా చెడ్డగా మారినందుకు దేవుడు బాధపడినా, మనుషులందరి పట్ల తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు. నిజానికి దేవుడు జలప్రళయం నుండి నోవహును ఆయన కుటుంబాన్ని కాపాడడం ద్వారా మానవజాతిని కాపాడాడు.—ఆదికాండము 8:21; 2 పేతురు 2:5, 9.