నిబంధన మందసం అంటే ఏమిటి?
బైబిలు ఇచ్చే జవాబు
నిబంధన మందసం అనేది, యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రాచీన ఇశ్రాయేలీయులు తయారు చేసిన ఒక పవిత్రమైన పెట్టె. ఆ పెట్టె కొలతలు, అది ఎలా ఉండాలి అనే సూచనలన్నీ యెహోవాయే ఇచ్చాడు. ఆ మందసంలో యెహోవా ఇచ్చిన “శాసనము” అంటే పది ఆజ్ఞలు రాసివున్న రెండు రాతిపలకల్ని భద్రంగా ఉంచేవాళ్లు.—నిర్గమకాండము 25:8-10, 16; 31:18.
నిర్మాణం. ఆ మందసం రెండున్నర మూరల పొడవు, ఒకటిన్నర మూరల వెడల్పు, ఒకటిన్నర మూరల ఎత్తు ఉండేది (111 x 67 x 67 సెం.మీ.; 44 x 26 x 26 ఇంచులు). దాన్ని తుమ్మచెక్కతో తయారుచేసి, లోపలా బయట బంగారు పూత పూసి, కళాత్మకత ఉట్టిపడేలా అంచులను చెక్కారు. స్వచ్ఛమైన బంగారంతో మందసానికి ఒక మూత తయారుచేశారు. అంతేకాదు రెండు బంగారు కెరూబులను తయారుచేసి ఆ మూత రెండు కొనలపై చెరొకటి ఉంచారు. ఆ కెరూబుల ముఖాలు ఎదురెదురుగా ఉండి, మందసం మూతను కప్పే విధంగా వాటి రెక్కలు పైకి విప్పబడినట్లుగా ఉండేవి. బంగారు ఉంగరాలు పోతపోసి వాటిని మందసపు నాలుగు కాళ్లకు పైన అంటించారు. ఆ తర్వాత తుమ్మచెక్కతో కర్రలు తయారుచేసి వాటికి బంగారు రేకు తొడిగి వాటిని బంగారు ఉంగరాల్లో ఉంచి, వాటి సహాయంతో మందసాన్ని మోసేవాళ్లు.—నిర్గమకాండము 25:10-21; 37:6-9.
స్థలం. మందసాన్ని తయారుచేసే సమయంలోనే ఒక ప్రత్యక్ష గుడారాన్ని కూడా తయారుచేశారు. ప్రత్యక్ష గుడారం అంటే, ఆరాధన కోసం ఉపయోగించబడేలా, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేందుకు వీలుగా ఉండేలా తయారుచేయబడిన ఒక గుడారం. మొదట్లో ఆ నిబంధన మందసాన్ని, ప్రత్యక్ష గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో ఉంచారు. ఆ అతిపరిశుద్ధ స్థలం యాజకులకు, ప్రజలకు కనిపించకుండా ఒక తెరను అడ్డంగా ఉంచారు. (నిర్గమకాండము 40:3, 21) కేవలం ప్రధానయాజకుడు మాత్రమే సంవత్సరంలో ఒకరోజు అంటే ప్రాయశ్చిత్తార్థ రోజున ఆ తెర లోపలికి వెళ్లి మందసాన్ని చూసేవాడు. (లేవీయకాండము 16:2; హెబ్రీయులు 9:7) కొంతకాలం తర్వాత, ఆ మందసాన్ని సొలొమోను ఆలయంలోని అతిపరిశుద్ధ స్థలంలోకి మార్చారు.—1 రాజులు 6:14, 19.
ఉద్దేశం. ఆ మందసంలో భద్రపర్చబడిన కొన్ని పవిత్రమైన వస్తువులు ఉండేవి. దేవుడు సీనాయి కొండమీద ఇశ్రాయేలీయులతో చేసిన ఒప్పందానికి అవి గుర్తుగా ఉండేవి. ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని చూసినప్పుడల్లా దేవుడు తమతో చేసిన ఒప్పందాన్ని వాళ్లు గుర్తుచేసుకునేవాళ్లు. ప్రాయశ్చిత్తార్థ రోజున చేసే ఆచరణలో ఆ మందసానికి ముఖ్యమైన పాత్ర ఉండేది.—లేవీయకాండము 16:3, 13-17.
మందసంలో ఉండే వస్తువులు. మొదట, పది ఆజ్ఞలు చెక్కబడివున్న రెండు రాతిపలకల్ని ఆ మందసంలో ఉంచారు. (నిర్గమకాండము 40:20) ఆ తర్వాత మన్నా ఉన్న బంగారు పాత్రను, చిగురించిన అహరోను కర్రను కూడా రాతిపలకలతో పాటు ఆ మందసంలో ఉంచారు. (హెబ్రీయులు 9:4; నిర్గమకాండము 16:33, 34; సంఖ్యాకాండము 17:10) అయితే కొంతకాలం తర్వాత బంగారు పాత్రను, అహరోను కర్రను మందసంలో నుండి తీసేశారు. అలాగని ఎలా చెప్పవచ్చు? ఎందుకంటే మందసాన్ని సొలొమోను ఆలయంలోకి మార్చే సమయానికి అవి మందసంలో లేవు.—1 రాజులు 8:9.
మందసాన్ని మోసుకెళ్లే విధానం. తుమ్మ చెక్కతో చేసిన కర్రల సహాయంతో లేవీయులు మందసాన్ని తమ భుజాలపై మోసుకొని వెళ్లాలి. (సంఖ్యాకాండము 7:9; 1 దినవృత్తాంతములు 15:15) ఆ కర్రలు ఎప్పుడూ మందసానికే ఉంటాయి కాబట్టి లేవీయులు నేరుగా మందసాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. (నిర్గమకాండము 25:12-16) ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలాన్ని, అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేస్తూ ఒక “తెర” ఉండేది. మందసాన్ని ఒక చోటు నుండి మరో చోటుకు మోసుకెళ్తున్నప్పుడు ఆ తెరను దానిపై కప్పేవాళ్లు.—సంఖ్యాకాండము 4:5, 6. a
మందసం దేన్ని సూచిస్తుంది? మందసం దేవుని ప్రత్యక్షతను సూచించేది. ఉదాహరణకు, అతిపరిశుద్ధ స్థలంలోని మందసం పై, అలాగే ఇశ్రాయేలీయుల డేరాలపై ఒక మేఘం ఉండేది. అది దేవుని ప్రత్యక్షతకు, ఆయన ఆశీర్వాదానికి గుర్తుగా ఉండేది. (లేవీయకాండము 16:2; సంఖ్యాకాండము 10:33-36) అంతేకాదు మందసంపై ఉన్న కెరూబుల గురించి బైబిలు మాట్లాడుతూ యెహోవా “కెరూబులమధ్య ఆసీనుడై” ఉండేవాడని చెప్తోంది. (1 సమూయేలు 4:4; కీర్తన 80:1) దీన్నిబట్టి, మందసంపై ఉన్న కెరూబులు యెహోవా ‘వాహనానికి’ లేదా రథానికి సూచనగా ఉన్నాయి. (1 దినవృత్తాంతములు 28:18) మందసం యెహోవా ప్రత్యక్షతకు, ఆయన ఆశీర్వాదానికి సూచనగా ఉండేది కాబట్టి, ఆ మందసాన్ని సీయోనుకు మార్చిన తర్వాత రాజైన దావీదు, యెహోవా “సీయోను వాసియై” ఉన్నాడు అని అన్నాడు.—కీర్తన 9:11.
బిరుదులు. ఆ పవిత్రమైన పెట్టెను వర్ణించడానికి బైబిలు చాలా పేర్లు ఉపయోగిస్తోంది. వాటిలో కొన్ని ఏమిటంటే, “సాక్ష్యపు మందసము,“ “నిబంధన మందసము,“ “యెహోవా నిబంధన మందసము,“ “బలమున కాధారమగు నీ [యెహోవా] మందసము.”—సంఖ్యాకాండము 7:89; యెహోషువ 3:6, 13; 2 దినవృత్తాంతములు 6:41.
మందసానికి ఉన్న మూతను “కరుణాపీఠపు గది” అని పిలిచేవాళ్లు. (1 దినవృత్తాంతములు 28:11) మూత అనే పదం, ప్రాయశ్చిత్తార్థ రోజున చేసే ఒక ప్రత్యేకమైన పనిని సూచిస్తుంది. ఆ రోజున ప్రధాన యాజకుడు బలి అర్పించిన జంతువుల రక్తాన్ని ఆ మూత వైపు, అలాగే దాని ముందు చిమ్ముతాడు. ప్రధాన యాజకుడు చేసే ఆ పనివల్ల ‘తన కోసం, తన ఇంటివాళ్ల కోసం, ఇశ్రాయేలీయుల సమాజమంతటి కోసం’ తమ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది లేదా వాళ్ల పాపాలు కప్పబడతాయి.—లేవీయకాండము 16:14-17.
నిబంధన మందసం ఇప్పటికీ ఉందా?
ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అసలు మనకాలంలో నిబంధన మందసం అవసరం లేదని బైబిలు చెప్తోంది. ఎందుకంటే అప్పట్లో నిబంధన మందసం ఏ ఒప్పందానికైతే గుర్తుగా ఉందో, దాని స్థానంలో యేసు బలిపై ఆధారపడిన “కొత్త ఒప్పందం” అమలులోకి వచ్చింది. (యిర్మీయా 31:31-33; హెబ్రీయులు 8:13; 12:24) అందుకే, నిబంధన మందసం ఉండని ఒక కాలం వస్తుందని, అయినాసరే దేవుని ప్రజలు దానిగురించి చింతపడరని బైబిలు ముందుగానే చెప్పింది.—యిర్మీయా 3:16.
కొత్త ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత అపొస్తలుడైన యోహానుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో అతనికి నిబంధన మందసం పరలోకంలో ఉన్నట్లు కనిపించింది. (ప్రకటన 11:15, 19) అతనికి కనిపించిన ఆ మందసం కొత్త ఒప్పందంపై దేవుని ప్రత్యక్షతను, ఆయన ఆశీర్వాదాన్ని సూచించింది.
నిబంధన మందసం అనేది అద్భుత శక్తులు ఉన్న పెట్టెనా?
కాదు. నిబంధన మందసం ఉన్నంత మాత్రాన విజయం వరించదు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు హాయి దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు మందసం ఇశ్రాయేలీయుల గుడారాల్లోనే ఉంది. అయినప్పటికీ ఒక ఇశ్రాయేలీయుడు చేసిన నమ్మకద్రోహంవల్ల వాళ్లు హాయి దేశస్థుల చేతుల్లో ఓడిపోయారు. (యెహోషువ 7:1-6) ఆ తర్వాత కూడా, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు నిబంధన మందసాన్ని తమతోపాటు యుద్ధం జరిగే స్థలానికి తీసుకెళ్లారు. అయినప్పటికీ వాళ్లు ఓడిపోయారు. అందుకుగల కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీయులైన హోఫ్నీ ఫీనెహాసు అనే ఇద్దరు యాజకుల చెడుతనమే. (1 సమూయేలు 2:12; 4:1-11) ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు నిబంధన మందసాన్ని ఎత్తుకెళ్లారు. అయితే వాళ్లు దాన్ని తిరిగి ఇశ్రాయేలుకు తీసుకొచ్చే వరకు యెహోవా ఫిలిష్తీయులపై తెగుళ్లు రప్పిస్తూనే వచ్చాడు.—1 సమూయేలు 5:11-6:5.
సంవత్సరం (సా.శ.పూ.) |
సంఘటన |
---|---|
1513 |
ఇశ్రాయేలీయులు స్వచ్ఛందంగా ఇచ్చిన వాటితో బెసలేలు, అతని సహాయకులు తయారుచేశారు.—నిర్గమకాండము 25:1, 2; 37:1. |
1512 |
మోషే, ఇతర యాజకులు ప్రత్యక్షగుడారంతో పాటు పవిత్రపర్చారు.—నిర్గమకాండము 40:1-3, 9, 20, 21. |
1512—1070 తర్వాత |
వేర్వేరు చోట్లకు తీసుకెళ్లారు.—యెహోషువ 18:1; న్యాయాధిపతులు 20:26, 27; 1 సమూయేలు 1:24; 3:3; 6:11-14; 7:1, 2. |
1070 తర్వాత |
రాజైన దావీదు తిరిగి యెరూషలేముకు తీసుకొచ్చాడు.—2 సమూయేలు 6:12. |
1026 |
యెరూషలేములోని సొలొమోను ఆలయంలోకి మార్చారు.—1 రాజులు 8:1, 6. |
642 |
రాజైన యోషీయా దాన్ని తిరిగి ఆలయంలోకి చేర్చాడు.—2 దినవృత్తాంతములు 35:3. b |
607కన్నా ముందు |
బహుశా ఆలయం నుండి తీసేసి ఉండవచ్చు. సా.శ.పూ. 607 లో ఆలయాన్ని నాశనం చేసేటప్పుడు బబులోనుకు తీసుకెళ్లిన వస్తువుల లిస్టులో, అలాగే తిరిగి యెరూషలేముకు అప్పగించిన వస్తువుల లిస్టులో లేదు.—2 రాజులు 25:13-17; ఎజ్రా 1:7-11. |
63 |
రోమా జనరల్ అయిన పాంపే యెరూషలేమును జయించి ఆలయంలోని అతిపరిశుద్ధ స్థలాన్ని తనిఖీ చేసినప్పుడు, ఆ వస్తువు లేదని ప్రకటించాడు. c |
a మందసాన్ని మోసుకెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాల విషయంలో, అలాగే దాన్ని కప్పే విషయంలో దేవుడు ఇచ్చిన నిర్దేశాల్ని పెడచెవిన పెట్టినప్పుడు ఇశ్రాయేలీయులు ఘోరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.—1 సమూయేలు 6:19; 2 సమూయేలు 6:2-7.
b దాన్ని ఎప్పుడు, ఎందుకు లేదా ఎవరు తీశారు అనే వివరాలు బైబిల్లో లేవు.
c టాసిటస్ రాసిన The Histories, అనే పుస్తకం 5వ సంపుటిలోని 9వ పేరా చూడండి.