“నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము” అంటే అర్థమేంటి?
బైబిలు ఇచ్చే జవాబు
“నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము” అనే ఆజ్ఞ బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది. (నిర్గమకాండము 20:12; ద్వితీయోపదేశకాండము 5:16; మత్తయి 15:4; ఎఫెసీయులు 6:2, 3) అలా సన్మానించాలంటే నాలుగు పనులు చేయాలి.
కృతజ్ఞతతో ఉండండి. మీ అమ్మానాన్నలు మీకోసం చేసిన వాటన్నిటికి కృతజ్ఞత చూపించడం ద్వారా మీరు వాళ్లను సన్మానించవచ్చు. అలా కృతజ్ఞత చూపించే ఒక మార్గం ఏంటంటే, వాళ్లిచ్చే నడిపింపును స్వీకరించడం. (సామెతలు 7:1, 2; 23:26) అమ్మానాన్నలు మీకు “అలంకారము” అని బైబిలు చెప్తుంది. అంటే వాళ్లు మీ అమ్మానాన్నలుగా ఉన్నందుకు మీరు గర్వపడాలని అర్థం.—సామెతలు 17:6.
అధికారాన్ని ఒప్పుకోండి. అమ్మానాన్నలకు దేవుడిచ్చిన అధికారాన్ని గుర్తించడం ద్వారా పిల్లలు వాళ్లను సన్మానించవచ్చు. కొలొస్సయులు 3:20 పిల్లలకు ఇలా చెప్తుంది: “మీరు ప్రతీ విషయంలో మీ అమ్మానాన్నల మాట వినండి. ఇది ప్రభువుకు ఇష్టం.” చిన్నప్పుడు యేసు కూడా అమ్మానాన్నలకు సంతోషంగా లోబడ్డాడు.—లూకా 2:51.
గౌరవంతో మెలగండి. (లేవీయకాండము 19:3; హెబ్రీయులు 12:9) మీ మాటల్లో, మాట్లాడే విధానంలో కూడా గౌరవం ఉండాలి. నిజమే, కొన్నిసార్లు అమ్మానాన్నల ప్రవర్తన వల్ల వాళ్లను గౌరవించడం మనకు కష్టమవ్వవచ్చు. అయినాసరే మన మాటల్లో, పనుల్లో గౌరవం చూపించడం ద్వారా వాళ్లను సన్మానించగలుగుతాం. (సామెతలు 30:17) అమ్మను గానీ నాన్నను గానీ తిట్టడం ఘోరమైన తప్పు అని బైబిలు చెప్తుంది.—మత్తయి 15:4.
అవసరాలు తీర్చండి. అమ్మానాన్నలు వృద్ధులైనప్పుడు, వాళ్లకు మీ సహాయం అవసరం అవ్వొచ్చు. వాళ్ల అవసరాలు తీర్చడానికి మీరు చేయగలిగినదంతా చేయడం ద్వారా వాళ్లను సన్మానిస్తున్నారని చూపిస్తారు. (1 తిమోతి 5:4, 8) యేసు విషయమే తీసుకోండి. ఆయన చనిపోబోయే ముందు తన తల్లి యోగక్షేమాలు చూసుకోవడానికి ఏర్పాటు చేశాడు.—యోహాను 19:25-27.
అమ్మానాన్నల్ని సన్మానించడం అంటే ఏమి కాదు?
అపోహ: అమ్మానాన్నల్ని సన్మానించాలంటే మీ వైవాహిక జీవితాన్ని కూడా వాళ్ల చేతుల్లోనే పెట్టాలి.
నిజం: వేరే ఏ కుటుంబ బంధం కన్నా భార్యాభర్తల బంధమే ముఖ్యమైనదని బైబిలు చెప్తుంది. ఆదికాండము 2:24, NWలో ఇలా ఉంది: “పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లు ఒక్క శరీరం అవుతారు.” (మత్తయి 19:4, 5) అంటే భార్యాభర్తలు తమ తల్లిదండ్రుల సలహాలు లేదా అత్తామామల సలహాలు తీసుకోకూడదని కాదు. (సామెతలు 23:22) కానీ తమ వైవాహిక జీవితంలో బంధువుల జోక్యం ఎంతవరకు ఉండాలనేది దంపతులే నిర్ణయించుకోవాలి.—మత్తయి 19:6.
అపోహ: అందరి కంటే ఎక్కువగా అమ్మానాన్నలకే పూర్తి అధికారం ఉంటుంది.
నిజం: దేవుడు తల్లిదండ్రులకు అధికారం ఇచ్చినప్పటికీ, అది పరిమితమైనదే. నిజానికి, మనుషులకు ఉన్న ఏ అధికారమైనా, దేవునికున్న అధికారంతో పోలిస్తే తక్కువే. దేవునికి లోబడవద్దని మహాసభ ఆజ్ఞాపించినప్పుడు, యేసు శిష్యులు ఇలా స్పందించారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.” (అపొస్తలుల కార్యాలు 5:27-29) అదేవిధంగా, పిల్లలు కూడా “ప్రభువు ఇష్టానికి అనుగుణంగా,” అంటే దేవుని నియమాలకు వ్యతిరేకం కానంత వరకు అమ్మానాన్నలకు లోబడతారు.—ఎఫెసీయులు 6:1.
అపోహ: అమ్మానాన్నల్ని సన్మానించడంలో, వాళ్ల మత నమ్మకాలను పాటించడం కూడా ఉంది.
నిజం: మనం నమ్మే విషయాలు నిజమో కాదో నిర్ధారించుకోమని బైబిలు చెప్తుంది. (అపొస్తలుల కార్యాలు 17:11; 1 యోహాను 4:1) అలా నిర్ధారించుకున్న వ్యక్తి, బహుశా తన తల్లిదండ్రుల మత నమ్మకాలకు బదులు వేరే నమ్మకాలను పాటించాలని నిర్ణయించుకోవచ్చు. అబ్రాహాము, రూతు, అపొస్తలుడైన పౌలు అదే చేశారు. అలాంటి నిర్ణయం తీసుకున్న చాలామంది దేవుని సేవకుల గురించి బైబిలు ప్రస్తావిస్తుంది.—యెహోషువ 24:2, 14, 15; రూతు 1:15, 16; గలతీయులు 1:14-16, 22-24.
అపోహ: పూర్వీకులను ఆరాధించడం వంటి ఆచారాల్లో పాల్గొనకపోతే, తల్లిదండ్రుల్ని సన్మానించినట్లు అవ్వదు.
నిజం: బైబిలు ఇలా చెప్తుంది: “నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించాలి. ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి.” (లూకా 4:8) పూర్వీకులను ఆరాధించే వ్యక్తి దేవునికి ఇష్టంలేని పని చేస్తున్నట్లే. నిజానికి, “చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు” అని బైబిలు చెప్తుంది. మనం వాళ్లను గౌరవించిన సంగతి కూడా వాళ్లకు తెలీదు; వాళ్లు మనకు సహాయమూ చేయలేరు, హానీ చేయలేరు.—ప్రసంగి 9:5, 10, NW; యెషయా 8:19.