పవిత్రంగా ఉండడం అంటే ఏమిటి?
బైబిలు ఇచ్చే జవాబు
కల్మషం నుండి దూరంగా ఉండడాన్నే పవిత్రత అంటారు. “పవిత్రత” అని అనువదించబడిన హీబ్రూ పదం “వేరుగా ఉండడం” అని అర్థాన్నిచ్చే పదం నుండి వచ్చింది. కాబట్టి ప్రత్యేకించి శుభ్రంగా, స్వచ్ఛంగా ఉన్నవాటిని, పవిత్రమైనవాటిగా లేదా పరిశుద్ధంగా చూస్తారు.
దేవుడు అత్యంత పవిత్రుడు. దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు.” a (1 సమూయేలు 2:2) కాబట్టి పవిత్రతకు దేవుడే సరైన ప్రమాణం.
నేరుగా దేవునికి సంబంధించిన వేటికైనా, మరిముఖ్యంగా ఆరాధనలో మాత్రమే ఉపయోగించేవాటికి “పవిత్రం” అనే పదాన్ని అన్వయించవచ్చు. ఉదాహరణకు ఈ కిందివాటి గురించి బైబిలు ఇలా చెప్తుంది:
పవిత్ర స్థలాలు: మండుతున్న ఒక పొద దగ్గర దేవుడు మోషేకు ఇలా చెప్పాడు: “నువ్వు నిలబడిన నేల పవిత్రమైనది.”—నిర్గమకాండము 3:2-5.
పవిత్రమైన సందర్భాలు: ప్రాచీన ఇశ్రాయేలీయులు, క్రమంగా జరుపుకునే మతపరమైన పండుగల్లో యెహోవాను ఆరాధించేవాళ్లు. వీటిని వాళ్లు “పరిశుద్ధ సంఘపు దినములు” అని పిలిచేవాళ్లు.—లేవీయకాండము 23:37.
పవిత్రమైన వస్తువులు: యెరూషలేములోని ప్రాచీన దేవాలయంలో దేవుని ఆరాధన కోసం ఉపయోగించే వస్తువులను ‘పరిశుద్ధ ఉపకరణములు’ అనేవాళ్లు. (1 రాజులు 8:4) ఆ పవిత్రమైన వస్తువుల్ని గౌరవంగా ఉపయోగించాలి, అయితే వాటిని ఎన్నటికీ ఆరాధించకూడదు. b
అపరిపూర్ణుడైన ఒక వ్యక్తి పవిత్రంగా ఉండగలడా?
ఉండగలడు. ఎందుకంటే, క్రైస్తవులను దేవుడు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: “నేను పవిత్రుణ్ణి కాబట్టి మీరు కూడా పవిత్రులుగా ఉండాలి.” (1 పేతురు 1:16) నిజమే, మనుషులు అపరిపూర్ణులు కాబట్టి దేవుని పరిశుద్ధతా ప్రమాణాలను ఎన్నడూ చేరుకోలేరు. అయితే, ఆయన నీతి ప్రమాణాలను పాటించేవాళ్లు “పవిత్రమైన, దేవునికి ఇష్టమైన” ప్రజలుగా ఉంటారు. (రోమీయులు 12:1) పవిత్రంగా ఉండడానికి కృషి చేసే వ్యక్తి తన మాటల్లో, ప్రవర్తనలో దాన్ని చూపిస్తాడు. ఉదాహరణకు అలాంటి ఒక వ్యక్తి “పవిత్రులుగా ఉంటూ లైంగిక పాపాలకు దూరంగా” ఉండమని, “ప్రవర్తనంతటిలో పవిత్రులు” అవ్వమని బైబిలు ఇచ్చే సలహాను పాటిస్తాడు.—1 థెస్సలొనీకయులు 4:3; 1 పేతురు 1:15.
దేవుని దృష్టిలో అపవిత్రులు అయ్యే అవకాశం ఉందా?
ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని ప్రమాణాలకు తగిన మంచి ప్రవర్తనను విడిచిపెడితే, అప్పుడు దేవుడు అతన్ని పవిత్రుడిగా ఎంచడు. ఉదాహరణకు, బైబిల్లోని హెబ్రీయులకు రాసిన పుస్తకం ‘పవిత్ర సహోదరులు’ అంటూనే, “జీవంగల దేవునికి దూరమవ్వడం వల్ల... విశ్వాసంలేని దుష్ట హృదయంగా మారిపోయే ప్రమాదముంది” అని హెచ్చరిస్తోంది.—హెబ్రీయులు 3:1, 12.
పవిత్రంగా ఉండడం గురించిన అపోహలు
అపోహ: వైరాగ్యం పాటిస్తే పవిత్రులుగా ఉంటాం.
నిజం: ‘శరీరానికి హాని చేసుకోవడం’ లేదా తీవ్రమైన వైరాగ్యం దేవుని దృష్టిలో ఏమాత్రం విలువలేనివని బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 2:23) నిజానికి మనం మంచివాటిని ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. “ప్రతీ వ్యక్తి తింటూ తాగుతూ తన కష్టమంతటిని బట్టి సుఖపడాలి. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి.”—ప్రసంగి 3:13.
అపోహ: బ్రహ్మచర్యం వల్ల ఎక్కువ పవిత్రంగా ఉండవచ్చు.
నిజం: ఒక క్రైస్తవుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకుంటే అలాగే ఉండవచ్చు. కానీ, కేవలం బ్రహ్మచారిగా ఉండడం వల్ల అతను దేవుని దృష్టిలో పవిత్రుడు కాలేడు. నిజమే, పెళ్లి చేసుకోకుండా ఉన్న వ్యక్తి ఆరాధనపై పూర్తిగా శ్రద్ధ పెట్టగలడు. (1 కొరింథీయులు 7:32-34) అయితే, పెళ్లి చేసుకున్నవాళ్లు కూడా పవిత్రులుగా ఉండగలరని బైబిలు రుజువు చేస్తుంది. ఉదాహరణకు, యేసు అపొస్తలుల్లో ఒకడైన పేతురు వివాహితుడే.—మత్తయి 8:14; 1 కొరింథీయులు 9:5.
a దేవుని వ్యక్తిగత పేరు యెహోవా. బైబిల్లో కొన్ని వందల వచనాలు ఈ పేరుకు అనుబంధంగా “పవిత్రం”, “పవిత్రత” అనే పదాలను ఉపయోగించాయి.
b మతపరమైన చిహ్నాలను పూజించడాన్ని బైబిలు ఖండిస్తుంది.—1 కొరింథీయులు 10:14.