బాప్తిస్మం అంటే ఏంటి?
బైబిలు ఇచ్చే జవాబు
బాప్తిస్మం తీసుకోవాలంటే ఒక వ్యక్తి పూర్తిగా నీళ్లలో మునగాలి. a బాప్తిస్మం తీసుకున్న చాలామంది గురించి బైబిల్లో ఉంది. (అపొస్తలుల కార్యాలు 2:41) అందులో యేసు కూడా ఉన్నాడు, ఆయన యొర్దాను నదిలో మునిగి బాప్తిస్మం తీసుకున్నాడు. (మత్తయి 3:13, 16) కొన్నేళ్ల తర్వాత, ఒక ఇతియోపీయుడు బాప్తిస్మం తీసుకోవాలని అనుకున్నప్పుడు, అతను అలాగే ఫిలిప్పు దారి పక్కన ఉన్న “నీళ్లలోకి దిగారు.”—అపొస్తలుల కార్యాలు 8:36-40.
తన శిష్యులు తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని యేసు బోధించాడు. (మత్తయి 28:19, 20) అపొస్తలుడైన పేతురు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశాడు.—1 పేతురు 3:21.
ఈ ఆర్టికల్లో …
బాప్తిస్మం అంటే ఏంటి?
ఒక వ్యక్తి తన పాపాల గురించి పశ్చాత్తాపపడ్డాడని, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుడు చెప్పినట్టే చేస్తానని దేవునికి మాటిచ్చాడని బాప్తిస్మం ఇతరులకు చూపిస్తుంది. అతను అన్ని విషయాల్లో దేవునికి, యేసుకు లోబడాలి. బాప్తిస్మం తీసుకున్నవాళ్లు శాశ్వత జీవితానికి తీసుకెళ్లే దారిలో అడుగులు వేయడం మొదలుపెడుతున్నారు.
ఒక వ్యక్తిని నీళ్లలో ముంచడం, అతను జీవితంలో చేసుకున్న మార్పులకు చక్కగా అద్దంపడుతుంది. అదెలా? బైబిలు బాప్తిస్మాన్ని పాతిపెట్టడంతో పోలుస్తుంది. (రోమీయులు 6:4; కొలొస్సయులు 2:12) ఒక వ్యక్తి నీళ్లలో మునిగినప్పుడు, అతను తన పాత జీవన విధానం విషయంలో చనిపోయాడని చూపిస్తున్నాడు. అతను నీళ్లలో నుండి బయటికి వచ్చినప్పుడు, దేవునికి సమర్పించుకున్న క్రైస్తవుడిగా ఒక కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నాడు.
పసిపిల్లల బాప్తిస్మం గురించి బైబిలు ఏం చెప్తుంది?
పసిపిల్లలకు బాప్తిస్మం ఇవ్వాలని బైబిలు చెప్పట్లేదు. b
బదులుగా, బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలని అది చెప్తుంది. ఉదాహరణకు, అతను బైబిల్లోని ప్రాథమిక బోధల్ని అర్థంచేసుకోవాలి, వాటి ప్రకారం జీవిస్తూ ఉండాలి. తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి ఉండాలి. ప్రార్థనలో దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ఉండాలి. (అపొస్తలుల కార్యాలు 2:38, 41; 8:12) పసిపిల్లలు ఈ పనులు చేయలేరు.
తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి?
యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “ప్రజల్ని శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.” (మత్తయి 28:19, 20) “పేరున” అంటే, బాప్తిస్మం తీసుకుంటున్న వాళ్లు తండ్రి అధికారాన్ని-స్థానాన్ని, కుమారుడి అధికారాన్ని-స్థానాన్ని, అలాగే దేవుని పవిత్రశక్తి పాత్రను అర్థంచేసుకోవాలి, అంగీకరించాలి. దాన్ని అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చూడండి. పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తితో అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “నజరేయుడైన యేసుక్రీస్తు పేరున చెప్తున్నాను, లేచి నడువు!” (అపొస్తలుల కార్యాలు 3:6) అంటే పేతురు క్రీస్తు అధికారాన్ని గుర్తించాడు, అంగీకరించాడు, క్రీస్తు వల్లే ఆ వ్యక్తి అద్భుతరీతిలో బాగౌతున్నాడని చెప్తున్నాడు.
“తండ్రి” యెహోవా c దేవుడు. సృష్టికర్త, జీవదాత, సర్వశక్తిగల దేవునిగా యెహోవాకు సంపూర్ణ అధికారం ఉంది.—ఆదికాండం 17:1; ప్రకటన 4:11.
“కుమారుడు” యేసుక్రీస్తు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. (రోమీయులు 6:23) మనుషుల గురించి దేవుడు అనుకున్నది చేయడంలో క్రీస్తుకున్న ముఖ్యమైన పాత్రను అర్థంచేసుకొని, అంగీకరిస్తేనే మనకు రక్షణ వస్తుంది.—యోహాను 14:6; 20:31; అపొస్తలుల కార్యాలు 4:8-12.
“పవిత్రశక్తి” దేవుని చురుకైన శక్తి, లేదా కార్యాచరణలో ఉన్న ఆయన శక్తి. d సృష్టిని చేయడానికి, జీవాన్ని ఇవ్వడానికి, తన ప్రవక్తలకు అలాగే ఇతరులకు సందేశాలు పంపించడానికి, తన ఇష్టం చేసేలా వాళ్లను బలపర్చడానికి దేవుడు తన పవిత్రశక్తిని ఉపయోగించాడు. (ఆదికాండం 1:2; యోబు 33:4; రోమీయులు 15:18, 19) బైబిలు రాసినవాళ్లు తన ఆలోచనల్ని రాసేలా ప్రేరేపించడానికి కూడా దేవుడు పవిత్రశక్తిని ఉపయోగించాడు.—2 పేతురు 1:21.
రెండోసారి బాప్తిస్మం తీసుకోవడం తప్పా?
ప్రజలు మతం మార్చుకోవడం అనేది తరచూ జరుగుతుంది. వాళ్లు ఒకవేళ అంతకుముందు వెళ్లిన చర్చిలో బాప్తిస్మం తీసుకొని ఉంటే అప్పుడేంటి? వాళ్లు మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం తప్పా? ఎఫెసీయులు 4:5 ప్రకారం అది తప్పు అని కొంతమంది అంటారు. ఆ వచనంలో ఇలా ఉంది: “ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే.” దానర్థం, ఒక వ్యక్తి రెండోసారి బాప్తిస్మం తీసుకోకూడదని కాదు. అలా ఎందుకు చెప్పవచ్చు?
సందర్భం. ఎఫెసీయులు 4:5 సందర్భాన్ని గమనిస్తే, అక్కడ పౌలు నిజ క్రైస్తవులు తమ నమ్మకాలు, విశ్వాసం విషయంలో ఒకటిగా ఉండాలని చెప్తున్నాడు. (ఎఫెసీయులు 4:1-3, 16) అలా ఉండాలంటే వాళ్లందరూ ఒకే ప్రభువును, అంటే యేసుక్రీస్తును అనుసరించాలి; వాళ్లకు ఒకే విశ్వాసం ఉండాలి, అంటే బైబిలు చెప్పేవాటిని ఒకేలా అర్థంచేసుకోవాలి; అలాగే బాప్తిస్మం కోసం బైబిలు పెట్టే ఒకేలాంటి అర్హతలు చేరుకోవాలి.
అప్పటికే బాప్తిస్మం తీసుకున్న కొందర్ని అపొస్తలుడైన పౌలు మళ్లీ బాప్తిస్మం తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే, వాళ్లు క్రైస్తవ బోధల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే బాప్తిస్మం తీసుకున్నారు.—అపొస్తలుల కార్యాలు 19:1-5.
బాప్తిస్మానికి సరైన ఆధారం. మన బాప్తిస్మాన్ని దేవుడు అంగీకరించాలంటే, మనం బైబిలు సత్యాల్ని సరిగ్గా అర్థంచేసుకొని బాప్తిస్మం తీసుకోవాలి. (1 తిమోతి 2:3, 4) ఒక వ్యక్తి బైబిలుకు విరుద్ధమైన మత బోధల ఆధారంగా బాప్తిస్మం తీసుకుంటే, ఆ బాప్తిస్మాన్ని దేవుడు ఒప్పుకోడు. (యోహాను 4:23, 24) అతని ఉద్దేశాలు మంచివే అయినా, అతను “సరైన జ్ఞానానికి అనుగుణంగా” బాప్తిస్మం తీసుకోలేదు. (రోమీయులు 10:2) దేవుని ఆమోదం పొందాలంటే అతను బైబిల్లో ఉన్న సత్యాల్ని తెలుసుకోవాలి, నేర్చుకున్న వాటిని పాటించాలి, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, తర్వాత మళ్లీ బాప్తిస్మం తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో రెండోసారి బాప్తిస్మం తీసుకోవడం తప్పుకాదు. నిజానికి అది సరైనది.
బైబిల్లో ఇంకా ఎలాంటి బాప్తిస్మాల గురించి ఉంది?
క్రీస్తు అనుచరులు నీళ్లలో మునిగి తీసుకునే బాప్తిస్మం గురించే కాకుండా వేరే అర్థం ఉన్న ఇతర బాప్తిస్మాల గురించి కూడా బైబిల్లో ఉంది. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.
బాప్తిస్మమిచ్చే యోహాను ఇచ్చిన బాప్తిస్మం. e యూదులు, యూదులుగా మారిన ఇతరులు మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసిన పాపాలకు పశ్చాత్తాప పడుతున్నామని చూపించడానికి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం మెస్సీయను, అంటే నజరేయుడైన యేసును గుర్తుపట్టడానికి, అంగీకరించడానికి ప్రజలను సిద్ధం చేసింది.—లూకా 1:13-17; 3:2,3; అపొస్తలుల కార్యాలు 19:4.
యేసు తీసుకున్న బాప్తిస్మం. బాప్తిస్మమిచ్చే యోహాను దగ్గర యేసు తీసుకున్న బాప్తిస్మం మిగతా బాప్తిస్మాలన్నిటి కన్నా వేరు. యేసు పరిపూర్ణుడు, ఆయన ఏ పాపం చేయలేదు. (1 పేతురు 2:21, 22) కాబట్టి ఆయన బాప్తిస్మం పశ్చాత్తాపానికి సూచన కాదు, అలాగే “మంచి మనస్సాక్షి కోసం దేవునికి చేసుకునే విన్నపం” కూడా కాదు. (1 పేతురు 3:21) బదులుగా అది, వాగ్దానం చేయబడిన మెస్సీయ లేదా క్రీస్తుగా దేవుని ఇష్టాన్ని చేయడానికి తనను తాను దేవునికి అర్పించుకుంటున్నాడని చూపిస్తుంది. అందులో మన కోసం చనిపోవడం కూడా ఉంది.—హెబ్రీయులు 10:7-10.
పవిత్రశక్తితో బాప్తిస్మం. బాప్తిస్మమిచ్చే యోహాను, అలాగే యేసుక్రీస్తు ఇద్దరూ పవిత్రశక్తితో ఇచ్చే బాప్తిస్మం గురించి మాట్లాడారు. (మత్తయి 3:11; లూకా 3:16; అపొస్తలుల కార్యాలు 1:1-5) దానికీ పవిత్రశక్తి పేరున ఇచ్చే బాప్తిస్మానికీ తేడా ఉంది. (మత్తయి 28:19) అలా అని ఎందుకు చెప్పవచ్చు?
యేసు అనుచరుల్లో కొంతమంది మాత్రమే పవిత్రశక్తితో బాప్తిస్మం పొందుతారు. వీళ్లు పవిత్రశక్తితో అభిషేకించబడతారు. ఎందుకంటే వీళ్లు పరలోకంలో క్రీస్తుతోపాటు ఉంటూ రాజులుగా భూమిని పరిపాలించడానికి, యాజకులుగా సేవచేయడానికి పిలవబడ్డారు. f (1 పేతురు 1:3, 4; ప్రకటన 5:9, 10) వాళ్లు, అందమైన తోటలా మారే భూమ్మీద శాశ్వతకాలం జీవించే కోట్లమంది యేసు అనుచరుల్ని పరిపాలిస్తారు.—మత్తయి 5:5; లూకా 23:43.
క్రీస్తుయేసులోకి, ఆయన మరణంలోకి బాప్తిస్మం. పవిత్రశక్తితో బాప్తిస్మం పొందినవాళ్లు ‘క్రీస్తు యేసులోకి’ కూడా బాప్తిస్మం పొందుతారు. (రోమీయులు 6:3, పరిశుద్ధ గ్రంథము) కాబట్టి పరలోకంలో యేసుతోపాటు పరిపాలించే ఆయన అభిషిక్త అనుచరులకు ఈ బాప్తిస్మం వర్తిస్తుంది. యేసులోకి బాప్తిస్మం పొందడం ద్వారా వాళ్లు ఆయన అభిషిక్త సంఘంలో సభ్యులౌతారు. దానికి శిరస్సు యేసు, వాళ్లేమో శరీరం.—1 కొరింథీయులు 12:12, 13, 27; కొలొస్సయులు 1:18.
అభిషిక్త క్రైస్తవులు ‘యేసు మరణంలోకి కూడా బాప్తిస్మం’ పొందుతారు. (రోమీయులు 6:3, 4) యేసులాగే వాళ్లు తమనుతాము సంతోషపెట్టుకోవడం మీద కాకుండా దేవునికి లోబడుతూ జీవించడం మీద దృష్టిపెడతారు. యేసులాగే వాళ్లకు కూడా, తాము భూమ్మీద శాశ్వతకాలం జీవించమని తెలుసు. వాళ్లు చనిపోయి, పరలోకంలో అదృశ్య ప్రాణులుగా జీవించడానికి పునరుత్థానం అయినప్పుడు ఈ సూచనార్థక బాప్తిస్మం పూర్తౌతుంది.—రోమీయులు 6:5; 1 కొరింథీయులు 15:42-44.
అగ్నితో బాప్తిస్మం. యోహాను ప్రజలతో ఇలా అన్నాడు: “ఆయన [యేసు] మీకు పవిత్రశక్తితో, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చేతిలో తూర్పారబట్టే పార ఉంది, ఆయన తన కళ్లాన్ని పూర్తిగా శుభ్రం చేసి, గోధుమల్ని గోదాములో సమకూరుస్తాడు; పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.” (మత్తయి 3:11, 12) అగ్నితో ఇచ్చే బాప్తిస్మానికి, పవిత్రశక్తితో ఇచ్చే బాప్తిస్మానికి కొన్ని తేడాలు ఉన్నాయని గమనించండి. యోహాను ఈ ఉదాహరణ ఉపయోగించి ఏం చెప్పాలనుకుంటున్నాడు?
గోధుమలు యేసు చెప్పేది విని, పాటించే వాళ్లను సూచిస్తున్నాయి. వాళ్లు పవిత్రశక్తితో బాప్తిస్మం పొందడం కోసం ఎదురుచూడవచ్చు. పొట్టు, యేసు చెప్పేది వినని వాళ్లను సూచిస్తుంది. వాళ్లకు అగ్నితో బాప్తిస్మం ఉంటుంది, అంటే వాళ్లు శాశ్వతంగా నాశనమౌతారని అర్థం.—మత్తయి 3:7-12; లూకా 3:16, 17.
a “బాప్తిస్మం” అని అనువదించిన గ్రీకు పదం “నీళ్లలోకి వెళ్లడాన్ని, పూర్తిగా నీళ్లలో మునగడాన్ని, నీళ్లలో నుండి బయటికి రావడాన్ని” సూచిస్తుంది అని వైన్స్ కంప్లీట్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ వర్డ్స్ చెప్తుంది.
b కొన్ని చర్చీల్లో పసిపిల్లలకు పేరు పెట్టి, తర్వాత వాళ్ల తలమీద నీళ్లు చిలకరించి లేదా పోసి “బాప్తిస్మం” ఇచ్చే ఆచారం ఉంటుంది. పసిపిల్లల బాప్తిస్మం దాన్నే సూచిస్తుంది.
c యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్ చూడండి.
d “పవిత్రశక్తి అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చూడండి.
e “Who Was John the Baptist?” (ఇంగ్లీషు) ఆర్టికల్ చూడండి.
f “పరలోకానికి ఎవరు వెళ్తారు?” అనే ఆర్టికల్ చూడండి.
g ఆరాధనకు సంబంధించిన వస్తువులను శుభ్రం చేసే కొన్ని పద్ధతుల్ని, అంటే గిన్నెల మీద నీళ్లు పోయడం లాంటి వాటిని వర్ణించడానికి బైబిలు “బాప్తిస్మాలు” అనే పదాన్ని ఉపయోగిస్తుంది. (హెబ్రీయులు 9:10, అధస్సూచి) ఇది యేసు, ఆయన అనుచరులు పూర్తిగా నీళ్లలో మునిగి తీసుకున్న బాప్తిస్మానికి పూర్తిగా వేరు.