కంటెంట్‌కు వెళ్లు

మహాబబులోను అంటే ఏంటి?

మహాబబులోను అంటే ఏంటి?

బైబిలు ఇచ్చే జవాబు

 ప్రకటన గ్రంథం “ఒక స్త్రీ” గురించి చెప్తూ దాన్ని “గొప్ప వేశ్య” అని వర్ణిస్తుంది. ఆమె పేరు ఒక రహస్యమని, అది “మహాబబులోను” అని చెప్తుంది. (ప్రకటన 17:1, 3, 5) ఆ స్త్రీ ప్రపంచమంతటా ఉన్న అబద్ధమతాల్ని సూచిస్తుంది. అవి ‘దేవుని గురించిన సత్యాన్ని కాకుండా అబద్ధాన్ని నమ్మాయి.’ a (రోమీయులు 1:25) ఆ మతాలన్నీ చాలా విషయాల్లో వేర్వేరుగా ఉన్నా, ఏదోరకంగా అవన్నీ ప్రజల్ని సత్యదేవుడైన యెహోవా ఆరాధనకు దూరం చేస్తున్నాయి.—ద్వితీయోపదేశకాండం 4:35.

మహాబబులోనును ఎలా గుర్తించవచ్చు?

  1.   మహాబబులోను నిజంగా ఒక స్త్రీ కాదు కేవలం ఒక సూచన. ప్రకటన గ్రంథంలోని విషయాలు “సూచనల” రూపంలో ఉంటాయి కాబట్టి మహాబబులోను అనేది నిజంగా ఒక స్త్రీ కాదుగానీ, అది వేరే ఒకదాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. (ప్రకటన 1:1) అంతేకాదు, ఆమె “అనేక జలాల మీద” కూర్చుని ఉంది. ఆ జలాలు లేదా నీళ్లు “జాతుల్ని, ప్రజల గుంపుల్ని, దేశాల్ని, భాషల్ని సూచిస్తున్నాయి.” (ప్రకటన 17:1, 15) ఒక మామూలు స్త్రీ అయితే వాటిమీద కూర్చోలేదు కదా!

  2.   మహాబబులోను ఒక అంతర్జాతీయ సంస్థను సూచిస్తుంది. బైబిలు ఆమెను “మహానగరం” అని పిలుస్తుంది. ఆ మహానగరం “భూమ్మీది రాజుల్ని పరిపాలిస్తుంది.” (ప్రకటన 17:18) అంటే, ఆమె అధికారం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది.

  3.   మహాబబులోను రాజకీయ సంస్థో లేదా వ్యాపార సంస్థో కాదు, అది ఒక మత సంస్థ. ఒకప్పటి బబులోను నగరం మతానికి పెద్దపీట వేసేది. అది ‘మంత్రాలకు,’ ‘మంత్రవిద్యకు’ ప్రసిద్ధి. (యెషయా 47:1, 12, 13; యిర్మీయా 50:1, 2, 38) నిజానికి, అక్కడి ప్రజలు సత్యదేవుడైన యెహోవాను వ్యతిరేకిస్తూ అబద్ధ ఆరాధన చేసేవాళ్లు. (ఆదికాండం 10:8, 9; 11:2-4, 8) పొగరుబోతులైన బబులోను పాలకులు యెహోవా కంటే, ఆయన ఆరాధన కంటే తామే గొప్ప అని విర్రవీగారు. (యెషయా 14:4, 13, 14; దానియేలు 5:2-4, 23) అదేవిధంగా, మహాబబులోను కూడా ‘మంత్రతంత్రాలకు’ పేరుగాంచింది. దీన్నిబట్టి అది ఒక మత సంస్థ అని అర్థమౌతుంది.—ప్రకటన 18:22, 23.

     మహాబబులోను రాజకీయ సంస్థ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఆమె నాశనాన్ని చూసి “భూరాజులు” ఏడుస్తారు. (ప్రకటన 17:1, 2; 18:9) అది వ్యాపార సంస్థ అయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే బైబిలు ఆమెను, ‘భూమ్మీది వర్తకుల్ని’ వేరుచేసి మాట్లాడుతుంది.—ప్రకటన 18:11, 15.

  4. Photograph taken by courtesy of the British Museum

    సిన్‌, ఇష్టార్‌, షామాష్‌ అనే త్రిత్వ దేవుళ్ల గుర్తులతో బబులోను రాజు నెబోనైడస్‌ శిలాఫలకం

      మహాబబులోను అబద్ధమతాన్ని సూచిస్తుంది అని చెప్పడం సరైనదే. అబద్ధమతం ప్రజల్ని సత్యదేవుడైన యెహోవాకు దగ్గర చేసే బదులు, వాళ్లను వేరే దేవుళ్ల ఆరాధన వైపుకు నడిపిస్తుంది. బైబిలు దీన్ని “ఆధ్యాత్మిక వ్యభిచారం” అంటుంది. (లేవీయకాండం 20:6, అధస్సూచి; నిర్గమకాండం 34:15, 16) ప్రాచీన బబులోను నుండి పుట్టుకొచ్చిన త్రిత్వం, ఆత్మకు చావుండదు, విగ్రహారాధన లాంటి విషయాల్ని ఇప్పటికీ చాలా అబద్ధమతాలు ప్రజలకు బోధిస్తున్నాయి. ఈ మతాలు లోకం మీద తమకున్న ప్రేమను ఆరాధనతో ముడిపెడుతున్నాయి. బైబిలు ఇలాంటి నమ్మకద్రోహాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారం అంటుంది.—యాకోబు 4:4.

     మహాబబులోను గురించి వర్ణిస్తూ, అది “ఊదారంగు వస్త్రం, ఎర్రని వస్త్రం వేసుకొని … బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో చేసిన నగలు పెట్టుకొని” ఉందని బైబిలు చెప్తుంది. ప్రస్తుతం అబద్ధమతానికి ఉన్న సంపద, దాని బడాయి బైబిల్లోని ఆ వర్ణనకు సరిగ్గా సరిపోతుంది. (ప్రకటన 17:4) మహాబబులోను “భూమ్మీదున్న అసహ్యమైన వాటికి తల్లి.” ఇంకోమాటలో చెప్పాలంటే దాని బోధలు, పనులు నిజానికి దేవున్ని అవమానిస్తున్నాయి. (ప్రకటన 17:5) ఈ అబద్ధమతంలోని సభ్యులే మహాబబులోనుకు మద్దతిచ్చే ‘జాతుల, గుంపుల, దేశాల, భాషల’ ప్రజలు.—ప్రకటన 17:15.

 “భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి” చావులకు కారణం మహాబబులోనే. (ప్రకటన 18:24) చరిత్రంతటిలో అబద్ధమతం యుద్ధాల్ని, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది. ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైన యెహోవా దేవుని గురించిన సత్యాన్ని ప్రజలకు ఏమాత్రం నేర్పించలేకపోయింది. (1 యోహాను 4:8) దానివల్లే రక్తం ఏరులై పారింది.

మహాబబులోను గురించి దేవునికి ఏం అనిపిస్తుంది?

 దేవుని దృష్టిలో మహాబబులోను “పాపాలు ఆకాశాన్నంటాయి.” (ప్రకటన 18:4, 5) తన పేరును పాడుచేసినందుకు, తన సేవకుల్ని చిత్రహింసలు పెట్టినందుకు దేవుడు అబద్ధమతం మీద చాలా కోపంగా ఉన్నాడు.

మహాబబులోనుకు ఏం జరుగుతుంది?

 దేవుడు మహాబబులోను మీద “తీర్పు ప్రకటించాడు” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 18:20) బైబిలు సూచనార్థకంగా కొన్ని పదాల్ని ఉపయోగించి, దేవుడు అబద్ధమతాలన్నిటినీ పూర్తిగా తుడిచిపెట్టేస్తాడని ముందే చెప్పింది. (ప్రకటన 18:8) శక్తివంతమైన రాజకీయ వ్యవస్థకు గుర్తుగా ఉన్న ఒక ఎర్రని క్రూరమృగం అబద్ధమతాన్ని పూర్తిగా నాశనం చేసేలా దేవుడే దానిలో ఆలోచన పుట్టిస్తాడు. (ప్రకటన 17:16, 17) “బబులోను మహానగరం ఇలా వేగంగా పడేయబడుతుంది, అది ఇక ఎప్పటికీ కనిపించదు.” (ప్రకటన 18:21) కాబట్టి, దేవున్ని సంతోషపెట్టాలని అనుకునేవాళ్లు, అబద్ధమతం నుండి “బయటికి వచ్చేసి,” దానితో తెగతెంపులు చేసుకోవాలి.—2 కొరింథీయులు 6:14-17.

aనిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.