హాలొవీన్ పండుగ ఎలా మొదలైంది?
బైబిలు ఇచ్చే జవాబు
ప్రతీ సంవత్సరం అక్టోబరు 31న చాలామంది చేసుకునే హాలొవీన్ పండుగ గురించి బైబిలు ఏం చెప్పడం లేదు. అయితే అది ఎలా మొదలైందో, అందులోని ఆచారాలు ఏంటో పరిశీలిస్తే, ఇవన్నీ బైబిలు బోధలకు విరుద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది.
ఈ ఆర్టికల్‌లో …
హాలొవీన్ చరిత్ర, ఆచారాలు
సమ్హేయిన్: హాలొవీన్ పండుగ, “దాదాపు 2,000 సంవత్సరాల క్రితం సెల్టు జాతి ప్రజలు జరుపుకున్న ప్రాచీన అన్యమత పండుగకు సంబంధించింది” అని ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా చెప్తుంది. ఆ పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది: “ఈ పండుగ సమయంలో, చనిపోయినవాళ్లు లేచి బ్రతికున్నవాళ్ల మధ్య నడుస్తారని, బ్రతికున్నవాళ్లేమో చనిపోయినవాళ్లను కలవచ్చని ఆ ప్రజలు నమ్మేవాళ్లు.”—“ హాలొవీన్ అనే పేరు ఎలా వచ్చింది?” చూడండి.
దయ్యాల్లాంటి బట్టలు, చాక్లెట్లు, భయపెట్టి స్వీట్లు అడగడం: ఒక పుస్తకం ప్రకారం, హాలొవీన్ పండుగ సమయంలో సెల్టు ప్రజల్లో కొంతమంది దయ్యాల్లాంటి బట్టలు వేసుకునేవాళ్లు. అలా వేసుకుంటే తిరుగుతున్న ఆత్మలు, వాళ్లు కూడా దయ్యాలే అనుకొని వాళ్లను ఏం చేయకుండా వెళ్లిపోతాయని నమ్మేవాళ్లు. మరికొంతమంది, ఆత్మలను శాంతపర్చడానికి వాటికి స్వీట్లు అర్పించేవాళ్లు. a
క్రీస్తు శకం 500 నుండి 1500 మధ్య కాలంనాటి యూరప్‌లో, క్యాథలిక్ మతనాయకులు స్థానికంగా ఉన్న ఇతర మతాచారాలను పాటించడం మొదలుపెట్టారు. వాళ్లు తమ చర్చి సభ్యులను దయ్యాల్లాంటి బట్టలు వేసుకుని, ఇంటింటికి వెళ్లి చిన్నచిన్న బహుమతులు అడగమని చెప్పేవాళ్లు.
దయ్యాలు, పిశాచాలు, తోడేళ్లుగా మారే మనుషులు, మంత్రగత్తెలు: ఇవన్నీ ఎంతోకాలంగా దురాత్మలతో లేదా చెడ్డదూతలతో సంబంధం కలిగి ఉన్నాయి. వాటిని మానవాతీత శక్తులున్న రాక్షసులని పిలుస్తూ, హాలొవీన్ ట్రివియా అనే పుస్తకం వాటి గురించి ఇలా చెప్తుంది: “మరణానికి, చనిపోయినవాళ్లకు, మరణభయానికి వీటితో దగ్గరి సంబంధం ఉంది.”
హాలొవీన్ గుమ్మడికాయలు లేదా జాకో లాంతర్లు: మధ్యయుగం కాలంనాటి బ్రిటన్‌లో, హాలొవీన్ పండుగ సమయంలో “కొంతమంది ఇంటింటికి వెళ్లి ఆహారం పెడితే, చనిపోయిన వాళ్లకోసం ప్రార్థన చేస్తామని చెప్పేవాళ్లు.” అలాగే తమతోపాటు “ఒక రకం దుంపతో చేసిన లాంతర్లను తీసుకెళ్లేవాళ్లు. ఆ దుంపలోని కొవ్వొత్తి, పాపవిమోచన లోకంలో చిక్కుకుపోయిన ఆత్మకు గుర్తుగా ఉండేది.” (హాలొవీన్—ఫ్రమ్ పాగన్ రిచువల్ టు పార్టీ నైట్) అయితే, దురాత్మలను వెళ్లగొట్టడానికి లాంతర్లను ఉపయోగించేవాళ్లని మరికొంతమంది అంటారు. 1800లలో ఉత్తర అమెరికాలో, దుంపలకు బదులు గుమ్మడికాయలను వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ గుమ్మడికాయలు ఎక్కువగా దొరికేవి, వాటితో లాంతర్లను చేయడం కూడా సులభంగా ఉండేది.
హాలొవీన్ పండుగ ఎలా మొదలైందో తెలుసుకోవడం ముఖ్యమా?
ముఖ్యమే. హాలొవీన్ అంత ప్రమాదకరం కాదని, అది కేవలం సరదా కోసం చేసుకునే పండుగని కొంతమంది అనుకుంటారు. కానీ అందులోని ఆచారాలు బైబిలు బోధలకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అవి దయ్యాలకు లేదా చనిపోయినవాళ్లకు సంబంధించిన అబద్ధ బోధల మీద ఆధారపడినవి.
హాలొవీన్కు సంబంధించిన నమ్మకాలు దేవునికి ఎలా అనిపిస్తుందో, తెలిపే ఈ లేఖనాలను గమనించండి:
“మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా … ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయినవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు.”—ద్వితీయోపదేశకాండం 18:11, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
దానర్థం: చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించడం లేదా అలా ప్రయత్నిస్తున్నట్టు చూపించే పనులు చేయడం దేవునికి అస్సలు నచ్చదు.
“చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.”—ప్రసంగి 9:5.
దానర్థం: చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు కాబట్టి వాళ్లు బ్రతికున్నవాళ్లతో మాట్లాడలేరు.
‘మీరు దయ్యాలతో భాగస్వాములు కావద్దని నా విన్నపం. మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించకూడదు.’—1 కొరింథీయులు 10:20, 21, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
దానర్థం: దేవుని అనుగ్రహం పొందాలనుకునేవాళ్లు, దయ్యాలకు లేదా చెడ్డదూతలకు సంబంధించిన ప్రతీదానికి దూరంగా ఉండాలి.
‘మీరు అపవాది పన్నాగాలకు పడిపోకుండా స్థిరంగా నిలబడండి. ఎందుకంటే, మనం చెడ్డదూతల సైన్యంతో పోరాడుతున్నాం.’—ఎఫెసీయులు 6:11, 12.
దానర్థం: క్రైస్తవులు చెడ్డదూతల్ని ఎదిరించాలేగానీ, వాళ్లతో కలిసి పండుగ జరుపుకుంటున్నట్టు ప్రవర్తించకూడదు.
a హాలొవీన్: యాన్ అమెరికన్ హాలిడే, యాన్ అమెరికన్ హిస్టరీ అనే పుస్తకంలో 4వ పేజీ చూడండి.