పరలోకం అంటే ఏమిటి?
బైబిలు ఇచ్చే జవాబు
బైబిల్లో “పరలోకం” అనే పదాన్ని ముఖ్యంగా మూడు విషయాలను సూచించడానికి ఉపయోగించారు: (1) ఆకాశం; (2) అదృశ్య ప్రాణులు ఉండే స్థలం; (3) ఉన్నతమైన స్థానం. బైబిల్లో పరలోకం అనే పదం సందర్భాన్ని బట్టి ఒక్కోచోట ఒక్కో విషయాన్ని సూచిస్తుంది. a
ఆకాశం. ఇక్కడ “పరలోకం” అనే పదం భూమి వాతావరణాన్ని అంటే గాలులు వీచే, పక్షులు ఎగిరే, మేఘాలు వర్షాన్ని-మంచును కురిపించే, మెరుపుల్ని మెరిపించే స్థలాన్ని సూచిస్తుంది. (కీర్తన 78:26; సామెతలు 30:19; యెషయా 55:10; లూకా 17:24) ఇది అంతరిక్షాన్ని, అంటే “సూర్య చంద్ర నక్షత్రములు” ఉండే స్థలాన్ని కూడా సూచిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 4:19; ఆదికాండము 1:1.
అదృశ్య ప్రాణులు ఉండే స్థలం. “పరలోకం” అనే పదం ఆత్మ ప్రాణులు ఉండే స్థలాన్ని కూడా సూచిస్తుంది. ఇది భౌతిక విశ్వం కన్నా పైన, ఈ విశ్వానికి అవతల ఉంటుంది. (1 రాజులు 8:27; యోహాను 6:38) ఈ స్థలంలో “ఆత్మ” ప్రాణి అయిన యెహోవా దేవుడు, ఆయన సృష్టించిన మరితర ఆత్మ ప్రాణులైన దేవదూతలు ఉంటారు. (యోహాను 4:24; మత్తయి 24:36) కొన్ని సందర్భాల్లో ఈ పదం, “పరిశుద్ధదూతల సమాజము” అయిన నమ్మకమైన దేవదూతల్ని సూచించడానికి ఉపయోగించబడింది.—కీర్తన 89:5-7.
బైబిల్లో “పరలోకం” అనే పదం ఆత్మ ప్రాణులు ఉండే స్థలంలో యెహోవా ఉండే ఖచ్చితమైన చోటును, ఆయన ‘నివాసస్థలాన్ని’ సూచించడానికి కూడా ఉపయోగించబడింది. (1 రాజులు 8:43, 49; హెబ్రీయులు 9:24; ప్రకటన 13:6) ఉదాహరణకు యెహోవా సన్నిధిలోకి ఇక ఏమాత్రం రాలేకుండా సాతాను, అతని దయ్యాలు లేదా చెడ్డదూతలు పరలోకం నుండి తోసివేయబడతారని బైబిలు ప్రవచించింది. అయితే ఆయన సన్నిధి నుండి తొలగించబడినా, వాళ్లు ఉండేది కూడా ఆత్మప్రాణుల స్థలంలోనే.—ప్రకటన 12:7-9, 12.
ఉన్నతమైన స్థానానికి గుర్తు. బైబిల్లో “పరలోకం” అనే పదం ఉన్నతమైన స్థానాన్ని, సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజ్యాధికారుల్ని సూచించడానికి ఉపయోగించబడింది. ఆ స్థానంలో ఉన్నది:
విశ్వ సర్వాధిపతి అయిన యెహోవా దేవుడు.—2 దినవృత్తాంతములు 32:20; లూకా 15:21.
మానవ ప్రభుత్వాల్ని తొలగించి వాటి స్థానంలో వచ్చే దేవుని రాజ్యం. బైబిలు ఈ రాజ్యాన్ని “క్రొత్త ఆకాశము” అని అంటుంది.—యెషయా 65:17; 66:22; 2 పేతురు 3:13. b
పరలోకానికి వెళ్లే నిరీక్షణతో భూమ్మీదున్న క్రైస్తవులు.—ఎఫెసీయులు 2:6.
తమ పౌరులను పరిపాలిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న మానవ ప్రభుత్వాలు.—యెషయా 14:12-14; దానియేలు 4:20-22; 2 పేతురు 3:7.
ప్రస్తుతం ఈ లోకాన్ని పరిపాలిస్తున్న చెడ్డదూతలు లేదా దయ్యాలు.—ఎఫెసీయులు 6:12; 1 యోహాను 5:19.
పరలోకం ఎలా ఉంటుంది?
ఆత్మ ప్రాణులు ఉండే స్థలంలో ఎంతో పని జరుగుతుంటుంది. అక్కడ “ఆయన [యెహోవా] వాక్యము నెరవేర్చే” వేవేల, కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు.—కీర్తన 103:20, 21; దానియేలు 7:10.
పరలోకంలో అమితమైన తేజస్సు ఉంటుందని బైబిలు చెప్తోంది. (1 తిమోతి 6:15, 16) యెహెజ్కేలు పరలోకాన్ని దర్శనంలో చూసినప్పుడు అక్కడ అతనికి “తేజస్సు” కనిపించింది. దానియేలుకు తేజస్సుతోపాటు “అగ్నివంటి ప్రవాహము” కనిపించింది. (యెహెజ్కేలు 1:26-28; దానియేలు 7:9, 10) పరలోకం పవిత్రంగా, పరిశుభ్రంగా, అందంగా ఉంటుంది.—కీర్తన 96:6; యెషయా 63:15; ప్రకటన 4:2, 3.
బైబిలు పరలోకం గురించి ఇస్తున్న వివరాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. (యెహెజ్కేలు 43:2, 3) అయితే, పరలోకం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం మానవులకు అసాధ్యం, అదృశ్య ప్రాణులు ఉండే ఆ స్థలం మన ఊహకు అందనిది.
a “పరలోకం” అని అనువదించిన హీబ్రూ పదం “ఎత్తయిన,“ లేదా “ఉన్నతమైన” అనే అర్థమున్న మూల పదాల నుండి వచ్చింది. (సామెతలు 25:3) ద న్యూ బ్రౌన్, డ్రైవర్, అండ్ బ్రిగ్స్, హీబ్రూ అండ్ ఇంగ్లీష్ లెక్సికన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్, 1029వ పేజీ చూడండి.
b McClintock and Strong‘s Cyclopedia యెషయా 65:17 లోని కొత్త ఆకాశము, “కొత్త రాజ్యాన్ని, అంటే కొత్త ప్రభుత్వాన్ని” సూచిస్తుందని చెప్తోంది.—4వ సంపుటి, 122వ పేజీ.