కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

అపొస్తలుల కార్యాలు 1:8—“మీరు శక్తినొందెదరు”

అపొస్తలుల కార్యాలు 1:8—“మీరు శక్తినొందెదరు”

 “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.”—అపొస్తలుల కార్యాలు 1:8, కొత్త లోక అనువాదం.

 “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.”—అపొస్తలుల కార్యములు 1:8, పరిశుద్ధ గ్రంథము.

అపొస్తలుల కార్యాలు 1:8 అర్థమేంటి?

 భూమి నలుమూలలా సువార్త ప్రకటించడానికి దేవుని పవిత్రశక్తి తన అనుచరులకు బలాన్ని ఇస్తుందని యేసు వాళ్లకు మాటిస్తున్నాడు.

 “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు.” తాను పరలోకానికి తిరిగి వెళ్లిపోయిన తర్వాత తన శిష్యులు దేవుని పవిత్రశక్తి a ద్వారా సహాయం పొందుతారని యేసు గతంలో చేసిన వాగ్దానాన్ని ఇక్కడ మళ్లీ గుర్తుచేస్తున్నాడు. (యోహాను 14:16, 26) క్రీ.శ. 33 లో యేసు పరలోకానికి వెళ్లిన పది రోజుల తర్వాత, ఆయన అనుచరులు ఆయన మాటిచ్చిన పవిత్రశక్తిని పొందారు. (అపొస్తలుల కార్యాలు 2:1-4) దేవుని పవిత్రశక్తి వాళ్లకు వేర్వేరు భాషల్లో మాట్లాడేలా, అద్భుతాలు చేసేలా శక్తిని ఇవ్వడంతోపాటు యేసుమీద ఉన్న విశ్వాసం గురించి ధైర్యంగా ప్రకటించే సామర్థ్యం కూడా ఇచ్చింది.—అపొస్తలుల కార్యాలు 3:1-8; 4:33; 6:8-10; 14:3, 8-10.

 “మీరు నా గురించి సాక్ష్యమిస్తారు [లేదా, “ నాకు సాక్షులుగా ఉంటారు,” అధస్సూచి].” “సాక్షి” అని అనువదించిన పదానికి, స్వయంగా చూసిన లేదా అనుభవించిన దాని ఆధారంగా “సాక్ష్యం చెప్పేవాడు” లేదా “ధృవీకరించేవాడు” అని అర్థం. అపొస్తలులు యేసు జీవితాన్ని కళ్లారా చూశారు కాబట్టి వాళ్లు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, చనిపోయినప్పుడు, తిరిగి బ్రతికించబడినప్పుడు జరిగిన సంఘటనలను ధృవీకరించగలరు. (అపొస్తలుల కార్యాలు 2:32; 3:15; 5:32; 10:39) వాళ్లు ఇచ్చిన తిరుగులేని సాక్ష్యం వల్ల యేసే క్రీస్తు అని, అంటే దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయ అని చాలామందికి నమ్మకం కుదిరింది. (అపొస్తలుల కార్యాలు 2:32-36, 41) అపొస్తలులు చెప్పిన వాటిని నమ్మినవాళ్లు యేసుకు సాక్షులై యేసు జీవితం, మరణం, పునరుత్థానం గురించి ఇతరులకు ప్రకటించారు.—అపొస్తలుల కార్యాలు 17:2, 3; 18:5.

 “భూమంతటా.” ఈ మాటను, “భూమి అంచుల వరకు” లేదా “ఇతర దేశాలకు” అని కూడా అనువదించవచ్చు. యేసు మాటలు, ఆయన అనుచరులు ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఎంత దూరం ప్రయాణిస్తారో చెప్తున్నాయి. వాళ్లు తాము నమ్మిన వాటి గురించి చెప్పడానికి యూదయ, సమరయ ప్రాంతాలను దాటి చాలా దూరాలకు ప్రయాణిస్తారు. నిజానికి వాళ్లు యేసు కన్నా పెద్ద ప్రాంతంలో, ఎక్కువమందికి ప్రకటిస్తారు. (మత్తయి 28:19; యోహాను 14:12) యేసు ఆ మాటలు చెప్పిన 30 కన్నా తక్కువ సంవత్సరాల్లోనే, యేసు గురించిన మంచివార్త “భూమంతటా ప్రకటించబడింది” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. అంటే రోము, పార్తీయ (కాస్పియన్‌ సముద్రానికి ఆగ్నేయ దిశలో ఉంటుంది), ఉత్తర ఆఫ్రికా లాంటి సుదూర ప్రాంతాల్లో కూడా ప్రకటించబడింది.—కొలొస్సయులు 1:23; అపొస్తలుల కార్యాలు 2:5, 9-11.

అపొస్తలుల కార్యాలు 1:8 సందర్భం

 లూకా సువార్త ఆగిన చోటే అపొస్తలుల కార్యాలు పుస్తకం మొదలౌతుంది. (లూకా 24:44-49; అపొస్తలుల కార్యాలు 1:4, 5) దాన్ని రాసిన శిష్యుడైన లూకా, యేసు పునరుత్థానమయ్యాక తన అనుచరులకు ఎలా కనిపించాడో చెప్తూ ఆ పుస్తకాన్ని మొదలుపెట్టాడు. (అపొస్తలుల కార్యాలు 1:1-3) తర్వాత అతను, క్రైస్తవ సంఘం ఎలా మొదలైందో, క్రీ.శ. 33 నుండి క్రీ.శ. 61 మధ్యకాలంలో అది ఎలా ఎదిగిందో రాశాడు.—అపొస్తలుల కార్యాలు 11:26.

 అపొస్తలుల కార్యాలు 1:8 సందర్భాన్ని గమనిస్తే, యేసు తమ జీవితకాలంలో దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించడం మొదలుపెడతాడా అని ఆయన అనుచరులు అనుకున్నారని తెలుస్తుంది. (అపొస్తలుల కార్యాలు 1:6) యేసు దానికి జవాబిస్తూ, రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుందని అతిగా ఆలోచించొద్దని వాళ్లకు చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 1:7) బదులుగా, యేసు అనుచరులు “భూమంతటా” ఆయన గురించి సాక్ష్యమివ్వడం మీద దృష్టిపెట్టాలి. (అపొస్తలుల కార్యాలు 1:8) ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ఉత్సాహంగా ప్రకటిస్తారు.—మత్తయి 24:14.

 అపొస్తలుల కార్యాలు పుస్తకం గురించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a దేవుని పవిత్రశక్తి అంటే కార్యాచరణలో ఉన్న ఆయన శక్తి, ఆయన చురుకైన శక్తి. (ఆదికాండం 1:2) దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి “పవిత్రశక్తి అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చదవండి.