కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

ప్రకటన 21:1—‘కొత్త ఆకాశం, కొత్త భూమి’

ప్రకటన 21:1—‘కొత్త ఆకాశం, కొత్త భూమి’

 “అప్పుడు నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూశాను. ఎందుకంటే ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి; సముద్రం ఇక లేదు.”—ప్రకటన 21:1, కొత్త లోక అనువాదం.

 “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.”—ప్రకటన 21:1, పరిశుద్ధ గ్రంథము.

ప్రకటన 21:1 అర్థమేంటి?

 ఈ వచనం, దేవుని పరలోక ప్రభుత్వం మానవ ప్రభుత్వాల్ని తీసేసి వాటి స్థానంలోకి వస్తుందని అలంకారిక భాషలో చెప్తుంది. ఆ ప్రభుత్వం చెడ్డ ప్రజల్ని నాశనం చేసి, దాని అధికారానికి ఇష్టంగా లోబడే ప్రజల కొత్త సమాజం మీద పరిపాలన చేస్తుంది.

 ప్రకటన పుస్తకం “సూచనల” లేదా గుర్తుల రూపంలో రాయబడింది. (ప్రకటన 1:1) కాబట్టి, ఈ వచనం నిజమైన ఆకాశం, భూమి గురించి చెప్పట్లేదు కానీ, ఇంకా దేన్నో సూచిస్తుందనే ముగింపుకు రావడం సమంజసమే. పైగా “కొత్త ఆకాశం,” “కొత్త భూమి” అనే మాటల్ని వేరే లేఖనాల్లో కూడా అలంకారిక భాషలో ఉపయోగించారు. (యెషయా 65:17; 66:22; 2 పేతురు 3:13) వాటిని, అలాగే ఇతర లేఖనాలను పరిశీలిస్తే ఆ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు.

 “కొత్త ఆకాశం.” బైబిల్లో “ఆకాశం” అనే మాట కొన్నిసార్లు పరిపాలనను లేదా ప్రభుత్వాల్ని సూచిస్తుంది. (యెషయా 14:12-14; దానియేలు 4:25, 26) కాబట్టి, ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెప్తుంది, ప్రవచనార్థక దర్శనాల్లో “ఆకాశం అలంకారిక భావంలో పరిపాలించే అధికారాన్ని లేదా ప్రభుత్వాన్ని సూచిస్తుంది.” a దాన్నిబట్టి, ప్రకటన 21:1లో “కొత్త ఆకాశం” దేవుని రాజ్యాన్ని సూచిస్తుందని తెలుస్తుంది. “పరలోక రాజ్యం” అని కొన్నిసార్లు పిలవబడిన ఈ పరలోక ప్రభుత్వం గురించి ప్రకటన పుస్తకం అంతటిలో, అలాగే బైబిల్లోని ఇతర పుస్తకాల్లో ఉంది. (మత్తయి 4:17; అపొస్తలుల కార్యాలు 19:8; 2 తిమోతి 4:18; ప్రకటన 1:9; 5:10; 11:15; 12:10) యేసు రాజుగా ఉన్న దేవుని రాజ్యం ‘ముందున్న ఆకాశాన్ని’ అంటే మనుషులు స్థాపించిన అపరిపూర్ణ ప్రభుత్వాల్ని తీసేసి వాటి స్థానంలో పరిపాలిస్తుంది.—దానియేలు 2:44; లూకా 1:31-33; ప్రకటన 19:11-18.

 “కొత్త భూమి.” మన భూమి ఎప్పటికీ నాశనం కాదని, దాని స్థానంలోకి వేరేది రాదని బైబిలు చెప్తుంది. (కీర్తన 104:5; ప్రసంగి 1:4) మరి అలంకారిక భాషలో భూమి దేన్ని సూచిస్తుంది? బైబిలు “భూమి” అనే మాటను తరచూ మానవాళిని సూచించడానికి ఉపయోగిస్తుంది. (ఆదికాండం 11:1; ద్వితీయోపదేశకాండం 32:1; 1 దినవృత్తాంతాలు 16:31; కీర్తన 96:11) కాబట్టి “కొత్త భూమి” దేవుని పరలోక ప్రభుత్వానికి ఇష్టంగా లోబడే ప్రజల కొత్త సమాజాన్ని సూచిస్తుండాలి. ‘ముందున్న భూమి,’ అంటే దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించే ప్రజల సమాజం గతించిపోతుంది.

 “సముద్రం ఇక లేదు.” ప్రకటన 21:1 వచనంలోని మిగతా భాగం లాగే “సముద్రం” కూడా దేన్నో సూచిస్తుంది. సముద్రం త్వరగా అల్లకల్లోలంగా, తుఫానులా మారిపోతుంది. అది, సమస్యల్ని-గందరగోళాన్ని సృష్టించే ప్రజల గుంపుల్ని సూచించడానికి సరిగ్గా సరిపోతుంది. వాళ్లు దేవున్ని తెలుసుకోవడానికి, ఆయన నియమాల ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. (యెషయా 17:12, 13; 57:20; ప్రకటన 17:1, 15) వాళ్లు కూడా ఉండరు. కీర్తన 37:10 ఇలా చెప్తుంది: “కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు; ఒకప్పుడు వాళ్లు ఉన్న స్థలాన్ని నువ్వు వెదికినా వాళ్లు కనిపించరు.”

ప్రకటన 21:1 సందర్భం

 ప్రకటన పుస్తకం, “ప్రభువు రోజున” జరిగే వాటి గురించి చెప్తుంది. (ప్రకటన 1:10) బైబిలు ప్రవచనాల ప్రకారం చూస్తే, 1914 లో దేవుని రాజ్యానికి రాజుగా యేసు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు ఆ రోజు ఆరంభమైంది. b కానీ ఆయన వెంటనే భూమిని పూర్తిగా తన అధీనంలోకి తీసుకోడు. నిజానికి ఇతర బైబిలు ప్రవచనాలు, “ప్రభువు రోజు” మొదటి భాగంలో ప్రపంచ పరిస్థితులు అంతకంతకూ దారుణంగా తయారౌతాయని చెప్తున్నాయి. ఆ మొదటి భాగాన్నే బైబిలు “చివరి రోజులు” అని పిలుస్తుంది. (2 తిమోతి 3:1-5, 13; మత్తయి 24:3, 7; ప్రకటన 6:1-8; 12:12) కష్టాలతో నిండిన ఆ ప్రమాదకరమైన రోజులు ముగిశాక దేవుని రాజ్యం సూచనార్థక ఆకాశాన్ని, భూమిని తీసేసి శాంతిసామరస్యాలతో తులతూగే కొత్త శకాన్ని తీసుకొస్తుంది. “కొత్త భూమి” సూచిస్తున్న ఆ రాజ్య పౌరులు లోపంలేని పరిస్థితుల మధ్య పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు.—ప్రకటన 21:3, 4.

 ప్రకటన పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా (1891), సంపుటి IV, పేజీ 122.