కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

ఫిలిప్పీయులు 4:6, 7​—“దేనినిగూర్చియు చింతపడకుడి”

ఫిలిప్పీయులు 4:6, 7​—“దేనినిగూర్చియు చింతపడకుడి”

 “ఏ విషయం గురించీ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి; అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”—ఫిలిప్పీయులు 4:6, 7, కొత్త లోక అనువాదం.

 “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”—ఫిలిప్పీయులు 4:6, 7, పరిశుద్ధ గ్రంథము.

ఫిలిప్పీయులు 4:6, 7 అర్థమేంటి?

 దేవున్ని ఆరాధించేవాళ్లు తీవ్రమైన బాధలో లేదా ఆందోళనలో ఉన్నప్పుడు, ఆయనకు ప్రార్థించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. వాళ్లకు మనశ్శాంతిని ఇస్తానని దేవుడు మాటిస్తున్నాడు, అది వాళ్లు ఆందోళన నుండి బయటపడడానికి అలాగే సరిగ్గా ఆలోచించడానికి, భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. వాళ్లు అలాంటి మనశ్శాంతిని పొందాలంటే ఎలా ప్రార్థించాలో 6వ వచనం చెప్తుంది.

 అభ్యర్థనలు చేయడం అంటే దీనంగా దేవున్ని బ్రతిమిలాడడం. ఒక వ్యక్తి ఒత్తిడిలో లేదా ఆపదలో ఉన్నప్పుడు యేసులాగే అభ్యర్థనలు చేయవచ్చు. (హెబ్రీయులు 5:7) తరచూ అలాంటి ప్రార్థనలు పదేపదే చేస్తారు.

 విన్నపాలు అంటే దేవున్ని ఫలానాది కావాలని అడగడం. ఆయన్ని ఆరాధించేవాళ్లు “ప్రతీ విషయంలో” లేదా ప్రతీ సందర్భంలో దేవునికి విన్నపాలు చేయవచ్చు. అయితే అలాంటి ప్రార్థనలు బైబిల్లో ఉన్న దేవుని ఇష్టానికి తగ్గట్టుగా చేయాలి.1 యోహాను 5:14.

 కృతజ్ఞతలు అంటే దేవుడు మనకు చేసినవాటి గురించి, అలాగే చేయబోయేవాటి గురించి థాంక్స్‌ చెప్పడం. దేవుడు మనకు ఏమేమి చేశాడో ఆలోచిస్తూ వాటికోసం కృతజ్ఞతలు చెప్తూ ఉంటే, మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం.—1 థెస్సలొనీకయులు 5:16-18.

 అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు, దేవుడు జవాబుగా మనకు శాంతిని ఇస్తాడు. “దేవుని శాంతి” అంటే దేవునితో దగ్గరి స్నేహం ఉన్నప్పుడు మనకు ఉండే నెమ్మది. (రోమీయులు 15:13; ఫిలిప్పీయులు 4:9) ఇది “మానవ అవగాహనకు మించిన” శాంతి, ఎందుకంటే అది దేవుడు ఇచ్చేది, అలాగే మన అంచనాలకు మించి మనకు సహాయం చేస్తుంది.

 దేవుని శాంతి మన హృదయాలకు కాపలా ఉంటుంది అని ఈ వచనం చెప్తుంది. ఇక్కడ “కాపలా” కోసం ఉపయోగించిన గ్రీకు పదం సైన్యానికి సంబంధించిన పదం. ఇది ఒక నగరాన్ని కాపలా కాయడానికి సైనికులు చేసే పనిని వివరిస్తుంది. అలాగే దేవుని శాంతి ఒక వ్యక్తి భావోద్వేగాలను, ఆలోచనలను కాపాడుతుంది. అతను కష్టాల వల్ల మరీ కృంగిపోకుండా అది సహాయం చేస్తుంది.

 దేవుడు ఇచ్చే శాంతి “క్రీస్తుయేసు ద్వారా”మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే యేసు ద్వారానే మనకు దేవునితో స్నేహం చేసే అవకాశం దొరికింది. యేసు మన పాపాల కోసం తన ప్రాణాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించాడు. మనకు యేసు మీద విశ్వాసం ఉంటే, దేవుడు ఇచ్చే దీవెనలు పొందగలం. (హెబ్రీయులు 11:6) అంతేకాదు మనం దేవుని దగ్గరికి వెళ్లాలంటే యేసే మార్గం. యేసు ఇలా అన్నాడు: “నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.”—యోహాను 14:6; 16:23.

ఫిలిప్పీయులు 4:6, 7 సందర్భం

 బైబిల్లోని ఫిలిప్పీయులు పుస్తకం అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ a నగరంలో ఉంటున్న క్రైస్తవులకు రాసిన ఉత్తరం. 4వ అధ్యాయంలో పౌలు ఫిలిప్పీ సంఘంలోని వాళ్లను ఆనందంగా ఉండమని ప్రోత్సహించాడు. అలాగే వాళ్లు తనకు కావాల్సిన వాటిని ఇచ్చినందుకు థాంక్స్‌ చెప్పాడు, వాళ్లు అలా చేయడం పౌలుకు సంతోషాన్ని ఇచ్చింది. (ఫిలిప్పీయులు 4:4, 10, 18) ప్రార్థన వల్ల దేవుని శాంతి ఎలా వస్తుందో ఆయన చెప్పాడు, అలాగే “శాంతికి మూలమైన దేవుడు” ఇచ్చే సహాయం పొందాలంటే మనం వేటి గురించి ఆలోచించాలో, ఏమేం చేయాలో పౌలు వివరించాడు.—ఫిలిప్పీయులు 4:8, 9.

a ఆధునిక గ్రీసులో ఉంది.