బైబిలు వచనాల వివరణ
మత్తయి 11:28-30—“నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును”
“భారం మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను. నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు. ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.”—మత్తయి 11:28-30, కొత్త లోక అనువాదం.
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30, పరిశుద్ధ గ్రంథము.
మత్తయి 11:28-30 అర్థమేంటి?
యేసు తన మాటలు వింటున్న వాళ్లను తన దగ్గరికి రమ్మని ప్రేమతో ఆహ్వానించాడు. తన దగ్గర నేర్చుకుంటే వాళ్లు సేదదీర్పును, ఉపశమనాన్ని పొందుతారని ఆయన వాళ్లకు హామీ ఇచ్చాడు.
“భారం మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి.” యేసు ఎవరికైతే ప్రేమతో ఈ ఆహ్వానం ఇచ్చాడో ఆ ప్రజలు, తమ మతనాయకులు పెట్టిన కట్టుబాట్లు, సంప్రదాయాల వల్ల ‘అలసిపోయారు.’ (మత్తయి 23:4; మార్కు 7:7) సామాన్య ప్రజలు జీవన చింతల వల్ల, జీవనోపాధి కోసం రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల కూడా నలిగిపోయేవాళ్లు.
“నేను మీకు సేదదీర్పును ఇస్తాను.” దయతో ఇచ్చిన ఆ ఆహ్వానాన్ని తీసుకున్నవాళ్లకు ఉపశమనాన్ని, లేదా విశ్రాంతిని ఇస్తానని యేసు మాటిచ్చాడు. దేవుడు వాళ్ల నుండి నిజంగా ఏమి కోరుతున్నాడో అర్థంచేసుకోవడానికి సహాయం చేయడం ద్వారా యేసు వాళ్లకు విశ్రాంతిని ఇచ్చాడు. (మత్తయి 7:24, 25) ఆ జ్ఞానం వల్ల వాళ్లు తప్పుడు అభిప్రాయాలు, అణచివేసే మత సంప్రదాయాల బానిసత్వం నుండి బయటపడ్డారు. (యోహాను 8:31, 32) యేసు చెప్పినవి నేర్చుకోవడానికి, పాటించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చినా అది వాళ్లకు సేదదీర్పును ఇస్తుంది.
“నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి.” బైబిలు కాలాల్లో పనివాళ్లు పెద్దపెద్ద బరువులు మోయడానికి తరచూ కాడిని ఉపయోగించేవాళ్లు. కాడి అంటే బరువుల్ని తగిలించి భుజం మీద మోసే చెక్కకర్ర. అలా, “కాడి” అనే మాటకు వేరే వ్యక్తి అధికారం కింద ఉండి అతని నిర్దేశం పాటించడం అనే అర్థం వచ్చింది. (లేవీయకాండం 26:13; యెషయా 14:25; యిర్మీయా 28:4) “నా దగ్గర నేర్చుకోండి” అనే మాటను “నా శిష్యులు (నా దగ్గర నేర్చుకునేవాళ్లు) అవ్వండి” అని కూడా అనువదించవచ్చు. అంటే యేసు తన మాటలు వింటున్న వాళ్లను తనను అనుసరిస్తూ, తనలా జీవిస్తూ శిష్యులు అవ్వమని ప్రోత్సహిస్తున్నాడు.—యోహాను 13:13-15; 1 పేతురు 2:21.
“మీరు సేదదీర్పు పొందుతారు.” అన్ని సమస్యలు వెంటనే పోతాయని యేసు మాటివ్వలేదు. కానీ తమ మాటలు వినేవాళ్లు ఓదార్పును, భవిష్యత్తు మీద ఆశను పొందేలా సహాయం చేశాడు. (మత్తయి 6:25-32; 10:29-31) యేసుకు శిష్యులై ఆయన బోధలు అంగీకరించిన వాళ్లు, దేవుని సేవ భారంగా ఉండదు కానీ ఎంతో సంతృప్తిని ఇస్తుందని అర్థంచేసుకున్నారు.—1 యోహాను 5:3.
“ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.” యేసు తన కాలంలోని మతనాయకుల్లా కాకుండా వినయంగా, సౌమ్యంగా ఉండేవాడు. (యోహాను 7:47-49) ఆయన ఎన్నడూ కఠినంగా లేదా క్రూరంగా నడుచుకోలేదు. బదులుగా దయగా, స్నేహపూర్వకంగా ఉండేవాడు. తన అనుచరులు చేయలేనివాటిని చేయమని ఎప్పుడూ పట్టుబట్టేవాడు కాదు. (మత్తయి 7:12; మార్కు 6:34; లూకా 9:11) దేవుని కరుణ నుండి ప్రయోజనం పొంది మంచి మనస్సాక్షి ఇచ్చే సేదదీర్పును పొందాలంటే ఏంచేయాలో వాళ్లకు నేర్పించాడు. (మత్తయి 5:23, 24; 6:14) యేసు చూపించిన చక్కని లక్షణాల వల్ల ప్రజలు ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడేవాళ్లు, సులభంగా ఉండే ఆయన కాడిని అంగీకరించి ఆయన శిష్యులవ్వాలని కోరుకునేవాళ్లు.
మత్తయి 11:28-30 సందర్భం
మత్తయి 11:28-30 లోని మాటల్ని యేసు క్రీ.శ. 31 లో గలిలయలో ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు చెప్పాడు. సువార్తలు రాసినవాళ్లలో కేవలం అపొస్తలుడైన మత్తయి మాత్రమే యేసు దయతో ఇచ్చిన ఆ ఆహ్వానం గురించి రాశాడు. మత్తయి ఒకప్పుడు పన్ను వసూలుచేసేవాడు, అలాగే యూదుడు; కాబట్టి రోమన్లు విధించే పన్నుల వల్ల, అవినీతితో నిండిన యూదా మత వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అతనికి స్వయంగా తెలుసు. అందుకే, యేసు తన తండ్రైన యెహోవా a తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి దీనులను, అణచివేయబడిన వాళ్లను తన దగ్గరకు రమ్మని ఆహ్వానించడం చూసి మత్తయి ఖచ్చితంగా ఎంతో సంతోషించి ఉంటాడు.—మత్తయి 11:25-27.
వాగ్దానం చేయబడిన మెస్సీయగా, భవిష్యత్తులో దేవుని రాజ్యానికి పరిపాలకుడిగా యేసు చూపించిన సాటిలేని లక్షణాల గురించి మత్తయి రాసిన సువార్త ముఖ్యంగా చెప్తుంది.—మత్తయి 1:20-23; యెషయా 11:1-5.
మత్తయి పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.
a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్ చూడండి.