కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

మార్కు 11:24—“ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి”

మార్కు 11:24—“ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి”

 “అందుకే చెప్తున్నాను, మీరు ప్రార్థనలో అడిగేవన్నీ మీరు అప్పటికే పొందేశారని విశ్వసించండి, అప్పుడు మీరు వాటిని తప్పకుండా పొందుతారు.”—మార్కు 11:24, కొత్త లోక అనువాదం.

 “అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.”—మార్కు 11:24, పరిశుద్ధ గ్రంథము.

మార్కు 11:24 అర్థమేంటి?

 ఈ మాటలతో యేసు తన అనుచరులు ప్రార్థనకు ఉన్న శక్తిని బలంగా నమ్మడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతున్నాడు. దేవుడు వాళ్ల ప్రార్థనలు వినడమే కాదు, వాటికి జవాబు కూడా ఇస్తాడని యేసు వాళ్లకు భరోసా ఇస్తున్నాడు. దేవుని ఇష్టం ప్రకారం నిజాయితీగా ప్రార్థన చేసే వ్యక్తి, అతను దేనికోసం ప్రార్థిస్తున్నాడో అది తప్పకుండా జరిగి తీరుతుందనే నమ్మకంతో ఉండవచ్చు. ఒక విధంగా, తన ప్రార్థనకు అప్పటికే జవాబు వచ్చినట్లుగా అతను భావించవచ్చు.

 విశ్వాసంతో ప్రార్థించడం చాలా ముఖ్యమని యేసు నొక్కి చెబుతున్నాడు. ప్రార్థించే వ్యక్తి, మనసులో “సందేహపడకుండా తాను అన్నది జరుగుతుందని” విశ్వసించాలని యేసు వివరించాడు. (మార్కు 11:23) ఎందుకు? ఎందుకంటే, సందేహించేవాళ్లు “యెహోవా a నుండి ఏదైనా దొరుకుతుందని ఆశపడకూడదు.”—యాకోబు 1:5-8.

 విశ్వాసం ఉన్న వ్యక్తి చాలాసార్లు ప్రార్థిస్తాడు. (లూకా 11:9, 10; రోమీయులు 12:12) ఆ విధంగా అతను, తాను దేనికోసం ప్రార్థిస్తున్నాడో అది నిజంగా అతనికి అవసరమని, దేవుడు తన ప్రార్థనకు జవాబివ్వగలడని నిజంగా నమ్ముతున్నానని చూపిస్తాడు. అదే సమయంలో, తాను ఎదురుచూసినట్టు కాకుండా వేరే విధంగా, అలాగే తాను ఊహించిన సమయంలో కాకుండా వేరే సమయంలో జవాబివ్వాలని దేవుడు నిర్ణయించుకోవచ్చని అతను అర్థం చేసుకుంటాడు.—ఎఫెసీయులు 3:20; హెబ్రీయులు 11:6.

 అయితే ప్రార్థనలో ఎవరు ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తాడని యేసు చెప్పడం లేదు. యేసు ఆ మాటల్ని తన అనుచరులతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు. వాళ్లందరూ విశ్వాసం చూపిస్తూ, యెహోవా దేవుడు ఆమోదించే విధంగా ఆయన్ను ఆరాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న వాళ్లు. యెహోవా తన ఇష్టానికి తగ్గట్లుగా ఉన్న ప్రార్థనలు మాత్రమే వింటాడని బైబిలు చెప్తుంది. (1 యోహాను 5:14) తన ప్రమాణాలను కావాలని నిర్లక్ష్యం చేసేవాళ్ల ప్రార్థనలు, అలాగే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెడ్డ పనులు చేసేవాళ్ల ప్రార్థనలు యెహోవా వినడు. (యెషయా 1:15; మీకా 3:4; యోహాను 9:31) దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడో తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

మార్కు 11:24 సందర్భం

 యేసు భూమ్మీద పరిచర్య చేసే చివరి రోజుల్లో, దేవుని మీద బలమైన విశ్వాసం చూపించడం చాలా ముఖ్యమని తన శిష్యులతో అన్నాడు. ఆయన ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని మరింత గట్టిగా చెప్పాడు. యెరూషలేముకు ప్రయాణిస్తున్నప్పుడు యేసు, చాలా ఆకులు వచ్చిన ఒక అంజూర చెట్టును చూశాడు. కానీ ఆ చెట్టుకు ఒక్క కాయ కూడా లేదు, దాంతో యేసు ఆ చెట్టును శపించాడు. (మార్కు 11:12-14) ప్రాచీన ఇశ్రాయేలు జనం కూడా ఒక విధంగా బాగా ఫలించినట్టు కనిపించిన ఆ చెట్టులాగే ఉన్నారు; వాళ్లు కూడా దేవున్ని ఆరాధిస్తున్నట్టు కనిపిస్తున్నారు, కానీ నిజానికి వాళ్లలో విశ్వాసం లేదు. (మత్తయి 21:43) కాసేపటికే ఆ అంజూర చెట్టు ఎండిపోయింది, అది విశ్వాసం లేని ఇశ్రాయేలు జనానికి త్వరలోనే ఏం జరుగుతుందో చూపించింది.—మార్కు 11:19-21.

 వాళ్లలా కాకుండా తన శిష్యులు సవాళ్లను దాటడానికి, గొప్పగొప్ప పనులు సాధించడానికి కావాల్సిన విశ్వాసాన్ని పెంచుకోగలరని యేసు నమ్మాడు. (మార్కు 11:22, 23) ప్రార్థన గురించి యేసు ఇచ్చిన సలహా శిష్యులకు సరైన సమయానికి ఇచ్చిన సలహా అని చెప్పవచ్చు, ఎందుకంటే త్వరలోనే వాళ్ల విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. యేసు చనిపోవడం, పరిచర్యకు వ్యతిరేకత పెరగడం వంటి కష్టాలు ఎదుర్కోబోతున్నారు. (లూకా 24:17-20; అపొస్తలుల కార్యాలు 5:17, 18, 40) నేడు కూడా యేసు అనుచరులు దేవుని మీద, ప్రార్థనకు ఉన్న శక్తి మీద విశ్వాసం చూపించడం ద్వారా కష్టమైన పరిస్థితుల్ని తట్టుకోవచ్చు.—యాకోబు 2:26.

 మార్కు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్‌ చూడండి.