బైబిలు వచనాల వివరణ
యెషయా 42:8—“యెహోవాను నేనే“
“నేను యెహోవాను. ఇదే నా పేరు; నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను, నాకు రావాల్సిన స్తుతిని చెక్కిన విగ్రహాలకు చెందనివ్వను.”—యెషయా 42:8, కొత్త లోక అనువాదం.
“యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.”—యెషయా 42:8, పరిశుద్ధ గ్రంథము.
యెషయా 42:8 అర్థమేంటి?
దేవుడు తన సొంత పేరు గురించి చెప్తూ తనకు చెందాల్సిన స్తుతిని, ఘనతను విగ్రహాలతో పంచుకోను అని అంటున్నాడు.
దేవుడు స్వయంగా తనకు ఒక పేరు పెట్టుకున్నాడు, దాన్ని తెలుగులో సాధారణంగా “యెహోవా” అని అనువదించారు. a (నిర్గమకాండం 3:14, 15) పాత నిబంధనలో (హీబ్రూ-అరామిక్ లేఖనాల్లో) దేవుని పేరు దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. అయినాసరే కొన్ని అనువాదాలు ఆ పేరు స్థానంలో “ప్రభువు” అని పెడుతున్నాయి. దానికి ఒక ఉదాహరణ, కీర్తన 110:1. ఆ ప్రవచనం యెహోవా గురించి, యేసు గురించి చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఆ వచనం ఇలా ఉంటుంది: “ప్రభువు [యెహోవా] నా ప్రభువుతో [యేసుతో] సెలవిచ్చినవాక్కు.” (అపొస్తలుల కార్యాలు 2:34-36 పోల్చండి.) కొత్త లోక అనువాదం ఆ రెండు “ప్రభువుల” మధ్య ఎలాంటి అయోమయానికి చోటివ్వకుండా, దేవుని పేరు ఉండాల్సిన చోట దాన్ని పెట్టింది. అందులో ఆ వచనం ఇలా ఉంటుంది: “యెహోవా నా ప్రభువుతో ఇలా అన్నాడు: ‘నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నా కుడిపక్కన కూర్చో.’”
దేవుని పేరుకు, “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అని అర్థమని చాలామంది పండితులు నమ్ముతారు. ఈ మాట కేవలం సత్యదేవునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన మాత్రమే తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎలా కావాలంటే అలా అవ్వగలడు లేదా తన సృష్టిని అలా అయ్యేలా చేయగలడు.
యెహోవా మన సృష్టికర్త, ఒకేఒక్క సత్యదేవుడు కాబట్టి మన సంపూర్ణ భక్తిని పొందడానికి అర్హుడు. మన ఆరాధన పొందే హక్కు ఇంకెవ్వరికీ లేదా దేనికీ లేదు. అంటే విగ్రహాలకు, ప్రతిమలకు కూడా లేదు.—నిర్గమకాండం 20:2-6; 34:14; 1 యోహాను 5:21.
యెషయా 42:8 సందర్భం
యెషయా 42వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో యెహోవా తాను “ఎంచుకున్న” వ్యక్తి చేసే పని గురించి ముందే చెప్పాడు. తాను ఆమోదించిన ఆ సేవకుడు “దేశాలకు న్యాయం చేస్తాడు” అని దేవుడు అన్నాడు. (యెషయా 42:1, అధస్సూచి) ఆ వాగ్దానం గురించి దేవుడు ఇలా చెప్పాడు: “ఇప్పుడు కొత్త సంగతులు చెప్తున్నాను. అవి పుట్టకముందే, వాటి గురించి నేను మీకు చెప్తున్నాను.” (యెషయా 42:9) కొన్ని దశాబ్దాల తర్వాత మెస్సీయ లేదా క్రీస్తు వచ్చి, భూమ్మీద తన పరిచర్యను పూర్తి చేసినప్పుడు “ఎంచుకున్న” వ్యక్తి గురించిన ప్రవచనం పుట్టింది, లేదా నిజమైంది.—మత్తయి 3:16, 17; 12:15-21.
ఇతర బైబిలు అనువాదాల్లో యెషయా 42:8
“నేను యెహోవాను. ఇదే నా పేరు. ఇంకెవరికీ నా మహిమను ఇవ్వను. నాకు రావలసిన స్తుతి విగ్రహాలకు చెందనివ్వను.”—పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
“నేను యెహోవాను. నా పేరు యెహోవా. నేను నా మహిమను మరొకరికి ఇవ్వను. నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలను (అబద్ధపు దేవుళ్ళను) తీసుకోనివ్వను.”—పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
a హీబ్రూ భాషలో దేవుని పేరులో నాలుగు హల్లులు ఉంటాయి. వాటిని తరచూ ఇంగ్లీషులో YHWH అని రాస్తారు. కొన్ని ఇంగ్లీషు అనువాదాల్లో దేవుని పేరు, “Yahweh“ అని ఉంటుంది. ఎక్కువ సమాచారం కోసం, పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో “హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు” అనే అనుబంధం A4 చూడండి.