కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యెహోషువ 1:9—“ధైర్యంగా, నిబ్బరంగా ఉండు”

యెహోషువ 1:9—“ధైర్యంగా, నిబ్బరంగా ఉండు”

 “నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను; ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. నువ్వు వెళ్లే ప్రతీ చోట నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు కాబట్టి బెదిరిపోకు, భయపడకు.”—యెహోషువ 1:9, కొత్త లోక అనువాదం.

 “నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.”—యెహోషువ 1:9, పరిశుద్ధ గ్రంథము.

యెహోషువ 1:9 అర్థమేంటి?

 ఆ మాటలు చెప్పి యెహోవా a దేవుడు తనను నమ్మకంగా ఆరాధిస్తున్న యెహోషువకు భరోసా ఇచ్చాడు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా, లేదా ఇక తనవల్లకాదు అనిపించే ఆటంకాలు ఎదురైనా ఆయన “ధైర్యంగా, నిబ్బరంగా” ఉండవచ్చు. యెహోవా ఆజ్ఞలకు లోబడినంతకాలం యెహోషువ భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే దేవుడే యెహోషువ పక్కన నిలబడి అతను విజయం సాధించేలా సహాయం చేస్తాడు. యెహోషువకు నిర్దేశాలిస్తూ, శత్రువులపై విజయం సాధించేలా చేస్తూ యెహోవా నిజంగా ఆయనతోపాటే ఉన్నాడు.

 యెహోషువ ఎలా “ధైర్యంగా, నిబ్బరంగా” ఉండగలడు? అందుకోసం యెహోషువ అప్పటికే అందుబాటులో ఉన్న యెహోవా ప్రేరేపిత మాటల్ని చదవాలి. అంటే, యెహోవా ‘సేవకుడైన మోషే తనకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటినీ’ ఆయన చదవాలి. b (యెహోషువ 1:7) “పగలూ రాత్రీ దాన్ని ధ్యానించాలి [లేదా చిన్న స్వరంతో చదవాలి; జాగ్రత్తగా చదవాలి]” అని యెహోవా దేవుడు యెహోషువకు చెప్పాడు. (యెహోషువ 1:8, అధస్సూచి) అలా చదవడం, ధ్యానించడం అనేవి యెహోషువలో దేవుని ఇష్టాన్ని చేయాలనే తపనను పెంచేవి. అతను దేవుని వాక్యంలో నేర్చుకున్న వాటి ప్రకారం చర్య తీసుకునేలా, ‘దానిలో రాయబడి ఉన్నవాటన్నిటినీ జాగ్రత్తగా పాటించేలా’ అది సహాయం చేసేది. దానివల్ల నిజంగానే ఆయన తెలివిగా నడుచుకుంటూ, విజయం సాధించాడు. యెహోషువకు సవాళ్లు ఎదురైనా, యెహోవాను నమ్మకంగా ఆరాధిస్తూ పూర్తి జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించాడు.—యెహోషువ 23:14; 24:15.

 అప్పట్లో యెహోషువకు యెహోవా చెప్పిన మాటలు ఇప్పుడు కూడా ప్రోత్సాహాన్నిస్తాయి. యెహోవా తన సేవకులందర్ని, ముఖ్యంగా సవాళ్లు ఎదుర్కొంటున్నవాళ్లను ఎంత శ్రద్ధగా చూసుకుంటాడో అవి చూపిస్తాయి. వాళ్లంతా, యెహోషువలానే విజయం సాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు. దేవుని వాక్యమైన బైబిలును చదివి, ధ్యానించి దాని నిర్దేశాల ప్రకారం ప్రవర్తించినప్పుడు వాళ్లు కూడా, యెహోషువలా “ధైర్యంగా, నిబ్బరంగా” ఉండగలుగుతారు.

యెహోషువ 1:9 సందర్భం

 మోషే చనిపోయిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజల్ని యెహోషువ నడిపించాలని యెహోవా నిర్దేశించాడు. (యెహోషువ 1:1, 2) ఇంకొన్ని రోజుల్లో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానులోకి అడుగుపెడతారు. కానీ, వాళ్లు చాలా బలమైన శత్రువులను ఎదుర్కోవాల్సి ఉంది. ఉదాహరణకు, యెహోషువ పరమ దుర్మార్గులైన కనానీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. c (ద్వితీయోపదేశకాండం 9:5; 20:17, 18) కనానీయుల సైన్యం, వాళ్ల ఆయుధ సామగ్రి కూడా ఇశ్రాయేలీయుల కంటే ఎక్కువే. (యెహోషువ 9:1, 2; 17:18) కానీ యెహోషువ ధైర్యంగా యెహోవా నిర్దేశాలను పాటించాడు. ఇశ్రాయేలీయులు కేవలం ఆరు సంవత్సరాల్లోనే చాలామంది శత్రువుల్ని జయించారు.—యెహోషువ 21:43, 44.

a దేవుని పేరు హీబ్రూలో టెట్రగ్రామటన్‌ లేదా יהוה (YHWH) అనే నాలుగు అక్షరాల్లో కనిపిస్తుంది. దాన్ని తెలుగులో యెహోవా అని అనువదించారు. ఆ పేరుని కొన్ని బైబిలు అనువాదాల్లో “ప్రభువు” అని ముద్దక్షరాల్లో గానీ, “ప్రభువు” అని మామూలు అక్షరాల్లో గానీ పెట్టారు. యెహోవా అనే పేరు గురించి, ఆ పేరు కొన్ని బైబిలు అనువాదాల్లో ఎందుకు లేదు అనేదాని గురించి తెలుసుకోవడానికి “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.

b దేవుని ప్రేరణతో మోషే రాసిన ఐదు పుస్తకాలు (ఆదికాండం, నిర్గమకాండం, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం), యోబు పుస్తకం, ఒకట్రెండు కీర్తనలు కూడా యెహోషువ దగ్గర ఉండివుంటాయి.

c అసలు అలాంటి యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి, 2010, జనవరి 1, కావలికోటలో వచ్చిన “దేవుడు కనానీయులతో ఎందుకు యుద్ధం చేశాడు?” (ఇంగ్లీష్‌) ఆర్టికల్‌ చూడండి.