బైబిలు వచనాల వివరణ
యోహాను 3:16—“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను”
“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”—యోహాను 3:16, కొత్త లోక అనువాదం.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహాను 3:16, పరిశుద్ధ గ్రంథము.
యోహాను 3:16 అర్థమేంటి?
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం శాశ్వతకాలం జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకోసం ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును భూమ్మీదికి పంపించాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఎంతో ముఖ్యమైన పని చేశాడు. ఒకటి, తన దేవుడు అలాగే తండ్రి అయిన వ్యక్తి గురించి తన అనుచరులకు నేర్పించాడు. (1 పేతురు 1:3) ఇంకొకటి, మానవాళి కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం శాశ్వత జీవితం పొందాలంటే, యేసు మీద మనకు విశ్వాసం ఉండాలి.
“తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు” a అనే మాటలో దేవునికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. యేసు, దేవుని ప్రత్యేక కుమారుడు. ఎందుకంటే, ఆయన్ని మాత్రమే దేవుడు స్వయంగా చేశాడు. (కొలొస్సయులు 1:17) ఆయన “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు.” (కొలొస్సయులు 1:15) మిగతా సృష్టి అంతా, దేవదూతలతో సహా, యేసు ద్వారా ఉనికిలోకి వచ్చింది. అయినాసరే యెహోవా b దేవుడు తన ప్రియాతిప్రియమైన కుమారుణ్ణి “ఇతరులకు సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి” పంపించేందుకు ఇష్టపడ్డాడు. (మత్తయి 20:28) మనల్ని పాపం నుండి, మరణం నుండి విడుదల చేయడానికి యేసు బాధలుపడి చనిపోయాడు. పాపం, మరణం మొదటి మనిషైన ఆదాము నుండి మనకు వారసత్వంగా వచ్చాయి.—రోమీయులు 5:8, 12.
యేసు మీద విశ్వాసం చూపించాలంటే, కేవలం ఆయన మీద నమ్మకం ఉంచితే లేదా ఆయన మన కోసం ఏంచేశాడో గుర్తిస్తే సరిపోదు. దేవుని కుమారుని మీద మనకు విశ్వాసం ఉందని చూపించేలా ఆయనకు లోబడాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. (మత్తయి 7:24-27; 1 పేతురు 2:21) బైబిలు ఇలా చెప్తుంది: “కుమారుడి మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు; కుమారుడికి విధేయత చూపించని వ్యక్తి శాశ్వత జీవితం పొందడు.”—యోహాను 3:36.
యోహాను 3:16 సందర్భం
నీకొదేము అనే యూదా మత నాయకుడితో మాట్లాడుతున్నప్పుడు యేసు ఆ మాటలు అన్నాడు. (యోహాను 3:1, 2) యేసు అతనితో మాట్లాడుతూ దేవుని రాజ్యం c గురించి, ‘మళ్లీ పుట్టడం’ గురించి కొన్ని వివరాలు వెల్లడిచేశాడు. (యోహాను 3:3) తాను ఎలా చనిపోతాడో కూడా యేసు చెప్పాడు. “మానవ కుమారుడు కూడా ఎత్తబడాలి [కొయ్యకు వేలాడదీయబడాలి]. దానివల్ల, ఆయన్ని నమ్మే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందగలుగుతారు.” (యోహాను 3:14, 15) తర్వాత, శాశ్వత జీవితం పొందే ఈ అవకాశం మనుషుల మీద దేవునికి ఉన్న గొప్ప ప్రేమ నుండి పుట్టిందని నొక్కిచెప్పాడు. చివర్లో యేసు, ఈ శాశ్వత జీవితం పొందాలంటే మనం విశ్వాసం చూపించాలని, దేవున్ని సంతోషపెట్టే పనులు చేయాలని చెప్పాడు.—యోహాను 3:17-21.
a “ఒక్కగానొక్క” అని అనువదించిన గ్రీకు పదం మోనోయెనేస్. దానికి, “ఒకేఒక్కటి, … దాని రకంలో లేదా వర్గంలో ఉన్న ఒకేఒక్కటి, (రకంలో) ప్రత్యేకమైనది” అని అర్థం.—ఎ గ్రీక్-ఇంగ్లీష్ లెక్సికన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అండ్ అదర్ ఎర్లీ క్రిస్టియన్ లిటరేచర్, 658వ పేజీ.
b యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.
c “పరలోక రాజ్యం” అని కూడా పిలవబడే దేవుని రాజ్యం, పరలోకం నుండి పరిపాలించే ఒక ప్రభుత్వం. (మత్తయి 10:7; ప్రకటన 11:15) దేవుడు ఆ రాజ్యానికి రాజుగా యేసును నియమించాడు. దేవుని రాజ్యం భూమి విషయంలో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:10) దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చూడండి.