బైబిలు వచనాల వివరణ
రోమీయులు 10:13—“ప్రభువు నామమునుబట్టి” ప్రార్థనచేయడం
“యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.”—రోమీయులు 10:13, కొత్త లోక అనువాదం.
“ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.”—రోమీయులు 10:13, పరిశుద్ధ గ్రంథము.
రోమీయులు 10:13 అర్థమేంటి?
దేవుడు పక్షపాతం చూపించడు; దేశం, జాతి, సామాజిక హోదా వంటివాటితో సంబంధం లేకుండా, రక్షణ పొంది శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని అందరికీ ఇస్తున్నాడు. అయితే ఆ అవకాశాన్ని మనం పొందాలంటే, యెహోవా పేరున ప్రార్థించాలి. యెహోవా అనేది సర్వశక్తిగల దేవుని పేరు. a—కీర్తన 83:18.
బైబిలు యెహోవా పేరును పలకమని లేదా ఆయన పేరున ప్రార్థించమని చెప్పినప్పుడు దానర్థం కేవలం దేవుని పేరును తెలుసుకొని, ఆరాధనలో దాన్ని ఉపయోగించడమని కాదు. (కీర్తన 116:12-14) దేవుని మీద నమ్మకం ఉంచడం, సహాయం కోసం ఆయన మీద ఆధారపడడం కూడా అందులో భాగమే.—కీర్తన 20:7; 99:6.
దేవుని పేరును యేసుక్రీస్తు ప్రాముఖ్యమైనదిగా ఎంచాడు. ఆయన మాదిరి ప్రార్థనలోని మొట్టమొదటి పదాలు ఇలా ఉన్నాయి: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.” (మత్తయి 6:9) శాశ్వత జీవితం పొందాలంటే మనం ఆ పేరు వెనకున్న వ్యక్తిని తెలుసుకోవాలని, ఆయనకు లోబడాలని, ఆయన్ని ప్రేమించాలని కూడా యేసు చూపించాడు.—యోహాను 17:3, 6, 26.
పరిశుద్ధ గ్రంథములో రోమీయులు 10:13లో ప్రస్తావించబడిన “ప్రభువు” యెహోవాయే అని మనం ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే అక్కడ యోవేలు 2:32 లోని మాటలు ఎత్తి రాయబడ్డాయి. యోవేలు 2:32 లో “ప్రభువు” అనే బిరుదు కాకుండా దేవుని పేరు ఉంది. b
రోమీయులు 10:13 సందర్భం
ఒక వ్యక్తి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితేనే అతనికి దేవుని ఎదుట మంచి పేరు ఉంటుందని రోమీయులు 10వ అధ్యాయం చూపిస్తుంది. (రోమీయులు 10:9) పాత నిబంధన అని పిలవబడే భాగం నుండి ఎత్తి రాయబడిన లేఖనాలు అదే విషయాన్ని సమర్థిస్తున్నాయి. ఒక వ్యక్తి “బహిరంగంగా ప్రకటించ[డం]” ద్వారా విశ్వాసాన్ని చూపిస్తాడు; అవిశ్వాసులకు రక్షణ గురించిన మంచివార్త ప్రకటించడం కూడా ఆ కోవలోకే వస్తుంది. అలా ప్రకటించడం వల్ల, శాశ్వత జీవితానికి నడిపించే విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఇతరులకు దొరుకుతుంది.—రోమీయులు 10:10, 14, 15, 17.
రోమీయులు 10వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్ రెఫరెన్సులను కూడా చూడండి.
a దేవుని పేరు ప్రాచీన బైబిలు రాతప్రతుల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. హీబ్రూలో దేవుని పేరు నాలుగు అక్షరాల్లో కనబడుతుంది, వాటిని టెట్రగ్రామటన్ అంటారు. ఆ పేరును ఇంగ్లీషులో సాధారణంగా “జెహోవా” అని అనువదించారు; అయితే కొందరు విద్వాంసులు ఆ పేరును “యావే” అని అనువదించడానికి మొగ్గు చూపిస్తుంటారు.
b క్రైస్తవ బైబిలు రచయితలు దేవుని పేరున్న “పాత నిబంధన” లేఖనాలను ఎత్తి రాస్తున్నప్పుడు దేవుని పేరునే ఉపయోగించి ఉంటారు. ది యాంకర్ బైబిల్ డిక్షనరీ ఇలా చెప్తుంది: “మొట్టమొదటి కొత్త నిబంధన ప్రతులు రాయబడినప్పుడు, అందులో ఎత్తిరాసిన పాత నిబంధనలోని కొన్ని మాటల్లో లేదా అన్ని మాటల్లో టెట్రగ్రామటన్ అని పిలిచే దేవుని పేరైన యావే కనిపిస్తుందనడానికి రుజువులు ఉన్నాయి.” (6వ సంపుటి, 392వ పేజీ) మరింత సమాచారం కోసం పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం బైబిల్లో అనుబంధం A5 లోవున్న “క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు” అనే భాగాన్ని చూడండి.