బైబిలు వచనాల వివరణ
రోమీయులు 5:8—“మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను”
“దేవుడు మనపట్ల తనకున్న ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాగంటే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు.”—రోమీయులు 5:8, కొత్త లోక అనువాదం.
“దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.”—రోమీయులు 5:8, పరిశుద్ధ గ్రంథము.
రోమీయులు 5:8 అర్థమేంటి?
పాపులైన మనుషుల కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు చనిపోవడానికి అనుమతించడం ద్వారా యెహోవా a దేవుడు తన గొప్ప ప్రేమను చూపించాడు. (యోహాను 3:16) మనుషులు పాపులు కాబట్టి చాలాసార్లు వాళ్ల ఆలోచనలు, పనులు దేవుని నీతి ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటాయి. (కొలొస్సయులు 1:21, 22) అయితే దేవుడు తన “కుమారుడి మరణం ద్వారా” మనం తనతో తిరిగి శాంతియుత సంబంధం కలిగివుండేలా ఏర్పాటు చేశాడు. (రోమీయులు 5:10) దానివల్ల మనకు, ఇప్పుడు దేవునితో మంచి అనుబంధం కలిగివుండే అవకాశం అలాగే భవిష్యత్తులో శాశ్వత జీవితం పొందే నిరీక్షణ ఉన్నాయి.—రోమీయులు 5:11; 1 యోహాను 4:9, 10.
రోమీయులు 5:8 సందర్భం
అపొస్తలుడైన పౌలు రోములో నివసిస్తున్న క్రైస్తవులకు ఈ మాటలు రాశాడు. పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలోని 5వ అధ్యాయంలో క్రైస్తవులు తమ నిరీక్షణను బట్టి సంతోషించాలని, నమ్మకంతో ఉండాలని చెప్పాడు. (రోమీయులు 5:1, 2) “ఆ నిరీక్షణ మనల్ని నిరాశపర్చదు,” ఎందుకంటే అది యేసు ద్వారా వెల్లడైన దేవుని గొప్ప ప్రేమ మీద ఆధారపడి ఉంది. (రోమీయులు 5:5, 6) దేవునికి యేసు పూర్తి విధేయత చూపించాడు; మొట్టమొదటి మనిషైన ఆదాము అలా ఉండలేకపోయాడు. (రోమీయులు 5:19) ఆదాము అవిధేయత వల్ల ఆయన పిల్లలందరికీ పాపం, మరణం వచ్చాయి. (రోమీయులు 5:12) అయితే యేసు చూపించిన పరిపూర్ణ విధేయత అలాగే ఆయన త్యాగపూరిత మరణం, దేవునికి లోబడే మనుషులు శాశ్వత జీవితం పొందడానికి మార్గం తెరిచాయి.—రోమీయులు 5:21.
a బైబిలు ప్రకారం, దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.