బైబిలు వచనాల వివరణ
సామెతలు 16:3—“నీ పనుల భారము యెహోవామీద నుంచుము”
“నీ పనులన్నీ యెహోవాకు అప్పగించు, అప్పుడు నీ ఆలోచనలు సఫలమౌతాయి.”—సామెతలు 16:3, కొత్త లోక అనువాదం.
“నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.”—సామెతలు 16:3, పరిశుద్ధ గ్రంథము.
సామెతలు 16:3 అర్థమేంటి?
ఈ సామెత నిజమైన దేవున్ని ఆరాధించేవాళ్లకు ఒక భరోసా ఇస్తుంది. అదేంటంటే, వాళ్లు దేవుని మార్గనిర్దేశం కోసం వెదికి, దాన్ని పాటించడం ద్వారా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్లు అనుకున్నవి సఫలం అవుతాయి.
“నీ పనులన్నీ యెహోవాకు అప్పగించు.” యెహోవా a ఆరాధకులు నిర్ణయాలు తీసుకునే ముందు, మార్గనిర్దేశం కోసం వినయంగా ఆయనవైపు చూస్తారు. (యాకోబు 1:5) ఎందుకు? ఎందుకంటే, చాలా సందర్భాల్లో మనుషులు తమ జీవితంలో జరిగేవాటిని ఏమాత్రం అదుపు చేయలేరు. (ప్రసంగి 9:11; యాకోబు 4:13-15) దానితోపాటు, తాము అనుకున్నవి చేయడానికి కావాల్సిన తెలివి కూడా వాళ్లకు ఉండకపోవచ్చు. ఈ కారణాల వల్లే చాలామంది తెలివిగా తమ పనుల భారం యెహోవాకు అప్పగిస్తారు. మార్గనిర్దేశం కోసం ఆయనకు ప్రార్థించడం ద్వారా, ఆయన వాక్యమైన బైబిల్లో ఉన్న ఆయన ఇష్టానికి అనుగుణంగా పనులు చేయడం ద్వారా వాళ్లు అలా చేస్తారు.—సామెతలు 3:5, 6; 2 తిమోతి 3:16, 17.
“నీ పనుల భారము యెహోవామీద b నుంచుము” అనే మాటకు, “నీ పనుల్ని యెహోవా మీద వేయి” అని అర్థం. ఒక రెఫరెన్సు పుస్తకం ప్రకారం ఈ మాట, “తన భుజం మీదున్న భారాన్ని, దాన్ని తేలిగ్గా మోయగలిగే ఇంకో బలమైన వ్యక్తి మీద పెట్టే మనిషిని” వర్ణిస్తుంది. దేవుని మీద వినయంగా ఆధారపడేవాళ్లు దేవుడు సహాయం చేస్తాడని, ఆయన ఆదుకుంటాడని పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—కీర్తన 37:5; 55:22.
“నీ పనులన్నీ” అనే మాట, ప్రజలు చేయాలనుకునే ప్రతీ పనిని దేవుడు ఆమోదిస్తాడని లేదా ఆశీర్వదిస్తాడని చెప్పడం లేదు. యెహోవా ఆశీర్వాదం ఉండాలంటే, వాళ్లు అనుకునేవి ఆయన ప్రమాణాలకు అలాగే ఆయన ఇష్టానికి తగ్గట్లుగా ఉండాలి. (కీర్తన 127:1; 1 యోహాను 5:14) తనకు లోబడని వాళ్లను దేవుడు ఆశీర్వదించడు. నిజానికి, “దుష్టుల పన్నాగాల్ని ఆయన అడ్డుకుంటాడు.” (కీర్తన 146:9) అయితే, బైబిల్లో ఉన్న తన ప్రమాణాల్ని పాటించడం ద్వారా తనకు లోబడేవాళ్లకు ఆయన అండగా ఉంటాడు.—కీర్తన 37:23.
“అప్పుడు నీ ఆలోచనలు సఫలమౌతాయి.” కొన్ని అనువాదాలు ఈ మాటను, “నీ ఆలోచనలు స్థిరపర్చబడతాయి” అని అనువదించాయి. పాత నిబంధన అని పిలిచే హీబ్రూ లేఖనాల్లో “స్థిరపర్చబడతాయి” అని అనువదించిన పదం, పునాది వేయడం అనే అర్థాన్నిస్తుంది; అది తరచూ దేవుని సృష్టి కార్యాల్లో ఉన్న స్థిరత్వాన్ని సూచిస్తుంది. (సామెతలు 3:19; యిర్మీయా 10:12) అదేవిధంగా, తన దృష్టిలో సరైనది చేసేవాళ్ల ఆలోచనల్ని దేవుడు ధృడంగా స్థిరపరుస్తాడు; వాళ్లు మరింత సురక్షితంగా, స్థిరంగా, సంతోషంగా జీవించడానికి సహాయం చేస్తాడు.—కీర్తన 20:4; సామెతలు 12:3.
సామెతలు 16:3 సందర్భం
సామెతలు పుస్తకాన్ని చాలావరకు రాసిన సొలొమోను రాజే ఈ సామెతను రాశాడు. దేవుడిచ్చిన తెలివి వల్లే ఆయన వేల సామెతలు చెప్పగలిగాడు.—1 రాజులు 4:29, 32; 10:23, 24.
16వ అధ్యాయం ప్రారంభంలో సొలొమోను దేవుని తెలివిని పొగిడాడు, అలాగే గర్వం చూపించేవాళ్లు అంటే ఆయనకెంత అస్సహ్యమో చెప్పాడు. (సామెతలు 16:1-5) ఆ తర్వాత, సామెతలు పుస్తకం అంతటా పదేపదే కనిపించే ఒక ముఖ్యమైన సత్యాన్ని అర్థం చేసుకునేలా ఈ అధ్యాయం పాఠకులకు సహాయం చేస్తుంది; అదేంటంటే, మనుషులు వినయంగా ఉంటూ, దేవుని నిర్దేశాన్ని పాటించినప్పుడు మాత్రమే వాళ్లు నిజంగా తెలివిగలవాళ్లు అవుతారు, విజయం సాధిస్తారు. (సామెతలు 16:3, 6-8, 18-23) ఈ ప్రాథమిక సత్యం బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది.—కీర్తన 1:1-3; యెషయా 26:3; యిర్మీయా 17:7, 8; 1 యోహాను 3:22.
సామెతలు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.
a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్ చూడండి.
b చాలా బైబిలు అనువాదాలు దేవుని పేరు ఉండాల్సిన చోట “ప్రభువు” (లేదా “ప్రభువు”) అని పెడుతున్నాయి. తరచూ ఉపయోగించే ఈ పద్ధతి, బైబిలు చదివేవాళ్లను ఎందుకు అయోమయంలో పడేస్తుందో తెలుసుకోవడానికి ఈ సిరీస్‌లో “యెషయా 42:8—‘యెహోవాను నేనే’” అనే ఆర్టికల్ చూడండి.