కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

సామెతలు 3:5, 6​—“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకు”

సామెతలు 3:5, 6​—“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకు”

 “నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, నీ సొంత అవగాహన మీద ఆధారపడకు. నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో, అప్పుడు ఆయన నీ జీవితాన్ని సఫలం చేస్తాడు.”—సామెతలు 3:5, 6, కొత్త లోక అనువాదం.

 “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:5, 6, పరిశుద్ధ గ్రంథము.

సామెతలు 3:5, 6 అర్థమేంటి?

 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మనం పూర్తిగా సొంత తెలివి మీద ఆధారపడే బదులు నిర్దేశం కోసం యెహోవా a దేవుని వైపు చూడాలి.

 “నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు.” మనం దేవునికి నచ్చినట్టు పనులు చేసినప్పుడు ఆయన మీద నమ్మకం ఉందని చూపిస్తాం. మనం నిండు హృదయంతో దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచాలి. బైబిల్లో హృదయం అనే మాట ఎక్కువగా మనం లోపల ఎలాంటివాళ్లమో సూచిస్తుంది. అందులో మన భావోద్వేగాలు, ప్రేరణలు, ఆలోచనాతీరు, స్వభావం ఉంటాయి. కాబట్టి నిండు హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచడం అంటే కేవలం మనసులో ఉండే ఫీలింగ్‌ కాదు. బదులుగా, మనకు ఏది అన్నిటికన్నా మంచిదో మన సృష్టికర్తకు తెలుసని పూర్తిగా నమ్మకం కుదరడం వల్ల మనం చేసుకునే ఎంపిక.—రోమీయులు 12:1.

 “నీ సొంత అవగాహన మీద ఆధారపడకు.” మనం అన్నిసార్లూ సరిగ్గా ఆలోచించలేం కాబట్టి మనం దేవున్ని నమ్మాలి. మనం మనమీదే పూర్తిగా ఆధారపడితే లేదా మనకు మంచిది అనిపించిన దారిలో నడిస్తే, మొదట్లో అంతా బాగానే ఉన్నా చివరికి చెడు పర్యవసానాలు వస్తాయి. (సామెతలు 14:12; యిర్మీయా 17:9) దేవుని తెలివి మన తెలివి కన్నా చాలాచాలా ఉన్నతంగా ఉంటుంది. (యెషయా 55:8, 9) ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే మన జీవితం బాగుంటుంది.—కీర్తన 1:1-3; సామెతలు 2:6-9; 16:20.

 “నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో.” మన జీవితంలోని ప్రతీ ముఖ్యమైన విషయంలో, అలాగే ప్రతీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. అందుకోసం మనం ఆయన నిర్దేశం కోసం ప్రార్థించాలి, తన వాక్యమైన బైబిలు ద్వారా ఆయన చెప్పేది పాటించాలి.—కీర్తన 25:4; 2 తిమోతి 3:16, 17.

 “ఆయన నీ జీవితాన్ని సఫలం చేస్తాడు.” తన నీతి ప్రమాణాల ప్రకారం జీవించడానికి సహాయం చేయడం ద్వారా దేవుడు మన దారుల్ని తిన్నగా చేస్తాడు. (సామెతలు 11:5) అలా మనం అనవసరమైన సమస్యలకు దూరంగా ఉంటాం, మన జీవితం మరింత సంతోషంగా ఉంటుంది.—కీర్తన 19:7, 8; యెషయా 48:17, 18.

సామెతలు 3:5, 6 సందర్భం

 దేవున్ని సంతోషపెట్టడానికి, మనం సంతోషంగా జీవించడానికి కావల్సిన ప్రాథమిక సూత్రాలు బైబిల్లోని సామెతలు పుస్తకంలో ఉన్నాయి. మొదటి తొమ్మిది అధ్యాయాలు ఒక తండ్రి తన ప్రియమైన కొడుకుకు మంచిమాటలు చెప్తున్నట్టు ఉంటాయి. 3వ అధ్యాయం ముఖ్యంగా, మన సృష్టికర్త ఇచ్చే తెలివైన సలహాల్ని విలువైనవిగా చూస్తూ వాటిని పాటించేవాళ్లకు వచ్చే ప్రయోజనాల గురించి చెప్తుంది.—సామెతలు 3:13-26.

a యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.