బైబిలు వచనాల వివరణ
హెబ్రీయులు 11:1—“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపము”
“మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసం; అంతేకాదు, మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే విశ్వాసం.”—హెబ్రీయులు 11:1, కొత్త లోక అనువాదం.
“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.”—హెబ్రీయులు 11:1, పరిశుద్ధ గ్రంథము.
హెబ్రీయులు 11:1 అర్థమేంటి?
ఈ వచనంలో, విశ్వాసానికి లేఖనాల్లో ఉన్న అతిచిన్న నిర్వచనం చూడవచ్చు. అలాగే అది, విశ్వాసం అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదని చెప్తుంది.
“ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసం.” హెబ్రీయులు 11:1లో, “విశ్వాసం” అని అనువదించిన గ్రీకు మూలభాష పదం, బలంగా నమ్మడాన్ని లేదా బలంగా ఒప్పించబడడాన్ని సూచిస్తుంది. అలాంటి విశ్వాసం కేవలం ఫలానివి జరగాలని కోరుకోవడం కాదుగానీ అవి “తప్పక జరుగుతాయని బలంగా నమ్మడం.” “బలంగా నమ్మడం” a అని అనువదించిన గ్రీకు మాటను “ఆస్తి హక్కు దస్తావేజు” అని కూడా అనువదించవచ్చు. అది దాన్ని కలిగివున్న వ్యక్తిలో భరోసాను, నమ్మకాన్ని కలిగించే ఒక గ్యారంటీ లాంటిది.
“మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే [లేదా “ఒప్పింపజేసే రుజువే,” అధస్సూచి] విశ్వాసం.” బలమైన రుజువు ఉండడం వల్లే విశ్వాసం కలుగుతుంది. ఆ రుజువు ఎంత బలంగా ఉంటుంది అంటే, ఫలానా విషయం మన కంటికి కనిపించకపోయినా సరే అది నిజంగా ఉందని మనం బలమైన నమ్మకంతో ఉంటాం.
హెబ్రీయులు 11:1 సందర్భం
హెబ్రీయులు పుస్తకం అనేది అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో యెరూషలేము, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న క్రైస్తవులకు రాసిన ఒక ఉత్తరం. ఉత్తరంలోని ఈ అధ్యాయంలో పౌలు విశ్వాసం ఎంత ముఖ్యమో వివరంగా మాట్లాడాడు. ఉదాహరణకు, ఆయన ఇలా రాశాడు: “విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవాళ్లు ఆయన ఉన్నాడని, తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని తప్పకుండా నమ్మాలి.” (హెబ్రీయులు 11:6) పౌలు హెబ్రీయులు 11:1లో విశ్వాసం అంటే ఏంటో చెప్పాక, ఆ లక్షణాన్ని చూపించిన బైబిల్లోని స్త్రీపురుషుల ఉదాహరణల గురించి రాశాడు. వాళ్లు దేవుని ఇష్టం ప్రకారం జీవిస్తూ ఎలా విశ్వాసం చూపించారో చెప్పాడు.—హెబ్రీయులు 11:4-38.
a ఇక్కడ “బలంగా నమ్మడం” అని అనువదించిన గ్రీకు మాట ఈపొస్టాసీస్; దాన్ని అక్షరార్థంగా “కింద ఉండేది, పునాది” అని అనువదించవచ్చు.