కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

2 కొరింథీయులు 12:9—“నా కృప నీకు చాలును”

2 కొరింథీయులు 12:9—“నా కృప నీకు చాలును”

 “నా అపారదయ నీకు చాలు. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నా శక్తి ఇంకా బలంగా పనిచేస్తుంది.”—2 కొరింథీయులు 12:9, కొత్త లోక అనువాదం.

 “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.”—2 కొరింథీయులు 12:9, పరిశుద్ధ గ్రంథము.

2 కొరింథీయులు 12:9 అర్థమేంటి?

 దేవుడు అపొస్తలుడైన పౌలుకు కష్టాలు భరించడానికి, పరిమితులు ఉన్నా విజయం సాధించడానికి కావల్సిన శక్తిని ఇస్తానని మాటిస్తున్నాడు.

 “నా అపారదయ నీకు చాలు.” పౌలు పదేపదే చేసిన ప్రార్థనలకు దేవుడు ఇచ్చిన సమాధానాన్ని, “నీకు కావాల్సిందల్లా నా దయే” అని కూడా అనువదించవచ్చు. ఇంకోమాటలో చెప్పాలంటే, పౌలు కష్టాల్ని తట్టుకోవడానికి దేవుడిచ్చే అపారదయ సరిపోతుంది. ఎందుకలా చెప్పవచ్చు? “అపారదయ” లేదా “కృప” అని అనువదించిన పదం, దేవుడు ఉదారతతో ఉచితంగా ఇచ్చే అనర్హమైన బహుమతిని వర్ణిస్తుంది. దేవుని అపారదయ నుండి పౌలు ఎంతో ప్రయోజనం పొందాడని ఆయన రాసిన ఉత్తరాలు చూపిస్తున్నాయి. పౌలు ఒకప్పుడు క్రైస్తవులను హింసించేవాడు; అయినాసరే పౌలు మారడానికి, ఇతరులు క్రైస్తవులు అయ్యేలా సహాయం చేయడానికి కావాల్సిన శక్తిని దేవుడు పౌలుకు ఇచ్చాడు. (1 కొరింథీయులు 15:9, 10; 1 తిమోతి 1:12-14) కాబట్టి పౌలు తనకొచ్చే కష్టాలను, సవాళ్లను దాటడానికి దేవుని సహాయం మీద పూర్తిగా ఆధారపడవచ్చు.

 “ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నా శక్తి ఇంకా బలంగా పనిచేస్తుంది.” బలహీనులకు, అపరిపూర్ణులకు సహాయం చేసేటప్పుడు తన శక్తి ఇంకా స్పష్టంగా కనిపిస్తుందని ప్రభువైన యెహోవా a పౌలుకు గుర్తు చేస్తున్నాడు. (2 కొరింథీయులు 4:7; 12:8) క్రైస్తవులు తమ పరిమితుల్ని గుర్తించి, సహాయం కోసం యెహోవాపై ఆధారపడినప్పుడు, వాళ్లు దేవుని శక్తి తమలో పూర్తిగా పనిచేయడానికి అనుమతిస్తారు. (ఎఫెసీయులు 3:16; ఫిలిప్పీయులు 4:13) అలా, మనుషులు బలహీనంగా ఉన్నప్పుడు దేవుని శక్తి స్పష్టంగా కనిపిస్తుంది.

2 కొరింథీయులు 12:9 సందర్భం

 పౌలు సుమారు క్రీ.శ. 55 లో, కొరింథులో ఉన్న క్రైస్తవులకు దేవుని ప్రేరణతో ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చివరి అధ్యాయాల్లో పౌలు అపొస్తలుడిగా తనకున్న అధికారాన్ని సమర్థించుకున్నాడు. ఎందుకంటే, తమను తాము బోధకులుగా చెప్పుకున్న కొంతమంది పౌలు పైరూపాన్ని లేదా ఆయన మాట్లాడే సామర్థ్యాన్ని చూసి ఆయన గురించి చులకనగా మాట్లాడారు.—2 కొరింథీయులు 10:7-10; 11:5, 6, 13; 12:11.

 తనను తాను సమర్థించుకోవడంలో భాగంగా పౌలు, తాను సొంత శక్తి మీద ఆధారపడివుంటే తను పరిచర్యను చక్కగా చేయడం, అన్ని కష్టాలను సహించడం వీలయ్యేది కాదని వివరించాడు. (2 కొరింథీయులు 6:4; 11:23-27; 12:12) ఆ ఉత్తరం 12వ అధ్యాయంలో పౌలు, తన “శరీరంలో ఒక ముల్లు” ఉందని చెప్పాడు. బహుశా అది, చాలాకాలంగా తనను శారీరకంగా లేదా మానసికంగా బాధిస్తున్న ఒక సమస్య కావచ్చు. (2 కొరింథీయులు 12:7) పౌలు తన సమస్య గురించి వివరంగా చెప్పకపోయినా, దేవుని సహాయంతో దాన్ని సహించాలని బలంగా నిర్ణయించుకున్నాడు.

 ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా కష్టాలు, హింసలు రావచ్చు. తమకు వచ్చే ఎలాంటి సమస్యనైనా తట్టుకోవడానికి దేవుని శక్తి సహాయం చేస్తుందని తెలుసుకోవడం వాళ్లకు ఓదార్పుగా ఉంటుంది. పౌలులా వాళ్లు కూడా నమ్మకంతో ఇలా చెప్పవచ్చు: “నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి.”—2 కొరింథీయులు 12:10.

 2 కొరింథీయులు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.