రక్తమార్పిడుల గురించి డాక్టర్లు ఇప్పుడు ఏమంటున్నారు?
యెహోవాసాక్షులు రక్తమార్పిడులను ఒప్పుకోరని దశాబ్దాలుగా ప్రజలు వాళ్లను తప్పుపడుతున్నారు. ‘రక్తాన్ని విసర్జించండి’ అని బైబిల్లో ఉన్న ఆజ్ఞను పాటిస్తారు కాబట్టే వాళ్లు అందుకు ఒప్పుకోరు. అందుకే కొన్నిసార్లు వాళ్ల నిర్ణయం, రోగికి చాలా మంచిదని డాక్టర్లు సూచించే వైద్యానికి వేరుగా ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 15:28, 29.
అయితే వైద్యవృత్తిలో అనుభవమున్నవాళ్లు, రక్తం ఎక్కించకుండా వేరే పద్ధతుల్లో చికిత్స చేయడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి అంతకంతకూ ఎక్కువగా చెప్తున్నారు.
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్లు ప్రచురించే స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ మాగజిన్ 2013 లో వచ్చిన ఒక సంచికలో రక్తం గురించి ఒక ప్రత్యేక నివేదిక ఉంది. దానిలో ఒక ఆర్టికల్ పేరు, “ఎగేన్స్ట్ ద ఫ్లో—వాట్స్ బిహైండ్ ద డిక్లైన్ ఇన్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్.” దాన్ని రాసిన శారా సి. పి. విలియమ్స్ ఇలా అన్నారు: “గత దశాబ్దంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆపరేషన్ థియేటర్లలో, అలాగే హాస్పిటల్ వార్డుల్లో రోగులకు చికిత్స చేయడానికి కొన్నిసార్లు అవసరం లేకపోయినా, ఇంకొన్నిసార్లు అవసరమైనదానికన్నా ఎక్కువ మొత్తంలో రక్తం ఎక్కించారని చాలా పరిశోధనలు చూపిస్తున్నాయి.”
ద సెంటర్ ఫర్ బ్లడ్‌లెస్ మెడిసిన్ అండ్ సర్జరీ ఎట్ పెన్సిల్వేనియా హాస్పిటల్‌ను స్థాపించిన, దానికి డైరక్టర్‌గా ఉన్న పెట్రీషియా ఫోర్డ్, ఎమ్.డి., మాటలను శారా ఎత్తి రాశారు. డాక్టర్ ఫోర్డ్ ఇలా అన్నారు: “ఇంత మోతాదులో రక్తం లేకపోతే ప్రజలు చనిపోతారు ... చివరికి రక్తమే ప్రాణాలు కాపాడుతుంది అనే ఆలోచన వైద్య సంస్కృతిలో బలంగా పాతుకుపోయింది. కొన్ని పరిస్థితుల్లో అది నిజమే a అయినా చాలా పరిస్థితుల్లో, చాలామంది రోగుల విషయంలో అది నిజం కాదు.”
ప్రతీ సంవత్సరం దాదాపు 700 మంది యెహోవాసాక్షులకు వైద్యం చేసే డాక్టర్ ఫోర్డ్ ఇంకా ఇలా అన్నారు: “నేను మాట్లాడిన వైద్యుల్లో చాలామందికి ... ఎక్కువమంది రోగులు, రక్తం ఎక్కించకపోతే చనిపోతారనే తప్పుడు అభిప్రాయం ఉంది. నేను కూడా కొన్నిసార్లు అలా ఆలోచించి ఉంటాను. కానీ నాకు ఒక విషయం త్వరగా అర్థమైంది: కొన్ని సులువైన పద్ధతులు అవలంబిస్తే, రక్తం ఎక్కించకుండానే అలాంటి రోగులకు వైద్యం చేయవచ్చు.”
ఒక హాస్పిటల్లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్లను 28 ఏళ్లపాటు పరిశోధించి కనుగొన్న విషయాలను, 2012 ఆగస్టులో ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే పత్రిక ప్రచురించింది. రక్తం ఎక్కించుకున్న వాళ్లకన్నా అదే అనారోగ్యంతో బాధపడుతూ రక్తం ఎక్కించుకోకుండా చికిత్స చేయించుకున్న యెహోవాసాక్షులే చక్కగా కోలుకున్నారు. మిగతావాళ్లతో పోలిస్తే, యెహోవాసాక్షులకు శస్త్రచికిత్స వల్ల తలెత్తిన సమస్యలు తక్కువ; వాళ్లలో శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నవాళ్లు ఎక్కువ, ఆ తర్వాత 20 ఏళ్లు బ్రతికినవాళ్లు కూడా ఎక్కువే.
2013 ఏప్రిల్ 8న ద వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్‌లో ఇలా ఉంది: “తమ మత నమ్మకాల ప్రకారం రక్తమార్పిడులకు ఒప్పుకోని రోగులకు కొన్నేళ్లుగా రక్తరహిత సర్జరీలు, అంటే వేరేవాళ్ల రక్తం ఎక్కించకుండా ఆపరేషన్లు చేశారు. ఇప్పుడు ఆసుపత్రుల్లో ఆ పద్ధతినే ... ఎక్కువగా పాటిస్తున్నారు. దీనికి మద్దతిచ్చే డాక్టర్లు, ఈ పద్ధతివల్ల రక్తం కొనడానికి, నిలువ చేయడానికి, శుభ్రం చేయడానికి, పరీక్ష చేయడానికి, ఎక్కించడానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుందని అంటున్నారు. అంతేకాదు, రక్తమార్పిడుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. దానివల్ల రోగులు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం రాదు.”
క్లీవ్లండ్ క్లినిక్‌లో బ్లడ్ మేనేజ్మెంట్ మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాబర్ట్ లారెన్జ్ ఇలా అన్నారు అంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు: “రక్తం ఎక్కిస్తున్న క్షణంలో, రోగికి సహాయపడుతున్నామని మనకు అనిపిస్తుంది ... కానీ కొంతకాలం తర్వాత గమనిస్తే, నిజానికి దానివల్ల వాళ్లకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని తెలుస్తుంది.”
a రక్తం విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం గురించి తెలుసుకోవడానికి, “తరచూ అడిగే ప్రశ్నలు—మీరు రక్తమార్పిడులను ఎందుకు అంగీకరించరు?” అనే ఆర్టికల్ చూడండి.