ఊదారంగు త్రికోణం గుర్తు వేసుకున్నవాళ్లు …
ఫ్రాన్స్‌లో ఉండే మాడ్, స్కూల్లో అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు క్లాసుల్లో సహాయం చేసే పనిచేస్తుంది. ఈమధ్య ఒక క్లాస్‌లో విద్యార్థులకు నాజీ మారణహోమం గురించి, కాన్సన్ట్రేషన్ క్యాంపుల గురించి నేర్పించారు. క్యాంపుల్లో ఉన్న ప్రతీ ఖైదీకి వాళ్ల బట్టల మీద పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన గుర్తును ఇచ్చేవాళ్లు. ఆ గుర్తుకున్న రంగు, ఆకారాన్ని బట్టి వాళ్లను ఎందుకు జైల్లో వేశారో తెలిసేది.
కొంతమంది ఖైదీలు పెట్టుకున్న ఊదారంగు త్రికోణం గుర్తు గురించి ఒక టీచర్ మాట్లాడుతూ, “వాళ్లు స్వలింగ సంపర్కులు అనుకుంటా” అని చెప్పాడు. క్లాస్ తర్వాత మాడ్ ఆ టీచర్‌తో ఊదారంగు త్రికోణం గుర్తు నాజీలు యెహోవాసాక్షులను సూచించడానికి పెట్టారని వివరించింది. a దాని గురించి ఇంకొంత సమాచారాన్ని తీసుకురావచ్చా అని మాడ్ అడిగింది. ఆ టీచర్ దానికి ఒప్పుకున్నాడు అలాగే ఆ సమాచారాన్ని విద్యార్థులకు కూడా చెప్పమన్నాడు.
మరో క్లాస్‌లో ఇంకో టీచర్ అదే విషయం గురించి మాట్లాడుతూ, ఖైదీలు పెట్టుకున్న వేర్వేరు గుర్తుల్ని వివరించడానికి ఒక చార్టును ఉపయోగించింది. ఆ చార్టులో, ఊదారంగు త్రికోణం గుర్తు యెహోవాసాక్షుల్ని సూచిస్తుందని సరిగ్గానే ఉంది. మాడ్ క్లాస్ తర్వాత ఈ విషయం గురించి మరింత సమాచారం ఇవ్వచ్చా అని టీచర్ని అడిగింది. టీచర్ దానికి ఒప్పుకుంది, అంతేకాదు ఆ విషయాల గురించి విద్యార్థులకు కూడా చెప్పేలా ఏర్పాట్లు చేసింది.
మొదటి క్లాస్ కోసం, మాడ్ ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి సిద్ధపడింది. కానీ అక్కడకు వెళ్లాక “నువ్వు ఒక గంట మాట్లాడవచ్చు” అని టీచర్ చెప్పాడు. ముందుగా మాడ్ యెహోవాసాక్షులపై నాజీ దాడులకు సంబంధించిన డాక్యుమెంటరీ వీడియోను చూపించింది. నాజీలు యెహోవాసాక్షులైన 800 మంది పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లడం గురించి వీడియోలో చెప్పినప్పుడు మాడ్ ఆ వీడియోను కాసేపు ఆపి, అలా తీసుకెళ్లిన ముగ్గురు పిల్లల అనుభవాల్ని చదివి వినిపించింది. వీడియోను చూపించిన తర్వాత, ఆస్ట్రియాకు చెందిన 19 ఏళ్ల యెహోవాసాక్షి అయిన జెరాడ్ ష్టయినాకర్ 1940లో నాజీల చేతుల్లో చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన తల్లిదండ్రులకు రాసిన చివరి ఉత్తరాన్ని b చదివి, మాడ్ తన మాటల్ని ముగించింది.
ఇంకో క్లాస్‌లో కూడా మాడ్ అదే సమాచారాన్ని అందించింది. మాడ్ చూపించిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఆ ఇద్దరు టీచర్లు నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో బలైనవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు యెహోవాసాక్షుల గురించి ఖచ్చితంగా చెప్తున్నారు.
a రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలకు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకోనందుకు జర్మనీలో ఉన్న యెహోవాసాక్షులకు జైలుశిక్ష వేశారు. ఆ సమయంలో వాళ్లను బీబల్ఫార్షర్ (బైబిలు విద్యార్థులు) అని కూడా పిలిచేవాళ్లు.
b జర్మనీ సైన్యంలో చేరనందుకు జెరాడ్ ష్టయినాకర్కు మరణశిక్షను విధించారు. ఆయన తన చివరి ఉత్తరంలో ఇలా రాశాడు: “నేను ఇంకా బాలుడినే. ప్రభువు నాకు శక్తిని ఇస్తే తప్ప నేను తట్టుకుని నిలబడలేను, కాబట్టి నేను ప్రార్థించేది దానికోసమే.” ఆ తర్వాత ఉదయాన్నే జెరాడ్ను చంపేశారు. ఆయన సమాధిపై ఇలా రాసి ఉంది: “దేవున్ని మహిమపర్చడం కోసం చనిపోయాడు.”