బైబిలు జీవితాలను మారుస్తుంది
నా జీవితంలో పొందిన అత్యుత్తమ బహుమతి
పుట్టిన సంవత్సరం 1967
దేశం ఫిన్‌లాండ్
ఒకప్పుడు టెన్నిస్ క్రీడాకారుడు
నా గతం
నేను ఫిన్‌లాండ్‌లోని టాంపీర్ నగరం పొలిమేరల్లో పెరిగాను. మేము ఉన్న ప్రాంతం ప్రశాంతంగా, పచ్చగా ఉంటుంది. మా ఇంట్లోవాళ్లు మరీ భక్తిపరులేం కాదు. కానీ చదువుకు, సంస్కారానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు. అమ్మ జర్మనీ దేశస్థురాలు, నా చిన్నతనంలో అమ్మమ్మవాళ్లు ఉండే పశ్చిమ జర్మనీకి అప్పుడప్పుడు వెళ్లి వస్తుండేవాడిని.
నాకు చిన్నప్పటి నుండి ఆటలంటే ఇష్టం. చిన్నతనంలో నేను ఆడని ఆట అంటూ లేదు. కానీ నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు, టెన్నిస్ బాగా ఆడడం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. 16 ఏళ్లు వచ్చేసరికి రోజుకు రెండు మూడుసార్లు శిక్షణ తీసుకునేవాడిని. రెండుసార్లు నిపుణుల చేత శిక్షణ పొందేవాడిని, సాయంత్రాలు సొంతగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ ఆటకు సంబంధించిన వేర్వేరు విషయాలు నన్ను కట్టిపడేశాయి. టెన్నిస్ ఆడుతూ మానసికంగా, శారీరకంగా నన్ను నేను సవాలు చేసుకునేవాడిని. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ, బీర్ తాగడానికి కూడా ఇష్టపడేవాడిని. కానీ డ్రగ్స్ తీసుకోవడం, అతిగా తాగడం లాంటి వాటితో జీవితాన్ని సమస్యల్లో పడేసుకోలేదు. టెన్నిస్ మాత్రమే నా జీవితం, అదే నా ప్రపంచంగా ఉండేది.
17 ఏళ్లు వచ్చాక ATP టోర్నమెంట్‌లలో a ఆడడం మొదలుపెట్టాను. కొన్ని టోర్నమెంట్‌లు గెలిచేసరికి జాతీయ గుర్తింపు వచ్చింది. 22 ఏళ్ల వయసులోనే, ప్రపంచంలోని అత్యుత్తమ 50 టెన్నిస్ ఆటగాళ్లలో ఒకనిగా స్థానం సంపాదించుకున్నాను.
ఎన్నో సంవత్సరాలపాటు వివిధ దేశాల్లో టోర్నమెంట్‌లు ఆడాను. కొన్ని అందమైన ప్రాంతాల్ని చూశాను, వాటితోపాటు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేరాలు, డ్రగ్స్, పర్యావరణ సమస్యలు వంటి వాటిమీద కూడా కాస్త అవగాహన వచ్చింది. ఒకసారి మేం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నప్పుడు, అక్కడి నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేరాలు విపరీతంగా జరుగుతుంటాయి కాబట్టి అటువైపు వెళ్లొద్దని మాకు చెప్పారు. ఆ విషయాలు నాలో అలజడిని రేపాయి. నాకు నచ్చిన పనినే చేస్తున్నా, ఏ రోజూ తృప్తిగా అనిపించేది కాదు.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...
నా గర్ల్‌ఫ్రెండ్ సాన్న యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. తనకు ఇంత భక్తి ఉందా అని కాస్త ఆశ్చర్యపోయాను, నేను తనకు అడ్డు మాత్రం చెప్పలేదు. 1990లో మేం పెళ్లిచేసుకున్నాం, ఆ తర్వాతి సంవత్సరం ఆమె బాప్తిస్మం తీసుకుంది. నా విషయానికొస్తే, దేవుడు ఉన్నాడని నమ్మేవాడిని కానీ పెద్ద భక్తిపరుడిని ఏమీ కాదు. జర్మనీలో ఉండే మా అమ్మమ్మ బైబిలు బాగా చదివేది, నాకు ప్రార్థన చేయడం కూడా నేర్పించింది.
ఒకరోజు నన్నూ, నా భార్యను కలిసేందుకు ఒక సహోదరి, అలాగే ఆమె భర్త కారి మా ఇంటికొచ్చారు. కారి నాకు ‘చివరి రోజులకు’ సంబంధించిన బైబిలు ప్రవచనాన్ని చూపించాడు. (2 తిమోతి 3:1-5) ప్రపంచంలోని పరిస్థితులు ఇంత చెడుగా ఎందుకు ఉన్నాయో వివరించిన ఆ ప్రవచనం నా మనసును ఆకర్షించింది. ఆ రోజు మేం మతం గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. అయితే ఆ రోజు నుండి కారిని బైబిలు విషయాలు అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టాను, ఆయన వివరించేవన్నీ సరైనవి అనిపించాయి. నేను బిజీగా ఉండడం, ఎక్కువగా వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల నేనూ కారి తరచూ కలవడం కుదిరేది కాదు, కానీ కారి పట్టువదల్లేదు. స్టడీ జరుగుతున్నప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబుల్ని ఉత్తరాల్లో రాసి పంపేవాడు. జీవితానికి సంబంధించిన పెద్దపెద్ద ప్రశ్నలన్నిటికీ బైబిల్లో అర్థవంతమైన జవాబులు దొరికాయి. దేవుని రాజ్యమే దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేరుస్తుందనే బైబిలు సారాంశాన్ని మెల్లమెల్లగా గ్రహించగలిగాను. దేవుని పేరు యెహోవా అని తెలుసుకోవడం, ఆయన మనకోసం చేసినవాటిని చూడడం నాపై చెరగని ముద్ర వేశాయి. (కీర్తన 83:18) అన్నిటికన్నా ఎక్కువ ఆకట్టుకున్నది ఆయన ఏర్పాటు చేసిన విమోచన క్రయధనం. అది లాంఛనప్రాయంగా లేదా చట్టబద్ధంగా చేసిన ఏర్పాటు కాదు, దేవుని ప్రేమకు నిదర్శనం. (యోహాను 3:16) అంతేకాదు దేవుని స్నేహితునిగా ఉంటూ శాంతికి నిలయమైన పరదైసులో నిత్యం జీవించే అవకాశం నాకుందని తెలుసుకున్నాను. (యాకోబు 4:8) మరి “నా కృతజ్ఞతను ఏవిధంగా చూపించాలి?” అని ఆలోచించడం మొదలుపెట్టాను.
గడిచిపోయిన నా జీవితం గురించి ఆలోచించాను. ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉందని బైబిలు నుండి నేర్చుకుంటున్నాను, కాబట్టి నా నమ్మకాల్ని ఇతరులతో పంచుకోవాలనే కోరిక కలిగింది. (అపొస్తలుల కార్యాలు 20:35) టెన్నిస్ క్రీడాకారుడిని కాబట్టి టోర్నమెంట్‌లలో పాల్గొంటూ సంవత్సరంలో 200 రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చేది. మా కుటుంబ సభ్యులు ఎంతసేపూ నా శిక్షణ గురించి, నా ప్రణాళిక గురించి, నా కెరీర్ గురించి ఆలోచించాల్సి వచ్చేది. నా జీవితంలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
మంచి స్పోర్ట్స్ కెరీర్‌ను మతం కోసం వదిలేయడం చాలామందికి నచ్చదని నాకు తెలుసు. కానీ యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుని శాశ్వత జీవితం సొంతం చేసుకోవడం ప్రాముఖ్యం. అది టెన్నిస్ ఆటలో నేను గెల్చుకునే బహుమతుల కన్నా చాలా గొప్పది. కాబట్టి నిర్ణయాన్ని చాలా తేలిగ్గా తీసుకోగలిగాను. వేరేవాళ్లు ఏమి అనుకున్నా పట్టించుకోకూడదు, ఇది నేను తీసుకోవాల్సిన నిర్ణయం అనుకున్నాను. అలాంటి ఒత్తిడిని తట్టుకోవడానికి నాకు బాగా ఉపయోగపడిన లేఖనం కీర్తన 118:6. అక్కడ ఇలా ఉంది: “యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నా కేమి చేయగలరు?”
సరిగ్గా అప్పుడే నాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కొంతమంది స్పాన్సర్లు ముందుకొచ్చి ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. దానికి ఒప్పుకుంటే టెన్నిస్ ఆడుతూ, అసలు వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా జీవితాన్ని హాయిగా గడపొచ్చు. కానీ నేను అప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నా కాబట్టి, వాళ్లతో ఒప్పందం కుదుర్చుకోలేదు. మెల్లగా ATP టోర్నమెంట్‌లలో ఆడడం కూడా మానేశాను. ఇక బైబిలు స్టడీ కొనసాగించి, 1994 జూలై 2న బాప్తిస్మం తీసుకున్నాను.
నేనెలా ప్రయోజనం పొందానంటే ...
సాధారణంగా కొంతమందికి, ఏదోక విషాద సంఘటన జరిగాక దేవుని మీద ఆసక్తి కలుగుతుంది. నా విషయంలో అలా జరగలేదు. అలాగని సత్యం తెలుసుకోవాలనే ఆసక్తితో జీవించిన వ్యక్తిని కూడా కాదు. ఉన్నదాంతో సంతృప్తిగా జీవించేవాడిని. కానీ అనుకోకుండా, బైబిలు సత్యం తెలుసుకునే అవకాశం దానంతటదే వచ్చింది. జీవితానికి లోతైన అర్థముందని గ్రహించాను, నేను ఊహించిన దానికన్నా మంచిగా నా జీవితం మలుపు తిరిగింది. ఒకప్పటి కన్నా ఇప్పుడు మా కుటుంబం బలంగా, ఐక్యంగా ఉంది. నా ముగ్గురు కొడుకులు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు కాకుండా క్రైస్తవులు అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
టెన్నిస్ అంటే నాకిప్పటికీ ఇష్టమే. ఎన్నో ఏళ్లుగా టెన్నిస్ కోచ్‌గా, టెన్నిస్ సెంటర్ మేనేజర్‌గా పనిచేస్తూ జీవితం కొనసాగిస్తున్నాను. కానీ టెన్నిసే నా జీవితం కాదు. ఇంతకముందైతే, మంచి టెన్నిస్ క్రీడాకారునిగా, ఛాంపియన్‌గా పేరు తెచ్చుకోవాలని ప్రతీవారం చాలా గంటలు శిక్షణ పొందేవాడిని. ఇప్పుడైతే, నా జీవితాన్ని మార్చిన బైబిలు సూత్రాల్ని ఇతరులకు నేర్పించడానికి నా పూర్తి సమయాన్ని ఉపయోగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. యెహోవా దేవునితో నాకున్న సంబంధానికి, ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన నిరీక్షణను ఇతరులతో పంచుకోవడానికి ముఖ్యమైన స్థానం ఇవ్వడంలో ఎక్కువ సంతోషాన్ని పొందుతున్నాను.—1 తిమోతి 6:19.
a ATP అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ టెన్నిస్ సర్క్యూట్స్‌లోని పురుషుల విభాగాన్ని ఆ అసోసియేషన్ పర్యవేక్షిస్తుంది. ATP టూర్‌లో భాగంగా వివిధ టోర్నమెంట్‌లు నిర్వహించి గెలిచినవాళ్లకు పాయింట్లు, డబ్బులు బహుమతిగా ఇస్తారు. అలాంటి టోర్నమెంట్‌లలో క్రీడాకారులు సంపాదించిన పాయింట్లను బట్టి వాళ్లు ప్రపంచంలో ఎన్నో ర్యాంకింగ్ ఉన్నారో నిర్ణయిస్తారు.