ద వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 138వ తరగతి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం
2015, మార్చి 14న న్యూయార్క్‌లోని ప్యాటర్సన్లో, ద వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 138వ తరగతి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నేరుగా అలాగే వేర్వేరు ప్రదేశాల్లో వీడియో ద్వారా 14వేల కన్నా ఎక్కువమంది చూశారు. ఆరోజు కార్యక్రమం నాలుగు కొత్త రాజ్యగీతాల సంగీతంతో ప్రారంభమైంది, ఆ తర్వాత ఆ పాటలను కార్యక్రమానికి హాజరైనవాళ్లంతా పాడారు. a
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన జెఫ్రీ జాక్సన్ ఆ కార్యక్రమానికి ఛైర్మన్‌గా ఉన్నాడు. ఆయన కార్యక్రమ ప్రారంభంలో, గిలియడ్ విద్యార్థులు తాము పొందిన జ్ఞానాన్ని దాచుకోకుండా, ఇతరులకు ప్రయోజనం కలిగేలా దాన్ని ఉపయోగించాలని వాళ్లను ప్రోత్సహించాడు.—2 తిమోతి 2:2.
సహోదరుడు జాక్సన్ ఆ కార్యక్రమంలో, మోషే ఉంచిన ఆదర్శం గురించి చర్చించాడు. కొంతకాలం వరకు, ఇశ్రాయేలు జనాంగం మోషే గుడారాన్నే సత్యారాధనకు కేంద్రంగా ఉపయోగించింది. అయితే ప్రత్యక్ష గుడారం పూర్తయ్యాక దాన్ని సత్యారాధనకు కేంద్రంగా ఉపయోగించారు. ఆ గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అవకాశం మోషేకు లేదు. ఎందుకంటే ఆ అర్హత కేవలం ప్రధాన యాజకునికి మాత్రమే ఉండేది. ఈ విషయం గురించి మోషే ఫిర్యాదు చేసినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. బదులుగా, ప్రధాన యాజకునిగా అహరోనుకు ఉన్న బాధ్యతల్ని నిర్వహించడానికి మోషే ఆయనకు సహాయం చేశాడు.(నిర్గమకాండము 33:7-11; 40:34-35) దీన్ని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? “మీకు ఉన్న సేవావకాశాలను విలువైనవిగా చూడండి, ఇతరులకు ఉన్న సేవావకాశాలను దక్కించుకోవడానికి ప్రయత్నించకండి” అని సహోదరుడు జాక్సన్ చెప్పాడు.
“ఆకు చప్పుడుకు మీరు భయపడతారా?” ఇది సహోదరుడు కెన్నెత్ ఫ్లోడీన్ ఇచ్చిన ప్రసంగ అంశం. ఆయన పరిపాలక సభలోని టీచింగ్ కమిటీకి సహాయకునిగా సేవ చేస్తున్నాడు. ఆయన ఆ కార్యక్రమంలోని గిలియడ్ విద్యార్థుల్ని ఉద్దేశిస్తూ, వాళ్లకు భయాన్ని కలిగించే పరిస్థితులు, సవాళ్లతో కూడిన నియామకాలు ఎదురుకావచ్చని చెప్పాడు. అయితే అలాంటి పరిస్థితుల్ని పెద్ద సవాళ్లుగా కాదుగానీ కేవలం ఎండిపోయిన ఆకుల్లా చూడాలని లేవీయకాండము 26:36ను ఉపయోగిస్తూ ఆయన విద్యార్థుల్ని ప్రోత్సహించాడు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ యెహోవా మీదున్న నమ్మకంతో వాటన్నిటిని సహించిన అపొస్తలుడైన పౌలు ఆదర్శాన్ని సహోదరుడు ఫ్లోడీన్ ముఖ్యంగా చెప్పాడు.—2 కొరింథీయులు 1:8, 10.
“మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?” అనే అంశమున్న తర్వాతి ప్రసంగాన్ని పరిపాలక సభ సభ్యుడైన మార్క్ సాండర్సన్ ఇచ్చాడు. ఆయన సామెతలు 13:12లో ఉన్న ఈ సూత్రం గురించి చర్చించాడు, “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును.” విచారకరంగా చాలామంది, తాము ఎప్పటికీ సంపాదించలేని సంపద లేదా పేరుప్రతిష్ఠల్ని లక్ష్యంగా పెట్టుకోవడంవల్ల జీవితమంతా నిరుత్సాహంతోనే ఉంటారు.
యేసు కాలంలో, కొంతమంది ప్రజలు బాప్తిస్మమిచ్చు యోహాను మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నారు. (లూకా 7:24-28) ఉదాహరణకు వాళ్లు, వాస్తవంకాని బోధలతో తమను సంతోషపెట్టే తత్త్వవేత్త కోసం ఎదురుచూసుండవచ్చు. ఒకవేళ వాళ్లు అదే ఆశించివుంటే, వాళ్ల ఆశలన్నీ ఆవిరైపోయుంటాయి. ఎందుకంటే యోహాను వాస్తవమైన సత్యాన్ని బోధించాడు. మరికొందరు, ఆయన చూడచక్కగా ఉంటాడని ఎదురుచూసుండవచ్చు. కానీ ఆయన పేదవాళ్లు వేసుకునే బట్టల్ని వేసుకున్నాడు. ఏదేమైనా వాళ్లు తాము ఊహించనట్లుగా ఉండే ప్రవక్త కోసం ఎదురుచూశారు. ఏదేమైనా యోహాను కేవలం ప్రవక్త మాత్రమే కాదుగానీ మెస్సీయాకు ముంగుర్తు కూడా.—యోహాను 1:29.
కాబట్టి సరైన వాటికోసం ఎదురుచూడమని సహోదరుడు సాండర్సన్ విద్యార్థుల్ని ప్రోత్సహించాడు. ఇతరుల దగ్గర పేరు సంపాదించుకోవాలనో లేదా అందరూ తమను ప్రత్యేకంగా చూడాలనో ఎదురుచూసే బదులు తాము పొందిన శిక్షణను ఇతరుల మేలు కోసం ఉపయోగించడంపై మనసుపెట్టాలని ఆయన చెప్పాడు. అలా ఉపయోగించాలంటే వాళ్లు గిలియడ్‌లో నేర్చకున్న విషయాల్ని తమ సహోదరసహోదరీలతో పంచుకోవాలని, వాళ్ల విశ్వాసాన్ని బలపర్చాలని, వాళ్లను ప్రేమించాలని కూడా ఆయన చెప్పాడు. “మీ సహోదరసహోదరీలకు వినయంగల సేవకులుగా ఉంటూ దేవుని చిత్తం నెరవేర్చడానికి చేయగలిగినదంతా చేయండి. మీరు ఎన్నడూ నిరాశపడరు” అని సహోదరుడు సాండర్సన్ చెప్పాడు.
“ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారమివ్వండి.” దైవపరిపాలన స్కూళ్ల డిపార్ట్మెంట్లో ఉపదేశకునిగా సేవ చేస్తున్న జేమ్స్ కోథాన్ ఈ అంశం పై ప్రసంగించారు. ప్రేమను, మెచ్చుకోలును, గుర్తింపును పొందాలనే తపన ప్రతీఒక్కరికీ ఉంటుందని సహోదరుడు కోథాన్ చెప్పాడు. యేసుకు కూడా ఆ కోరిక ఉండేది, ఆయన బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు యెహోవా పరలోకం నుండి ఆప్యాయంగా మాట్లాడడం ద్వారా ఆ కోరిక తీర్చాడు.—మత్తయి 3:16, 17.
ఇతరుల్ని మన మాటలతో ప్రోత్సహించి, బలపర్చే శక్తిని యెహోవా మనకు ఇచ్చాడు. మనం ఆ శక్తిని ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. (సామెతలు 3:27) “ఇతరుల్లో ఉన్న మంచిని చూసేలా మీకు మీరు శిక్షణ ఇచ్చుకోండి. ఆతర్వాత వాళ్లను మెచ్చుకోవడానికి వెనకాడకండి” అని సహోదరుడు కోథాన్ విద్యార్థుల్ని ప్రోత్సహించాడు. మన తోటి సహోదరసహోదరీల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నప్పుడు, వాళ్లు చేస్తున్న కృషిని మనం విలువైనదిగా చూస్తున్నామని వాళ్లు తెలుసుకుంటారు.
చివరిశ్వాస వరకు దేవుని చిత్తాన్ని చేయడం అనే అంశమున్న తర్వాతి ప్రసంగాన్ని టీచింగ్ కమిటీకి సహాయకునిగా సేవ చేస్తున్న మార్క్ నూమర్ ఇచ్చాడు. ఆయన అపొస్తలుడైన పౌలు ఉదాహరణను ఉపయోగిస్తూ, కొంచెముతో తృప్తి పడకుండా జాగ్రత్తపడమని విద్యార్థుల్ని ప్రోత్సహించాడు. పౌలులా వాళ్లు కూడా స్వయంత్యాగస్ఫూర్తి చూపిస్తే నిజమైన సంతోషాన్ని రుచి చూస్తారని ఆయన చెప్పాడు.—ఫిలిఫ్పీయులు 2:17, 18.
ఆఖరికి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పౌలు దేవుని చిత్తం చేయడం మానలేదు. ఆయన తన చివరిశ్వాస విడిచేవరకు దేవుని చిత్తం చేయడానికి వీలైనంత ఎక్కువ శ్రమపడ్డాడు. ఆయన తన శక్తినంతటినీ యెహోవా కోసం ఉపయోగించాడు. అందుకే ఆయన “నా పరుగు కడ ముట్టించితిని” అని అనగలిగాడు. (2 తిమోతి 4:6-7) తమ నియామకంలో నమ్మకంగా రాజ్యపనికి మద్దతిస్తూ పౌలును అనుకరించమని సహోదరుడు నూమర్ విద్యార్థుల్ని ప్రోత్సహించాడు.
అనుభవాలు. మైకెల్ బెర్నెట్ అనే మరో గిలియడ్ పాఠశాల ఉపదేశకుడు తర్వాతి ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆ ప్రసంగంలో భాగంగా కొంతమంది విద్యార్థులు, ప్యాటర్సన్లో పరిచర్య చేస్తున్నప్పుడు తమకు ఎదురైన మంచి అనుభవాలను పునర్నటించి చూపించారు.
అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలో, విద్యార్థులు ప్రజలకు వాళ్ల మనసుకు హత్తుకునే భాషలో అంటే వాళ్ల సొంత భాషలో సాక్ష్యం ఇచ్చారు. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఉదాహరణకు ఓ విద్యార్థి, తాను పరిచర్య చేయాలనుకుంటున్న ప్రాంతంలో స్పానిష్ మాట్లాడేవాళ్లు ఎక్కువమంది ఉన్నారని తెలుసుకున్నాడు. దాంతో, ఆయన అక్కడికి పరిచర్యకు వెళ్లడానికి ముందు JW లాంగ్వేజ్ యాప్ సహాయంతో స్పానిష్ భాషలో కొన్ని మాటలను నేర్చుకున్నాడు. ఆ తర్వాతి రోజే, స్పానిష్ మాట్లాడే ఓ వ్యక్తి ఆయనకు వీధిలో కలిశాడు. ఆయన అంతంతమాత్రంగా నేర్చుకున్న స్పానిష్ భాషలో ఆ వ్యక్తితో మాట్లాడి బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి మాత్రమేకాదు అతని కుటుంబసభ్యులు మరో నలుగురు కూడా బైబిలు స్టడీ తీసుకుంటున్నారు.
ఇంటర్వ్యూలు. కార్యక్రమంలో తర్వాతి భాగాన్ని పరిపాలక సభలోని సర్వీస్ కమిటీకి సహాయకునిగా సేవ చేస్తున్న సహోదరుడు జూ. విలియమ్ టర్నర్ చేశారు. ఆయన నలుగురు విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేసి, వాళ్లు గిలియడ్ పాఠశాలకు రాకముందు ఎదురైన అనుభవాల గురించి, గిలియడ్ పాఠశాలలో వాళ్లు పొందిన శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నాడు.
గిలియడ్ పాఠశాలలోని ఏ పాఠ్యాంశాలు తమకు ప్రోత్సాహాన్ని ఇచ్చాయో విద్యార్థులు వివరించారు. ఉదాహరణకు ఓ విద్యార్థి, లూకా 10వ అధ్యాయంలోని వృత్తాంతం నుండి తాను ఏమి నేర్చుకున్నాడో వివరించాడు. యేసు పంపించిన 70 మంది శిష్యులు, తమకు పరిచర్యలో మంచి ఫలితాలు వచ్చినప్పుడు చాలా సంతోషించారు. వాళ్లతోపాటు యేసు కూడా సంతోషించినప్పటికీ, పరిచర్యలో వచ్చిన ఫలితాలపై మాత్రమే వాళ్ల సంతోషం ఆధారపడి ఉండకూడదని ఆయన శిష్యులకు చెప్పాడు. బదులుగా తమ కృషిని చూసి యెహోవా ఆనందిస్తున్నాడని తెలుసుకుని సంతోషంగా ఉండమని యేసు వాళ్లకు బోధించాడు. కాబట్టి నిజమైన ఆనందం మన పరిస్థితులపై కాదుగానీ యెహోవా అనుగ్రహంపై ఆధారపడి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి.
సహోదరుడు టర్నర్ ఫిలిప్పీయులు 1:3-6 వచనాల్లోని మాటలను విద్యార్థులకు అన్వయిస్తూ యెహోవా వాళ్లలో ‘సత్క్రియ ప్రారంభించాడని,’ వాళ్లకు ఆయన ఎప్పటికీ అండగా ఉంటాడని భరోసా ఇచ్చాడు.
“మీ దృష్టిని యెహోవాపై ఉంచండి” అనే ముఖ్య ప్రసంగాన్ని పరిపాలకసభ సభ్యుడైన సామ్యూల్ హెర్డ్ ఇచ్చాడు. మనం యెహోవాను చూడలేనప్పుడు ఆయనపై మన దృష్టిని ఉంచడం ఎలా సాధ్యమవుతుంది అనే అంశంపై ఆయన చర్చించాడు.
మనం యెహోవాను చూడగల ఓ మార్గం ఏమిటంటే, ఆయన చేసిన సృష్టిని పరిశీలించడం. అవి ఆయన గురించి మనకు ఎన్నో విషయాలు చెప్తాయి. పైగా యెహోవా మన ‘మనోనేత్రాలు వెలిగించాడు.’ (ఎఫెసీయులు 1:18) మనం ఎంత ఎక్కువగా బైబిలు చదివితే అంత ఎక్కువగా యెహోవా గురించి తెలుసుకుంటాం. ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆయనకు అంత దగ్గర అవుతాం.
ముఖ్యంగా మనం సువార్త వృత్తాంతాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే వాటిలో దేవుని కుమారుడైన యేసు మాటలు, ఆయన చేసిన పనులు ఉన్నాయి. అవి యెహోవాను అర్థంచేసుకోవడానికి మనకు చాలా సహాయం చేస్తాయి. యేసు తన తండ్రి స్వభావాన్ని ఎంత ఎక్కువగా ప్రతిబింబించాడంటే ఆయన ఇలా అనగలిగాడు, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.”—యోహాను 14:9.
యేసు చేసిన పనుల్లో యెహోవాను చూడడమే కాకుండా యేసును ఆదర్శంగా తీసుకోమని సహోదరుడు హెర్డ్ విద్యార్థుల్ని ప్రోత్సహించాడు. ఉదాహరణకు, ఇతరులకు ఆధ్యాత్మిక ఆహారమివ్వడానికి యేసు ఎంతో కృషి చేసినట్లే మనం కూడా మన దగ్గరున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడానికి తీవ్రంగా కృషిచేయాలి.
యెహోవాపై దృష్టిపెట్టడం వల్ల మనం ఎలాంటి ప్రయోజనం పొందుతాం? కీర్తనకర్తలాగే మనం కూడా ఇలా భావిస్తాం, “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.”—కీర్తన 16:8.
ముగింపు. విద్యార్థులు తమ పట్టాలను తీసుకున్న తర్వాత, ఓ విద్యార్థి తరగతిలోని అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ మనసును తాకే ఓ ఉత్తరాన్ని చదివాడు. ఆ తర్వాత సహోదరుడు జాక్సన్ ముగింపు మాటలు చెప్తూ, గిలియడ్ విద్యార్థులు తాము బోధించేవి కొత్త విషయాలే అయ్యి ఉండాలని అనుకోకూడదని చెప్పాడు. చాలావరకు సహోదరసహోదరీలకు అప్పటికే తెలిసిన విషయాల్ని వాళ్లకు గుర్తుచేస్తూ ఉంటారని చెప్పాడు. అంతేకాదు వినయంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో సహోదరుడు జాక్సన్ ముఖ్యంగా వివరించారు. అందరి దృష్టిని తమ వైపో లేదా తాము పొందిన గిలియడ్ శిక్షణ వైపో మళ్లించే బదులు బైబిలు వైపు, బైబిలు ప్రచురణల వైపు ఇతరుల దృష్టిని మళ్లించాలని ఆయన వాళ్లకు గుర్తుచేశాడు. అలాచేయడం వల్ల, గిలియడ్ పాఠశాలకు హాజరయ్యే అవకాశంలేని వాళ్లను నిరుత్సాహపర్చకుండా, తాము పొందిన ఆధ్యాత్మిక పోషణను తోటి విశ్వాసుల్ని ప్రోత్సహించడానికి ఉపయోగించినవాళ్లౌతారని సహోదరుడు చెప్పాడు. దాంతో హాజరైనవాళ్లందరూ ఎంతో ప్రోత్సాహం పొంది, తమ సహోదరసహోదరీలకు సేవ చేయాలని నిర్ణయించుకుని తమ ఇళ్లకు తిరిగివెళ్లారు.