కంటెంట్‌కు వెళ్లు

ద వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 137వ తరగతి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం

ద వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 137వ తరగతి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం

2014, సెప్టెంబరు 13న న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో ఉన్న ఎడ్యుకేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్నెసస్‌లో, ద వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 137వ తరగతి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం జరిగింది. మంచి అనుభవం ఉన్న ప్రచారకులకు ఈ స్కూల్‌లో శిక్షణనిచ్చి, వాళ్లకు నియమించిన ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా సంఘాలు, బ్రాంచి కార్యాలయాలు స్థాపించేలా తయారు చేస్తారు. ఈ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాన్ని ప్యాటర్‌సన్‌కు వచ్చినవాళ్లతోపాటు, కెనడా, జమైకా, ప్యూర్టోరికో, యునైటడ్‌ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్లు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. అలా మొత్తం 12,333 మంది ఈ కార్యక్రమాన్ని ఆనందించారు.

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన సామ్యూల్‌ హెర్డ్‌ ఈ కార్యక్రమానికి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన తన ప్రారంభ మాటల్లో, మన ఆలోచనల కన్నా యెహోవా ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవనే అంశం గురించి ముఖ్యంగా చెప్పాడు. (యెషయా 55:8, 9) గిలియడ్‌ విద్యార్థులు ఐదు నెలలపాటు దేవుని ఆలోచనలతో తమ మనసుల్ని నింపుకున్నప్పటికీ, వాళ్లు నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయనీ, వాళ్లు కేవలం “ఆయన కార్యములలో స్వల్పములు” మాత్రమే తెలుసుకున్నారని హెర్డ్‌ చెప్పాడు. (యోబు 26:14) అంతేకాదు, దేవుని ఆలోచనల గురించి చర్చించుకోవడానికి కలుసుకునే ప్రతీసారి మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. ఈ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం కూడా అలాంటిదే అని ఆయన చెప్పాడు.

“ఆత్మ ఫలమేమనగా . . . దీర్ఘశాంతము.” (గలతీయులు 5:22) యునైటడ్‌ స్టేట్స్‌ బ్రాంచి కమిటీ సభ్యుడైన జాన్‌ లార్సన్‌, ఆత్మఫలంలో ఒకటైన దీర్ఘశాంతాన్ని లేదా సహనాన్ని మనం చూపించగల రెండు ముఖ్యమైన విధానాల గురించి చెప్పాడు. మొదటిగా, మనం విశ్వాసంలో బలంగా ఉండేలా యెహోవా శిక్షణ ఇచ్చి సహాయం చేస్తుండగా మనం సహనం చూపించాలి. (1 పేతురు 5:10) ఈ విషయంలో అబ్రాహాము మనకు చక్కని ఆదర్శాన్ని ఉంచాడు. యెహోవా శిక్షణనిస్తుండగా ఆయన సహనాన్ని చూపించాడు. చివరికి యెహోవా ఆయనకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు.—హెబ్రీయులు 6:15.

రెండవదిగా, ఎవరికివాళ్లం సహనంగా ఉండాలి. గిలియడ్‌ శిక్షణ పొందిన విద్యార్థులు, తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకోవచ్చు. కానీ వాళ్లు తమ నియామకాలకు వెళ్లిన వెంటనే అక్కడ పరిస్థితులు అనుకున్నట్లు లేకపోతే, ‘నేనేం తప్పు చేశాను?’ అని వాళ్లు ఆలోచించవచ్చు. కానీ అలాంటి సమయాల్లో సహనంగా ఉంటూ, దేవుడు తమకిచ్చే శిక్షణను పూర్తి చేసేవరకు కష్టపడి పనిచేస్తే వాళ్లు సవాళ్లను అధిగమించగలుగుతారని సహోదరుడు లార్సన్‌ చెప్పాడు. ఆ విషయాన్ని స్వయంగా తన అనుభవం ద్వారా తెలుసుకున్నాడని ఆయన చెప్పాడు.—హెబ్రీయులు 6:11, 12

“మీ హృదయములు వినయంగా ఉంటూ నిత్యము బ్రతుకును!” అనే అంశంతో కీర్తనలు 22:26 పై ఆధారపడిన ప్రసంగాన్ని పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు ఆంథనీ మోరిస్‌ ఇచ్చాడు. ఆ లేఖనంలోని చివరి భాగంలో “మీ హృదయములు నిత్యము బ్రతుకును” అని ఉంటుంది. అయితే ఆ దీవెనను పొందాలంటే మనం వినయంగా ఉండాలి. ఒకవేళ మనం వినయంగా లేకపోతే యెహోవా మనల్ని ఉపయోగించుకోడని సహోదరుడు మోరిస్‌ ముఖ్యంగా చెప్పాడు. మనలో ఎవరిమైనా, ఆఖరికి ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్నవాళ్లు కూడా, యేసుక్రీస్తులా ఉండడం ఎంత ముఖ్యమో మర్చిపోయే అవకాశముందని ఆయన అన్నాడు.—2 పేతురు 1:9.

వినయంగా ఉన్నవాళ్ల ఉదాహరణలు, వినయాన్ని చూపించని వాళ్ల ఉదాహరణలు లేఖనాల్లో ఉన్నాయి. హేరోదు అగ్రిప్ప ఎంతో గర్వంతో, యెహోవాకు మాత్రమే చెందవలసిన ఘనతను ప్రజలు తనకు ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించాడు. దాంతో దేవుని దూత అతన్ని మొత్తగా “పురుగులు పడి ప్రాణము విడిచెను.” (అపొస్తలుల కార్యములు 12:21-23) అందుకు భిన్నంగా, యేసు పేతురును “మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని” గద్దించినప్పుడు పేతురు అలగలేదు లేదా కోపం తెచ్చుకోలేదు. (మత్తయి 16:21-23) బదులుగా యేసు ఇచ్చిన క్రమశిక్షణను స్వీకరించి, వినయానికి మారుపేరుగా తయారయ్యాడు.—1 పేతురు 5:5

గిలియడ్‌ విద్యార్థుల్లో కొంతమందిని బెతెల్‌ సేవకు పంపిస్తారని, ఒకవేళ వినయంగా ఉండకపోతే ఆ సేవలో వాళ్లు ఆనందాన్ని పొందలేరని సహోదరుడు మోరిస్‌ హెచ్చరించాడు. కానీ మనం వినయంగా ఉన్నామో లేమో గ్రహించడం కొంచెం కష్టం కావచ్చనే విషయాన్ని చెప్పడానికి చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనను ఆయన చెప్పాడు. అదేమిటంటే, వినయంగా లేనందుకు ఓ సంఘ పెద్దకు సలహా ఇచ్చినప్పుడు ఆయన బ్రాంచి కార్యాలయానికి ఇలా రాశాడు, “నా అంత వినయంగా ఎవ్వరూ ఉండరు.” అలాంటి మనస్తత్వానికి దూరంగా ఉండమని సహోదరుడు మోరిస్‌ విద్యార్థులను ప్రోత్సహించాడు. తమకు అధికారం ఉందని పొంగిపోకుండా ఉండడం ద్వారా వాళ్లు వినయంగా ఉండవచ్చని ఆయన చెప్పాడు. బదులుగా, అంతిమ అధికారం యెహోవా దేవుడు, యేసుక్రీస్తుకే ఉందని వాళ్లు వినయంగా గుర్తించాలి.

దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మ ననుగ్రహించును.” (యోహాను 3:34) గిలియడ్‌ విద్యార్థులకు తమ నియామకాల్లో ఎదురయ్యే కష్టాల్ని లేదా సందేహాల్ని అధిగమించడానికి దేవుని పవిత్రశక్తి వాళ్లకు సహాయం చేస్తుందని గిలియడ్‌ ఉపదేశకుడైన మైఖెల్‌ బెర్నట్‌ గుర్తుచేశాడు. బెసలేలుకు, దేవుని ప్రత్యక్ష గుడారం తయారుచేసే నియామకంలో ఎదురైన సవాళ్లను అధిగమించడానికి దేవుని శక్తి అతనికి సహాయం చేసింది. (నిర్గమకాండము 35:30-35) దేవుని పవిత్రశక్తి, కళాకారునిగా బెసలేలుకు ఉన్న సహజ సామర్థ్యాల్ని మరింత పదునుచేయడమే కాకుండా ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని కూడా ఇచ్చింది. గిలియడ్‌ విద్యార్థులకు కూడా దేవుని శక్తి అలానే సహాయం చేయగలదు. ముఖ్యంగా వాళ్లు లేఖనాల నుండి బోధించడం గురించి శిక్షణలో నేర్చుకున్న పద్ధతిని పాటించినప్పుడు పవిత్రశక్తి సహాయం చేయడాన్ని వాళ్లు చూస్తారు.

బెసలేలు కాలంలో, ప్రత్యక్ష గుడారం నిర్మించే పనిలో ఇశ్రాయేలు స్త్రీలు కూడా ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. (నిర్గమకాండము 35:25, 26) అదేవిధంగా, గిలియడ్‌ శిక్షణ పొందిన సహోదరీలు కూడా తమ భర్తలకు మద్దతివ్వడం ద్వారా వాళ్లు “నైపుణ్యంగల స్త్రీలు” అని నిరూపించుకన్నారని ఆయన చెప్పాడు. చివరిగా ఈ మాటలతో సహోదరుడు బెర్నట్‌ తన ప్రసంగాన్ని ముగించాడు, “మీ సహజ సామర్థ్యాలను వినయంతో, లోబడే మనసుతో సమన్వయంగా ఉంచుకోండి. అలా చేస్తే, యెహోవా మీకు తన పవిత్రశక్తిని ఏ కొదువ లేకుండా ఇస్తాడు.”

“నాతో కలిసి నాట్యమాడతారా?” అనే అంశమున్న ప్రసంగాన్ని టీచింగ్‌ కమిటీకి సహాయకునిగా సేవ చేస్తున్న మార్క్‌ నూమర్‌ ఇచ్చాడు. ఆ ప్రసంగంలో, దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తున్న రాజైన దావీదు గురించి చెప్పాడు. (2 సమూయేలు 6:12-14) యెహోవా మందసాన్ని తీసుకొస్తుండగా, దావీదు తనను తాను ఎంతో తగ్గించుకుని “హీనస్థితి గల పనికత్తెలు” పక్కన ఎంతో ఆనందంతో నాట్యమాడాడు. (2 సమూయేలు 6:20-22) రాజు తమతో కలిసి నాట్యమాడిన రోజును ఆ పనికత్తెలు ఎప్పటికీ మర్చిపోరు. ఆ తర్వాత సహోదరుడు నూమర్‌, ‘పనికత్తెలతో’ కలిసి నాట్యమాడమని విద్యార్థుల్ని ప్రోత్సహించాడు. ఆయన వాళ్లను ఇలా అడిగాడు, “ఏ బాధ్యతలు లేనివాళ్లకు సహాయం చేస్తారనే పేరును మీరు తెచ్చుకుంటారా? . . . ఒకరి ఆధ్యాత్మిక లక్షణాలబట్టే మీరు వాళ్లకు విలువనిస్తారా?

ఈ విధంగా నిజమైన ప్రేమను చూపిస్తే విద్యార్థులు యెహోవాను అనుకరించినవాళ్లవుతారు. (కీర్తన 113:6, 7) ఒకవేళ వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరైనా వినయంగా లేకపోయినా, అది వాళ్లపై ప్రభావం చూపించనివ్వకుండా విద్యార్థులు జాగ్రత్తపడాలి. సహోదరుడు నూమర్‌ విద్యార్థులకు, “మిమ్మల్ని మీరు తక్కువవాళ్లుగా భావించండి” అని చెప్తూ “యెహోవా గొర్రెలను యెహోవా చూసినట్లు చూడండి” అని అన్నాడు.

“ప్రతీ సరైన అవకాశంలో సాక్ష్యమివ్వడం” అనే అంశమున్న ప్రసంగాన్ని దైవపరిపాలనా స్కూళ్ల డిపార్ట్‌మెంట్లను పర్యవేక్షించే సహోదరుడు విలియమ్‌ సామ్యూల్‌సన్‌ ఇచ్చాడు. ఆయన తన ప్రసంగంలో, సువార్త ప్రకటించడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్న అపొస్తలుడైన పౌలు ఉదాహరణను చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 17:17) ఆ ప్రసంగంలో, కొంతమంది విద్యార్థులు ప్యాటర్‌సన్‌లో పరిచర్య చేస్తుండగా తమకు ఎదురైన కొన్ని అనుభవాలను పునర్నటించి చూపించారు. ఉదాహరణకు, ఓ జంట మార్కెట్‌కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ఓ స్త్రీని కలిశారు. కస్టమర్లు అందరూ వెళ్లిపోయేవరకు చూసి, ఆతర్వాత ఆమెకు బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోను చూపించారు. అంతేకాదు, ఆమెకు jw.org వీడియోను చూపించి ఆమె సొంత భాష అయిన లావోషెన్‌ భాషలో సమాచారం ఎక్కడ దొరుకుతుందో చూపించారు. ఆమెను మరోసారి కూడా కలిసి మాట్లాడారు.

“రాజ్యసేవలో కొనసాగుతూ ఉండండి” అనే అంశమున్న ప్రసంగాన్ని, యునైటడ్‌ స్టేట్స్‌ బ్రాంచిలోని సర్వీసు డిపార్ట్‌మెంట్‌లో సేవ చేస్తున్న విలియమ్‌ నోన్కీస్‌ ఇచ్చాడు. ఆయన నలుగురు గిలియడ్‌ విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేశాడు. యెషయా 6:8లో చెప్తున్నట్లుగా, వాళ్లు ప్రకటనా పని చేయడానికి ఇష్టంగా ముందుకొచ్చారు. అయితే ఇకముందు కూడా ఆ సేవలో కొనసాగడానికి కావాల్సిన శిక్షణను వాళ్లు గిలియడ్‌ పాఠశాలలో పొందారు. సహోదరి స్నోల్యా మాసికో గిలియడ్‌ పాఠశాల గురించి చెప్తూ, ఆమె ఏయే విషయాల్లో ఇంకా మెరుగవ్వాలో తెలుసుకోవడానికి గిలియడ్‌ పాఠశాల సహాయం చేసిందనీ, ముఖ్యంగా రోజంగా సేవ చేసిన తర్వాత కూడా మిగిలిన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవాలో గిలియడ్‌ పాఠశాల నేర్పిందని ఆమె వివరించింది. ఆమె ఇంకా ఇలా చెప్పింది, “ఈ శిక్షణ, నా సామర్థ్యాలను నేను అనుకున్న దానికన్నా ఎక్కువ చేసింది.” సహోదరుడు డినెస్‌ నీల్సెన్‌, పరిచర్యలో ఎదురయ్యే నిరుత్సాహాలను అధిగమించడానికి జెఫన్యా 3:17లోని విషయాలు తనకెలా సహాయం చేస్తాయో నేర్చుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు, “నేను పరిచర్యకు వెళ్లి మంచి ఫలితాలు సాధించకపోయినా యెహోవా చాలా సంతోషిస్తున్నాడని నేను గుర్తుంచుకోవాలి. నేను కూడా ఆయనలానే ఉండాలి.”

“ఆకాశపక్షులను చూడుడి.” (మత్తయి 6:26) ఇది ఆ రోజు కార్యక్రమం ముఖ్య ప్రసంగం. దాన్ని పరిపాలక సభ సభ్యుడైన స్టీఫెన్‌ లెట్‌ ఇచ్చాడు. “ఆకాశపక్షులను చూడుడి” అని యేసు బోధించాడు. పక్షులను ‘చూడడం’ లేదా జాగ్రత్తగా పరిశీలించడం మనకు ఎన్నో పాఠాల్ని నేర్పిస్తుందని సహోదరుడు లెట్‌ చెప్పాడు.—యోబు 12:7.

ఉదాహరణకు, యెహోవా ఆకాశపక్షులను పోషిస్తున్నట్లే మనల్ని కూడా పోషిస్తాడు. మనం దేవుని ఇంటికి చెందినవాళ్లం, ‘తన ఇంటివారిని’ పోషిస్తానని ఆయన హామీ ఇస్తున్నాడు. (1 తిమోతి 3:15; 5:8) అయితే మన వంతు కృషి కూడా మనం చేయాలి. యెహోవా ఇచ్చే ఆహారం కోసం పక్షులు ఎలా అయితే వెతుక్కోవాలో, మనం కూడా యెహోవా ఇచ్చే దీవెనలను పొందాలంటే ‘ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి.’

అంతేకాదు, ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు చాలారకాల పక్షులు ఒక రకమైన శబ్దం చేసి ఇతర పక్షులకు సంకేతాలను పంపిస్తాయని, అదేవిధంగా మనం కూడా అవసరమైనప్పుడు ప్రమాదాల గురించి ఇతరులను హెచ్చరించాలని సహోదరుడు లెట్‌ వివరించారు. ఉదాహరణకు ఎవరైనా సహోదరుడు, ‘ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే’ మనం అతనిని హెచ్చరించాలి. (గలతీయులు 6:1) అంతేకాదు మనం ప్రకటనా పని చేయడం ద్వారా అతిసమీపంలో ఉన్న “యెహోవా మహా దినము” గురించి ప్రజల్ని హెచ్చరిస్తాం. (జెఫన్యా 1:14) సహోదరుడు లెట్‌ మరో ఉదాహరణ చెప్తూ, వలస వెళ్లే పక్షులు ఎత్తైన పర్వతాలపై ఎగురుకుంటూ గమ్యానికి చేరతాయని చెప్పాడు. అదేవిధంగా మనం కూడా ఎత్తైన పర్వతాల్లా కనిపించే కష్టాలను సహితం యెహోవా సహాయంతో అధిగమించగలమని ఆయన అన్నాడు.—మత్తయి 17:20.

ముగింపు. విద్యార్థులు తమ పట్టాలు తీసుకున్న తర్వాత, వాళ్లలో ఒకరు తరగతిలోని అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఉత్తరాన్ని చదివాడు. సహోదరుడు హెర్డ్‌ చివరిగా మాట్లాడుతూ, దేవుని ఆలోచనల్ని మన మనసు లోతుల్లోకి తీసుకోవడాన్ని, రైలు పట్టాలను కలుపుతూ స్క్రూలు బిగించే పనితో పోల్చాడు. వాటిలో ఒక్కొక్కదాన్ని సరిగ్గా అమర్చడానికి చాలాసార్లు సుత్తితో కొట్టాల్సి వస్తుంది. అదేవిధంగా గిలియడ్‌ శిక్షణ పొందిన విద్యార్థులు కూడా తాము శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉండాలి. ‘సమయం తీసుకుని వాటిని మీ మనసు లోతుల్లోకి పంపేందుకు ప్రయత్నించండి. దేవుని ఆలోచనల ప్రకారం నడుచుకుంటే మీరు ఓ దీవెనగా ఉంటారు’ అని సహోదరుడు హెర్డ్‌ అన్నాడు.