కంటెంట్‌కు వెళ్లు

ప్రకటించడానికి సముద్ర నేలమీద నడుస్తున్నారు

ప్రకటించడానికి సముద్ర నేలమీద నడుస్తున్నారు

జర్మనీలోని ష్లస్వెక్‌-హాల్‌ష్టీన్‌ అనే రాష్ట్రంలో ఉత్తర సముద్రానికి పశ్చిమ తీరంలో, కొన్ని చిన్నచిన్న ద్వీపాలు దూరదూరంగా ఉన్నాయి. ఆ ద్వీపాల సమూహాన్ని హాలిగన్‌ అని పిలుస్తారు. వాటిలో దాదాపు 300 మంది నివసిస్తున్నారు. యెహోవాసాక్షులు ప్రకటిస్తున్న సందేశం ఆ ప్రజలకు ఎలా చేరుతోంది?—మత్తయి 24:14.

యెహోవాసాక్షులు కొన్ని ద్వీపాల దగ్గరకు ఫెర్రీలో (పెద్ద పడవలో) వెళ్తారు. అయితే మిగతా ద్వీపాల్లోని ప్రజల దగ్గరికి వెళ్లడానికి కొంతమంది సాక్షులు మరో పద్ధతిని ఉపయోగిస్తున్నారు. వాళ్లు సుమారు 5 కిలోమీటర్లు సముద్రంలోని నేలమీద నడుచుకుంటూ వెళ్తారు. కానీ అదెలా సాధ్యం?

అలల సహాయంతో

అలల సహాయంతో వాళ్లు అలా చేయగలుగుతున్నారు. దాదాపు ప్రతీ ఆరు గంటలకు ఒకసారి హాలిగన్‌ ప్రాంతంలో ఉత్తర సముద్ర మట్టం అలలవల్ల సుమారు మూడు మీటర్లు పైకి లేస్తుంది లేదా కిందికి దిగుతుంది! నీటిమట్టం తగ్గినప్పుడు, సముద్రం అడుగునున్న నేల కనిపిస్తుంది, దాంతో సహోదరులు దానిమీద నడుచుకుంటూ మూడు చిన్న ద్వీపాలకు వెళ్లగలుగుతున్నారు.

ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? అలా నడవడంలో అనుభవం సాధించిన ఉల్రిచ్‌ అనే సహోదరుడు, ఆ గ్రూపును నడిపిస్తున్నాడు. అతను ఇలా అంటున్నాడు: “హాలిగన్‌లో ఒక ద్వీపానికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. మేము ఎక్కువగా బూట్లు లేకుండా నడిచేవాళ్లం. సముద్ర నేలమీద నడవడానికి అదే అత్యంత సరైన, సౌకర్యవంతమైన విధానం. చలి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం బూట్లు వేసుకుంటాం.”

సముద్ర నేలమీద నడవడం కొత్తగా అనిపిస్తుంది. ఆ సహోదరుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, “ఏదో వేరే గ్రహం మీద నడుస్తున్నట్లు అనిపిస్తుంది. సముద్ర నేలమీద కొన్నిచోట్ల బురదగా ఉంటుంది, ఇంకొన్ని చోట్ల రాళ్లు ఉంటాయి, మరికొన్ని చోట్లైతే సముద్ర గడ్డి ఎక్కువగా ఉంటుంది. సముద్ర పక్షులు, పీతలు, ఇతర జంతువులు గుంపులుగుంపులుగా కనిపిస్తాయి.” అలా నడుస్తున్నప్పుడు వాళ్లు, అప్పుడప్పుడూ తీరంలోకి చొచ్చుకొచ్చిన చిన్నచిన్న సముద్ర చీలికల్ని కూడా దాటాల్సివచ్చేది. జర్మనీ భాషలో వాటిని ప్రీలే అని పిలుస్తారు.

ఆ ప్రయాణంలో వాళ్లకు కొన్ని సవాళ్లు ఎదురయ్యేవి. ఉల్రిచ్‌ ఇలా చెప్తున్నాడు, “ఈజీగా దారితప్పిపోతాం, ముఖ్యంగా సముద్రం మీద ఏర్పడే పొగమంచులో ఇట్టే తప్పిపోతాం. అందుకే మేము దిక్సూచిని, దారి చూపించే GPS పరికరాన్ని ఉపయోగిస్తాం. అంతేకాదు, పైకి వచ్చే అల బారిన పడకుండా ఉండేందుకు సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాం.”

హాలిగన్‌లోని ఒక ద్వీపంలో ప్రకటిస్తున్న దృశ్యం

మరి వాళ్లు పడుతున్న కష్టానికి ఫలితం ఉంటుందా? 90 ఏళ్లు దాటిన ఒకాయన గురించి ఉల్రిచ్‌ చెప్తున్నాడు. ఆయన కావలికోట, తేజరిల్లు! పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాడు. ఉల్రిచ్‌ ఇలా చెప్తున్నాడు, “ఒకరోజు మాకు సమయం లేక ఆయన దగ్గరికి వెళ్లలేకపోయాం. అయితే మేము అక్కడి నుండి బయల్దేరుతుండగా, ఆయన సైకిల్‌ తొక్కుకుంటూ మా దగ్గరికి వచ్చి, ‘ఇవాళ నాకు కావలికోట ఇవ్వడంలేదా?’ అని అడిగాడు. మేము సంతోషంగా ఆయనకు దాన్ని ఇచ్చాం.”