ఉత్తరదిశలోని మారుమూల ప్రాంతాలకు బైబిలు సందేశం
యూరప్, నార్త్ అమెరికాలలో ఉత్తరదిశలో ఉన్న మారుమూల ప్రాంతాలకు బైబిలు సందేశాన్ని చేరవేసేందుకు రూపొందించిన ఓ కొత్త కార్యక్రమం గురించి 2014లో యెహోవాసాక్షుల పరిపాలక సభ కొన్ని సూచనల్ని ఇచ్చింది. (అపొస్తలుల కార్యములు 1:8) మొదట్లో ఈ కార్యక్రమాన్ని అలాస్కా (అమెరికా), లాప్‌లాండ్ (ఫిన్‌లాండ్), నూనావూట్, నార్త్‌వెస్ట్ ప్రాంతాలకు (కెనడా) మాత్రమే పరిమితం చేశారు.
కొన్ని దశాబ్దాలుగా యెహోవాసాక్షులు ఈ మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రకటిస్తున్నారు. కానీ వాళ్లు అక్కడ కొంత సమయమే ఉండేవాళ్లు, కేవలం ప్రచురణల్ని ఇచ్చి వచ్చేసేవాళ్లు.
అయితే ఈ కొత్త కార్యక్రమంలో, ఉత్తర దిశలోని మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న యెహోవాసాక్షుల పనుల్ని పర్యవేక్షించే బ్రాంచి కార్యాలయాలు, పూర్తికాల సేవకుల్ని (పయినీర్లు) తాము నియమించిన ప్రాంతాల్లో కనీసం మూడు నెలలపాటు ఉండే ఏర్పాటు చేశాయి. ఒకవేళ ఆ ప్రాంతాల్లో ఎక్కువమంది బైబిలు స్టడీ తీసుకోవడానికి ఇష్టపడితే, ఆ పూర్తికాల సేవకులు ఇంకొన్ని రోజులు అక్కడే ఉండి కూటాలను జరుపవచ్చు.
నిజమే, ఉత్తర ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన సవాళ్లు ఎదురౌతాయి. అలాస్కాలోని బార్రో అనే ప్రాంతంలో ఇద్దరు పయినీర్లను నియమించారు. వాళ్లలో ఒకరు గతంలో దక్షిణ కాలిఫోర్నియాలో, మరొకరు అమెరికాలోని జార్జీయాలో ఉండేవాళ్లు. వాళ్లు బార్రోకి వచ్చిన మొదటి చలికాలంలో అక్కడి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కి (-36°F) పడిపోయేవి. ఏదేమైనా వాళ్లు అక్కడికి వెళ్లిన కొన్ని నెలలకే ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో 95 శాతం వరకు సాక్ష్యం ఇచ్చారు. నాలుగు బైబిలు అధ్యయనాలను కూడా మొదలుపెట్టారు, వాళ్లలో జాన్ అనే ఒక యువకుడు కూడా ఉన్నాడు. ఆయన డేటింగ్ చేస్తున్న అమ్మాయితో కలిసి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం ద్వారా స్టడీ తీసుకునేవాడు. ఆయన నేర్చుకున్న విషయాల్ని తన స్నేహితులతో, తోటిపనివాళ్లతో పంచుకునేవాడు కూడా. అంతేకాదు, ఆయన తన ఫోన్‌లోJW లైబ్రరీ యాప్ ఉపయోగించి ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాంలో ఉన్న దినవచనాన్ని క్రమంగా చదివేవాడు.
నూనావూట్‌లోని కెనడా ప్రాంతమైన రాంకిన్ ఇన్‌లెట్‌కు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోవడంతో ఆ ఇద్దరు పయినీర్లు ఆ చిన్న పల్లెటూరికి విమానంలో వెళ్లి ఎన్నో బైబిలు అధ్యయనాలు నిర్వహించారు. అక్కడ ఓ వ్యక్తి రాజ్యమందిరం అంటే ఏమిటి? అనే వీడియో చూశాక, తన ప్రాంతంలో రాజ్యమందిరాన్ని ఎప్పుడు కడుతున్నారని అడిగాడు. ఆయనింకా ఇలా అన్నాడు, “ఒకవేళ మీరు దాన్ని కట్టే సమయానికి నేను ఇక్కడే ఉంటే, మీ కూటాలకు వస్తాను.”
మనుషుల సంఖ్యతో పోలిస్తే జింకల సంఖ్య పది రెట్లు ఎక్కువ ఉన్న ఫిన్‌లాండ్‌లోని సావుకోస్కీ ప్రాంతానికి పయినీర్లుగా వెళ్లినవాళ్లు, “ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి, పైగా మంచు కూడా చాలా ఎక్కువ ఉంటుంది” అని చెప్పారు. కానీ వాళ్లు అక్కడికి సరైన సమయంలో వెళ్లారని ఆ పయినీర్లు చెప్పారు. వాళ్లు ఎందుకు అలా అన్నారు? వాళ్లిలా చెప్పారు, “మేము ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా సువార్త ప్రకటించగలిగాం. పల్లెటూర్లకు వెళ్లే రోడ్లను దున్ని నడవడానికి వీలుగా చేశారు. పైగా ఎక్కువ చల్లగా ఉండడంతో ప్రజలందరూ ఎక్కువసేపు ఇళ్లలోనే ఉండేవాళ్లు.”
ఉత్తరదిశలో ఉన్న మారుమూల ప్రాంతాలకు బైబిలు సందేశాన్ని చేరవేసేందుకు మేము చేసిన కృషిని కొందరు గుర్తించారు. అలాస్కాలోని ఓ పట్టణ మేయర్‌ను ఇద్దరు పయినీర్లు కలిశారు. అప్పుడు ఆ మేయర్ ఓ సోషల్ మీడియాలో, సాక్షులు తనకు ఇచ్చిన దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే కరపత్రాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు ఆమెకూ సాక్షులకూ మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా మంచిగా రాసింది.
అలాస్కాలోని హాన్జ్‌లో సేవ చేస్తున్న ఇద్దరు పయినీర్లు ఓ పబ్లిక్ లైబ్రరీలో కూటాలను నిర్వహించారు. దానికి దాదాపుగా ఎనిమిది మంది హాజరయ్యారు. ఓ స్థానిక వార్తాపత్రిక ఆ పయినీర్లు గురించి రాస్తూ నగరానికి టెక్సాస్, ఉత్తర కరోలీన నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇళ్లకు వెళ్లి ఒక్కొక్కరికి బైబిలు గురించి నేర్పిస్తున్నారని పేర్కొంది. ఆ వార్తాపత్రిక ఈ మాటలతో ప్రకటనను ముగించింది, “ఎక్కువ నేర్చుకోవడానికి jw.orgని సందర్శించండి.”