కంటెంట్‌కు వెళ్లు

JW.ORG ప్రపంచవ్యాప్త ప్రచారకార్యక్రమం

JW.ORG ప్రపంచవ్యాప్త ప్రచారకార్యక్రమం

2014, ఆగస్టు నెలలో, jw.org వెబ్‌సైట్‌ను ప్రజలందరికీ సుపరిచితం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఓ కరపత్రాన్ని పంచిపెట్టారు. ఫలితంగా, ఆ వెబ్‌సైట్‌ను చూసేవాళ్ల సంఖ్య ఆనెల 20 శాతానికి పెరిగింది, అంటే 6కోట్ల 50లక్షల ప్రజలు ఆ వెబ్‌సైట్‌ను చూశారు. ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఆ సైట్‌ ద్వారా బైబిలు స్టడీ కావాలని అడిగారు. ఇది దాని ముందునెల కన్నా 67 శాతం ఎక్కువ. ఈ ప్రచార కార్యక్రమం ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలందరికీ సహాయపడింది.

జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు సహాయం

కెనడాలోని ఓ యెహోవాసాక్షి మడలెన్‌ అనే ఆవిడని లిఫ్ట్‌లో కలిసింది. ఆమెకు జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రాన్ని చూపించింది. అప్పుడు మడలెన్‌ మన సహోదరితో, తాను పోయినరోజు రాత్రి బాల్కనీలో నిలబడి తన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి సహాయం చేయమని దేవునికి తీవ్రంగా ప్రార్థించానని చెప్పింది. గతంలో ఆమె, తనకు బైబిలు స్టడీ చేయమని చాలా చర్చీలవాళ్లను అడిగింది కానీ ఎవ్వరూ ఆమెను కలవలేదు. కొంతకాలానికి ఆమె సాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం ప్రారంభించింది.

బైబిలుతో పరిచయంలేని వాళ్లకు సహాయం

ఫిలిప్పీన్స్‌లో రొయీన అనే సహోదరి, ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ ముందు ఒక చైనీస్‌ వ్యక్తిని కలిసింది. ఆమె అతనికి ఓ కరపత్రాన్ని ఇచ్చి, బైబిలు గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకునే వాళ్లకు సాక్షులు ఉచితంగా బైబిలు గురించి నేర్పిస్తారని చెప్పింది.

అందుకు ఆ వ్యక్తి, అసలు తాను ఇప్పటి వరకు బైబిలు ఎలా ఉంటుందో కూడా చూడలేదని చెప్పాడు. ఏదేమైనా వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆయనను యెహోవాసాక్షుల సమావేశానికి హాజరయ్యేలా చేసింది. దానితర్వాత, ఆయనకు బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి కలగడంతో దాన్ని మన వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.

చెవిటివాళ్లకు సహాయం

స్పెయిన్‌లో ఉంటున్న గీయర్‌మో అనే వ్యక్తి ఓ యెహోవాసాక్షి, ఆయనకు వినికిడి లోపం ఉంది. ఆయన తన చిన్ననాటి స్నేహితుడైన హొర్‌హా అనే వ్యక్తిని కలిశాడు, ఆయనకు కూడా వినికిడి లోపం ఉంది. హోర్‌హా గీయర్‌మోతో, వాళ్ల అమ్మ చనిపోయి కొద్దిరోజులే అవుతోందని, తనకు చాలా సందేహాలు ఉన్నాయని వాటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాడని చెప్పాడు. గీయర్‌మో ఆయనకు ప్రచార కార్యక్రమంలో ఉపయోగిస్తున్న కరపత్రాన్ని ఇచ్చి, jw.org వెబ్‌సైట్‌లో సంజ్ఞా భాషలో చాలా సమాచారం ఉందనీ, తన ప్రశ్నల్లో చాలావాటికి జవాబులు ఆ వెబ్‌సైట్‌లో దొరుకుతాయని చెప్పాడు. రాజ్యమందిరంలో జరిగే కూటానికి రమ్మని కూడా గీయర్‌మో ఆయనను పిలిచాడు. ఆయన రాజ్యమందిరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నప్పటికీ కూటానికి హాజరయ్యాడు. అంతేకాదు అప్పటినుండి ఇప్పటివరకు ఆయన ఒక్క మీటింగ్‌ కూడా మానలేదు.

మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు సహాయం

గ్రీన్‌లాండ్‌లో ఉంటున్న సాక్షులైన రెండు జంటలు తక్కువ ఖర్చుతో 280 మంది ఉంటున్న ఓ ప్రాంతానికి ఒక చిన్న పడవలో ఆరు గంటలపాటు ప్రయాణించి వెళ్లారు. అక్కడ వాళ్లు ప్రకటించారు, కరపత్రాలు పంచిపెట్టారు, గ్రీన్‌లాండిక్‌ భాషలో jw.org గురించి ఉన్న వీడియోను చూపించారు. వాళ్లు ఓ జంటతో బైబిలు స్టడీ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్లు వారానికి రెండుసార్లు ఫోన్‌ ద్వారా స్టడీ చేస్తున్నారు.

ఉత్తరాన ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి పని జరుగుతుంది. నికరాగ్వాలో ఉంటున్న సాక్షులు, కెరీబియన్‌ అడవిలోని మయాంగ్నా భాషా మాట్లాడే ప్రజలకు ఈ కరపత్రాన్ని పంచిపెట్టే ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతానికి చేరుకోవడం కోసం వాళ్లు దాదాపు 20 గంటలపాటు ఓ పాత బస్సులో గతుకులు గతుకులుగా ఉన్న రోడ్డుపై ప్రయాణించారు. ఆ తర్వాత 11 గంటలపాటు నడిచి ఆ పల్లెలకు చేరుకున్నారు. కొన్నిచోట్లయితే వాళ్లు బురద రోడ్లపై కూడా నడవాల్సివచ్చింది. అక్కడికి చేరుకున్నాక వాళ్లు కరపత్రాలను పంచిపెట్టి మయాంగ్నా భాషలో ఉన్న వీడియోలను చూపించారు. అవి చూసి అక్కడి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.

బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవి గుండా ఓ చిన్న పట్టణానికి వెళుతున్న ఒకాయనకు ఎస్టెలా ఈ కరపత్రాన్ని ఇచ్చింది. ఆయన అంతగా ఆసక్తి చూపించకపోయినా ఆ కరపత్రాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు. ఆయన తిరిగి పడవలో ఇంటికి వెళ్తున్నప్పుడు, ఇంజిన్‌ పాడైపోవడంతో ఆ పడవ నదిలో ఆగిపోయింది. ఎవరో ఒకరు వచ్చి సహాయం చేసేవరకు ఆయన ఆ కరపత్రాన్ని చదివాడు. తన ఫోన్‌లో jw.org వెబ్‌సైట్‌ తెరచి చాలా ఆర్టికల్స్‌ చదివి కొన్ని వీడియోలను కూడా డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత ఆయన ఎస్టెలా భర్తను కలిశాడు, ఆ కరపత్రాన్ని ఇచ్చినందుకు ఎస్టెలాకు థాంక్స్‌ చెప్పమన్నాడు. ఆయనిలా చెప్పాడు, “నేను నదిలో ఉన్నప్పుడు చదివిన ఆర్టికల్స్‌ వేరేవాళ్లు వచ్చి నాకు సహాయం చేసేవరకు కంగారు పడకుండా ఉండడానికి సహాయం చేశాయి. మా పిల్లలకు కేలబ్‌ వీడియోలు చాలా నచ్చాయి. నేను ఇక ముందు కూడా jw.orgను చూస్తూ ఉంటాను.”