కంటెంట్‌కు వెళ్లు

ఎస్టోనియావాళ్లు గుర్తించిన “ఓ గొప్ప పని”

ఎస్టోనియావాళ్లు గుర్తించిన “ఓ గొప్ప పని”

ఎస్టోనియా భాషలోని ద న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ బైబిలు, ఎస్టోనియాలో 2014 సంవత్సరానికిగాను లాంగ్వేజ్‌ డీడ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు నామినేట్‌ అయింది. నామినేట్‌ అయిన 18 పుస్తకాల్లో దానికి 3వ స్థానం దక్కింది!

ఎస్టోనియా భాష ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భాషా శాస్త్రవేత్త క్రిస్టీన రోస్‌, 2014 ఆగస్టు 8న విడుదలైన ఈ కొత్త బైబిలు అనువాదాన్ని అవార్డుకు నామినేట్‌ చేశారు. ఆమె న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ గురించి ఇలా చెప్పారు: “ఇది చదవడానికి సులువుగా ఉంది, చదవాలనిపిస్తోంది. దాన్ని అనువదించడంలో చేసిన కృషి, ఎస్టోనియా అనువాద రంగానికి విశేషమైన పేరు తీసుకొచ్చింది.” ఎస్టోనియా సాహిత్యం, నాగరికతలలో ప్రొఫెసర్‌ అయిన రేన్‌ వేడమేన్‌ న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ అనువాదాన్ని “ఓ గొప్ప పని” అన్నారు.

ఎస్టోనియా భాషలో పూర్తి బైబిలు మొదటిసారిగా 1739లో ప్రచురితమైంది, అప్పటినుండి వేరే అనువాదాలు కూడా వచ్చాయి. మరి, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ అనువాదాన్ని “ఓ గొప్ప పని” అని ఎందుకన్నారు?

ఖచ్చితత్వం. 1988లో ప్రచురితమైన ఒక ప్రసిద్ధ ఎస్టోనియా బైబిలు, దేవుని పేరును హెబ్రీ లేఖనాల్లో (పాత నిబంధనలో) 6,800 కంటే ఎక్కువ సార్లు “యెహూవా” (యెహోవా) అని అనువదించడం మెచ్చుకోవాల్సిన విషయం. a ఎస్టోనియా భాష న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ కూడా ఆ పని చేసింది, అంతేకాదు ఇంకో అడుగు ముందుకు వెళ్లింది. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో (కొత్త నిబంధనలో) కూడా, సరైన ఆధారమున్న ప్రతీచోట దేవుని పేరును పెట్టింది.

స్పష్టత. ఒక అనువాదంలో ఖచ్చితత్వం ఉంటూ, అది చదవడానికి కూడా వీలుగా ఉండడమంటే పెద్ద సవాలే, మరి న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆ సవాలులో గెలిచిందా? గౌరవనీయులైన బైబిలు అనువాదకులు తోమాస్‌ పాల్‌, ఎస్టి కిరిక్‌ (ఎస్టోనియా చర్చి) అనే వార్తాపత్రికలో న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ గురించి ప్రస్తావిస్తూ “అనర్గళంగా చదవగలిగే ఎస్టోనియా భాషలోకి అనువదించడమనే లక్ష్యాన్ని ఇది సాధించింది” అని రాశారు. “ఈ లక్ష్యాన్ని సాధించడం ఇదే మొదటిసారి అని నేను ఖచ్చితంగా చెప్పగలను” అని కూడా ఆయన పేర్కొన్నారు.

ఎస్టోనియా భాషలోకి అనువాదమైన బైబిలు వల్ల ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌కు ఎస్టోనియావాళ్ల నుండి విశేష స్పందన లభించింది. ఒక జాతీయ రేడియో స్టేషన్‌, ఈ కొత్త బైబిలు కోసం 40 నిమిషాలు కేటాయించి ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. మతనాయకులు, చర్చికి వెళ్లేవాళ్లు కూడా ఈ బైబిళ్ల కోసం యెహోవాసాక్షులను సంప్రదిస్తున్నారు. టాలిన్‌లోని ఒక పేరుపొందిన స్కూల్‌వాళ్లు, ఒక క్లాసులో ఉపయోగించడానికి 20 న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిళ్లు అడిగారు. ఎస్టోనియావాళ్లు పుస్తక ప్రేమికులు, అలాంటి వాళ్లకు ప్రపంచంలోనే అత్యుత్తమ పుస్తకాన్ని సరిగ్గా, స్పష్టంగా అనువదించి ఇచ్చినందుకు యెహోవాసాక్షులు ఎంతో ఆనందిస్తున్నారు.

a టార్టూ యూనివర్సిటీలో కొత్త నిబంధన అధ్యయనాల ప్రొఫెసర్‌ అయిన ఐన్‌ రీస్టన్‌, ఎస్టోనియావాళ్లు దేవుని పేరును “యెహూవా” అని పిలవడం ఎలా ప్రారంభమైందో వివరించారు, ఆ తర్వాత ఆయన ఇలా చెప్పి ముగించారు: “నేడు యెహూవా అనే పదం సరైనదని నాకు అనిపిస్తోంది. దాని మూలం ఏదైనా సరే, … ఎన్నో తరాల వాళ్లకు అది చాలా ప్రాముఖ్యమైన, ఎంతో అర్థవంతమైన పేరు. మానవజాతిని విడిపించడానికి తన కొడుకును పంపించిన దేవుని పేరే యెహూవా.”