కంటెంట్‌కు వెళ్లు

వందలాది స్వరాలతో రూపొందించిన ఉచిత ఆడియో బైబిలు

వందలాది స్వరాలతో రూపొందించిన ఉచిత ఆడియో బైబిలు

“అద్భుతంగా ఉంది, ఆలోచింపచేస్తోంది, ఆహ్లాదాన్నిస్తోంది.”

“బైబిల్లోని సంఘటనలను మన కళ్లకు కట్టినట్లు చెప్తోంది.”

“మనసును కట్టిపడేస్తోంది! జీవితంలో నేను ఇప్పటివరకు విన్నవన్నీ ఒక ఎత్తైతే, ఇది ఒక ఎత్తు.”

ఆ మాటలు, మత్తయి పుస్తకం ఆడియో రికార్డింగ్‌ విన్నవాళ్లు చెప్పినవి. ఇది jw.orgలో, ఇంగ్లీషులో ఉంది.

యెహోవాసాక్షులు, బైబిలును ఆడియో రూపంలో మొదటిసారిగా 1978లో తయారుచేశారు. కొంతకాలానికి, పూర్తి బైబిలును లేదా బైబిల్లోని కొంతభాగాన్ని (అప్పటి బైబిలు వర్షన్‌ను) 20 భాషల్లో ఆడియో రూపంలో ప్రచురించారు.

2013లో, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ కొత్త సంచికను విడుదల చేయడంతో, రికార్డింగ్‌లను కూడా సవరించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, పాత ఆడియో రికార్డింగ్‌లో కేవలం ముగ్గురి స్వరాలే ఉన్నాయి. కానీ ఈ కొత్త రికార్డింగ్‌లో మాత్రం, బైబిల్లోని ఒక్కో వ్యక్తికీ ఒక్కొక్కరి స్వరం చొప్పున, దాదాపు 1000 కంటే ఎక్కువమంది స్వరాలు ఉంటాయి.

వేర్వేరు వ్యక్తులు చదవడం వల్ల, వినేవాళ్లు బైబిల్లోని సంఘటనలను తమ కళ్లముందు జరుగుతున్నట్లు ఊహించుకోగలుగుతారు. నాటక రూపంలో సాగే బైబిలు పఠనంలోనైతే సౌండ్‌ ఎఫెక్ట్స్‌, సంగీతం ఉంటాయి. ఈ రికార్డింగ్‌లను అలా రూపొందించకపోయినా, ఇవి సంఘటనలకు సాధ్యమైనంత వాస్తవరూపాన్ని ఇస్తాయి.

ఎక్కువమంది చేత చదివించే రికార్డింగ్‌ ప్రాజెక్ట్‌ చేయడానికి చాలా ప్లానింగ్‌ అవసరం. ముందుగా పరిశోధకులు, బైబిల్లోని ప్రతీ భాగాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆ భాగానికి అర్థం ఏమిటో, అందులో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరో, వాళ్ల భావోద్వేగాలు ఏమిటో గుర్తించాలి. ఉదాహరణకు, ఒక బైబిలు భాగంలో ఒక అపొస్తలుడు మాట్లాడుతున్నట్లు ఉంది, కానీ ఏ అపొస్తలుడు మాట్లాడుతున్నాడో అందులో లేదు, అప్పుడు ఎవరి స్వరాన్ని పెట్టాలి? ఒకవేవ అతను ఒక సందేహం అడుగుతుంటే, తోమా స్వరాన్ని పెట్టవచ్చు. దూకుడుగా మాట్లాడుతుంటే, పేతురు స్వరాన్ని పెట్టవచ్చు.

మాట్లాడుతున్న వ్యక్తి వయసు గురించి కూడా ఆలోచిస్తారు. యుక్తవయసులో ఉన్న అపొస్తలుడైన యోహాను కోసం ఒక యువకుని స్వరం కావాలి. అదే వృద్ధుడైన యోహాను కోసమైతే, ఒక వృద్ధుని స్వరం కావాలి.

అంతేకాదు, బాగా చదివేవాళ్లను వెదికి పట్టుకోవాలి. అందులో చాలామందిని అమెరికాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో నుండే తీసుకున్నారు. ఆడిషన్స్‌ నిర్వహించి, చదివేవాళ్లకు అవేక్‌! పత్రికలోని ఒక పేరాను ఇచ్చి, ప్రిపేరై చదవమన్నారు. వాళ్లు కోపం, విచారం, సంతోషం, నిరుత్సాహం వంటి భావోద్వేగాలున్న బైబిలు సంభాషణల్ని కూడా చదవాలి. ఈ ఆడిషన్స్‌ వల్ల చదివేవాళ్ల సామర్థ్యాల గురించి తెలుసుకోవడం వీలైంది, వాళ్లు ఎలాంటి రీడింగ్‌కి సరిపోతారో నిర్ణయించడం సాధ్యమైంది.

సెలక్షన్స్‌అయిపోయిన తర్వాత, చదివేవాళ్లు బ్రూక్లిన్‌లోని ప్యాటర్‌సన్‌ లేదా వాల్‌కిల్‌లో ఉన్న రికార్డింగ్‌ స్టూడియోకు వస్తారు. వాళ్లు చదివిన భాగాల్ని అక్కడ రికార్డింగ్‌ చేస్తారు. వాళ్లు సరైన భావోద్వేగంతో, చక్కని స్వరంతో చదివేలా చూసుకోవడానికి కోచ్‌ ఉంటారు. చదివేటప్పుడు ఎక్కడ ఆగాలి, ఎక్కడ నొక్కిచదవాలి వంటి నిర్దేశాలతో ప్రతీ భాగానికి ప్రత్యేకంగా స్క్రిప్టు తయారుచేసుకుంటారు. అది కోచ్‌ దగ్గర, చదివే వ్యక్తి దగ్గర ఉంటుంది. పాత న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రికార్డింగ్‌లను కూడా కోచ్‌ దగ్గరపెట్టుకుంటారు.

రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు స్టూడియోలో కొంత ఎడిటింగ్‌ కూడా చేస్తారు. రికార్డింగ్‌ బాగా రావడానికి ఒక్కోసారి చాలా టేకులు తీసుకుంటారు, ఆ టేకుల్లో నుండి మంచిగా వచ్చిన పదాల, వాక్యాల ముక్కలన్నీ కలిపి ఎడిటర్‌లు సరైన వాక్యాన్ని తయారుచేస్తారు.

2013లో విడుదలైన కొత్త న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ను పూర్తిగా రికార్డు చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అయినా బైబిల్లోని ఒక్కో పుస్తకాన్ని, రికార్డింగ్‌ పూర్తవగానే jw.orgలో పెడతారు. ఆడియో రికార్డింగ్‌ అందుబాటులో ఉన్న పుస్తకానికి “Books of the Bible” అనే పేజీలో, పేరు పక్కన ఆడియో ఐకాన్‌ ఉంటుంది.