కంటెంట్‌కు వెళ్లు

సమాచారాన్ని ఆకర్షణీయంగా చేసే చిత్రాలు

సమాచారాన్ని ఆకర్షణీయంగా చేసే చిత్రాలు

మన ప్రచురణలు ఆకర్షణీయంగా ఉండే విధంగా, సమాచారానికి సరిపోయేటట్లుగా ఉండే చిత్రాలను మా ఫోటోగ్రాఫర్లు ఎలా తీస్తారు? అది తెలుసుకోవడానికి సెప్టెంబరు 2015 తేజరిల్లు! పత్రిక కవరుపేజీని ఎలా డిజైన్‌ చేసి, ఫోటో తీశారో పరిశీలించండి. a

  • డిజైన్‌ చేయడం. న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌ వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉంటుంది. ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే డిజైనర్లు ముందుగా, “జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?” అనే ఆర్టికల్‌ చదివి, తర్వాత దానిలో ఉన్న సమాచారాన్ని వివరించే చిత్రాలను గీశారు. ఆ తర్వాత వాటిని పరిపాలక సభలోని రైటింగ్‌ కమిటీకి ఇచ్చారు. ఆ కమిటీ, వాటిలో నుండి ఒకదాన్ని ఫోటో తీయడానికి ఎంపిక చేసింది.

    రైటింగ్‌ కమిటీ పరిశీలించిన కొన్ని కవరుపేజీ డిజైన్‌లు

  • ప్రదేశం. నిజమైన బ్యాంక్‌కి వెళ్లి ఫోటోలు తీసేబదులు, ఫోటోగ్రఫీ టీమ్‌వాళ్లు వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో ఉన్న ఎంట్రెన్స్‌ హాళ్లలో ఒకదాన్ని బ్యాంక్‌లా తయారుచేసి ఉపయోగించుకున్నారు. b

  • ఫోటోల్లో ఉండేవాళ్లను ఎంపిక చేసుకోవడం. ఆ చిత్రంలో, కాస్మోపాలిటన్‌ నగరంలోని ఒక బ్యాంక్‌ కస్టమర్లులా కనిపించే వాళ్లందరూ యెహోవాసాక్షులే. వాళ్లనే మోడల్స్‌గా తీసుకుంటారు. అయితే, ఇలా ఫోటో కోసం ఒక్కసారి ఉపయోగించుకున్నవాళ్లనే మళ్లీమళ్లీ ఉపయోగించకుండా ఒక రికార్డును ఉంచుకుంటారు.

  • వాడిన వస్తువులు. ఆ ఫోటోలో కనిపించే బ్యాంక్‌ అమెరికాలోది కాదని చూపించడానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు విదేశీ కరెన్సీని ఉపయోగించారు. సాధ్యమైనంత వరకు చిత్రంలో కనిపిస్తున్నదంతా నిజమైనదని అనిపించే విధంగా ఫోటోగ్రఫీ టీమ్‌వాళ్లు తగిన వస్తువుల్ని ఉపయోగించారు. “ఏదీ ప్రణాళిక లేకుండా అయిపోతుందిలే అన్నట్లుగా చేయలేదు” అని క్రేగ్‌ అనే ఫోటోగ్రాఫర్‌ చెప్తున్నాడు.

  • బట్టలు, మేకప్‌. ఈ చిత్రానికి సరిపోయే బట్టలను ఎవరికివాళ్లే తెచ్చుకున్నారు. కానీ, చారిత్రక చిత్రాలకు లేదా సన్నివేశాలకు ప్రత్యేక యూనిఫారమ్‌లు అవసరమౌతాయి. అలాంటివాటికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు పరిశోధన చేసి దానికి సరిపోయే బట్టలను తయారుచేస్తారు. ఆ చిత్రంలో ఉన్న కాలానికి, సందర్భానికి, సెట్టింగ్‌కి సరిపోయే విధంగా మేకప్‌ చేసేవాళ్లు మేకప్‌ చేస్తారు. “ఇప్పుడున్న చిత్రాల్లో, డిస్‌ప్లేల్లో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు చేసినా చిత్రమంతా పాడైపోతుంది” అని క్రేగ్‌ చెప్తున్నాడు.

  • ఫోటోలు తీయడం. బ్యాంక్‌ సీన్‌ ఫోటో తీస్తున్నప్పుడు, అది పగలు జరిగిన సంఘటన అనిపించేలా లైటింగ్‌ను ఉపయోగించారు. ఫోటో తీసే ప్రతీసారి, లైటింగ్‌ సరిగ్గా ఉందోలేదో (అంటే ఆ లైటింగ్‌ ఎండలో ఉన్నట్టు ఉందా, వెన్నెల్లో ఉన్నట్టు ఉందా లేదా పెట్టిన లైటింగ్‌లా ఉందా అనేది) ఫోటోగ్రాఫర్‌లు చూసుకోవాలి. ఆ సమయంలో సీన్‌లో ఉన్న లైటింగ్‌కీ వాతావరణానికీ సరిపోయేలా ఉందోలేదో చూసుకోవాలి. “వీడియోలా కాకుండా, అక్కడున్న వాతావరణాన్ని కేవలం ఒక్క చిత్రంలో చూపించాలి కాబట్టి లైటింగ్‌ చాలా ప్రాముఖ్యం” అని క్రేగ్‌ అంటున్నాడు.

  • ఎడిటింగ్‌. ఆ తర్వాత మన దృష్టి చిత్రంలోని కరెన్సీ మీదకు కాకుండా, ఆ చిత్రంలో ఉన్న ప్రజల మీదకు వెళ్లాలని ఫోటోను ఎడిట్‌ చేసేవాళ్లు చిత్రంలో ఉన్న కరెన్సీ అంత స్పష్టంగా కనిపించకుండా చేశారు. ఫోటో కోసం ఉపయోగించుకున్న హాలులోని కిటికీలు, తలుపుల ఫ్రేమ్‌లు నిజానికి ఎర్ర రంగులో ఉన్నాయి. కానీ ఎడిటర్లు వాటిని పచ్చ రంగులోకి మార్చి, పత్రిక అంతటి కలర్‌ స్కీమ్‌కు సరిపోయేలా చేశారు.

ఒక్క ప్యాటర్‌సన్‌లోనే కాకుండా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, జర్మనీ, జపాన్‌, కొరియా, మలావీ, మెక్సికో, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో ఉన్న బ్రాంచి కార్యాలయాల్లో కూడా ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. వాళ్లు కూడా మన ప్రచురణల కోసం చిత్రాలను పంపిస్తారు. ప్రతీ నెల, ప్యాటర్‌సన్‌లోని ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రచురణల్లోని సమాచారానికి సరిపోయే 2,500 ఫోటోలను తీస్తుంది. వాటిల్లో చాలా చిత్రాల్ని కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో ముద్రిస్తారు. 2015లో ఆ పత్రికలు 11 కోట్ల, 50 లక్షలకు పైగా పంచిపెట్టబడ్డాయి. దీని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో ఉన్న బ్రాంచి కార్యాలయానికి లేదా వేరే ఏ బ్రాంచి కార్యాలయానికైనా రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

ప్రకటనాపనిలో పత్రికను ఇస్తున్నారు

a ఒక సంచికలోని కవరు పేజీ కోసం అవసరమైన వాటికన్నా ఎక్కువ ఫోటోలనే తీస్తారు. అయితే వాటిలో చాలావాటిని ఇమేజ్‌ లైబ్రరీలో ఉంచి అవసరమైనప్పుడు వేరే ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు.

b ఒకవేళ ఏదైనా నగరంలోని వీధుల్లో ఫోటోలు తీయాలనుకుంటే, ఆ ఫోటోలో ఎంతమంది ఉంటారు, ఎన్ని పరికరాలు అవసరమౌతాయి, ఎలాంటి లైటింగ్‌ ఉపయోగిస్తారు వంటి వివరాలను ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఆ నగర అధికారులకు చెప్పి అనుమతి తీసుకోవాలి.