కంటెంట్‌కు వెళ్లు

వందల భాషల్లో వస్తున్న వీడియోలు

వందల భాషల్లో వస్తున్న వీడియోలు

యెహోవాసాక్షులు తమ అనువాద పనికి బాగా పేరు పొందారు. 2014, నవంబరు నెలకల్లా మేము బైబిల్ని 125 భాషల్లోకి, బైబిలు ఆధారిత ప్రచురణల్ని 742 భాషల్లోకి అనువదించాము. మేము వీడియోలను కూడా అనువదిస్తాము. 2015, జనవరి నెలలో చూస్తే రాజ్యమందిరం అంటే ఏమిటి? అనే వీడియోను 398 భాషల్లోకి, బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోను 569 భాషల్లోకి అనువదించాం. అసలు ఈ పని ఎందుకు, ఎలా చేస్తాం?

2014, మార్చి నెలలో యెహోవాసాక్షుల పరిపాలక సభ, బైబిలు చదవడాన్ని ప్రోత్సహించే వీడియోలను వీలైనన్ని ఎక్కువ భాషల్లో సిద్ధం చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచి కార్యాలయాలన్నిటిని కోరింది.

ఒక వీడియోని ఎలా అనువదిస్తామంటే, మొదట స్థానిక అనువాద బృందం స్క్రిప్టును అనువదిస్తుంది. ఆ తర్వాత, వీడియోను ఏ భాషలోకైతే అనువదిస్తున్నామో ఆ భాష మాట్లాడే వ్యక్తుల్ని కొంతమందిని ఎంచుకుని వాళ్లచేత వీడియోలోని డైలాగులు చెప్పిస్తాము. దాన్ని ఆడియో/వీడియో టీం వాళ్లు రికార్డు చేసి ఎడిటింగ్‌, ఆన్‌ స్క్రీన్‌ టెక్స్‌ట్‌ ప్రాసెసింగ్‌ చేస్తారు. చివరిగా, ఆడియోను, డైలాగులను, బొమ్మలను కలిపి వీడియోను తయారుచేస్తారు. ఆ ఫైనల్‌ ప్రాడక్టును వెబ్‌సైట్‌లో పెడతారు.

కొన్ని బ్రాంచీల్లో అయితే రికార్డింగు స్టూడియోలు, రికార్డింగ్‌ పని చూసుకోవడానికి శిక్షణ పొందిన టెక్నీషియన్లు ఉంటారు. మరి మారుమూల ప్రాంతాల్లో మాట్లాడే భాషలు, అక్కడ జరుగుతున్న అనువాదపని సంగతేంటి?

ప్రపంచవ్యాప్తంగా అలాంటి మారుమూల ప్రాంతాల్లో, ఆడియో టెక్నీషియన్లు తమ పోర్టబుల్‌ రికార్డింగు సిస్టమ్స్‌తో పని చేస్తారు. వాళ్లు స్థానికంగా ఉన్న ఆఫీసులోగానీ, రాజ్యమందిరంలోగానీ లేదా ఎవరైనా ఇంట్లోగానీ మైక్రోఫోన్‌, ఆడియో రికార్డు చేసే సాఫ్ట్‌వేర్‌ ఉన్న లాప్‌టాప్‌ సహాయంతో ఓ టెంపరరీ రికార్డింగు స్టూడియోను తయారు చేస్తారు. స్థానిక భాష మాట్లాడే కొంతమంది వ్యక్తులను రీడర్స్‌గా, కోచ్‌లుగా, చెకర్స్‌గా ఉపయోగించుకుంటారు. రికార్డింగు పనంతా అయిపోయాక ఆడియో టెక్సీషియన్లు తమ పరికారలన్నిటినీ తీసుకుని మరో ప్రాంతానికి వెళ్లిపోతారు.

ఈ పద్ధతి ద్వారా, ఇంతకుముందుకన్నా మూడింతలు ఎక్కువ భాషల్లో వీడియోలను తయారు చేస్తున్నారు.

ఇలా తయారు చేసిన వీడియోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. కొంతమందైతే, ఇంతకుముందు తమ భాషలో ఉన్న ఏ వీడియోలను చూడలేదు. వాళ్లు చూసిన మొదటి వీడియో యెహోవాసాక్షులు తయారుచేసినదే.

ఆస్ట్రేలియాలో 2,500 కన్నా ఎక్కువమంది పిట్షాంట్‌షా ష్యారా అనే భాషను మాట్లాడతారు. ఆ భాషలోని వీడియోలను నార్తన్‌ టెరిటరీలోని ఎలీస్‌ స్ప్రింగ్స్‌లో తయారుచేశారు. ఆ వీడియోలు తయారుచేయడానికి సహాయం చేసిన కాలన్‌ థామస్‌ ఇలా అంటున్నాడు, “ఈ వీడియోలను అందరూ చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడి ప్రజలు ఈ వీడియోలు చూస్తూ తమ టాబ్లెట్‌ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కడ ఉంటాయో చెప్పమని అడుగుతూ ఉన్నారు. వాళ్ల భాషలో పుస్తకాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే తమ భాషలో ఏదైనా విన్నప్పుడు ముఖ్యంగా చూసినప్పుడు ఈ ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు.”

కామెరూన్‌లో ఇద్దరు సాక్షులు ఓ పడవలో నది గుండా ప్రయాణిస్తున్నారు. వాళ్లు తమ ప్రయాణం మధ్యలో ఆఫ్రికాలోని ఓ తెగకు చెందినవాళ్లు ఉండే పల్లెలో ఆగి ఆ ఊరి పెద్దని కలిశారు. ఆయన స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన బాసె భాషను మాట్లాడతాడని గ్రహించిన ఆ సాక్షులు, తమ టాబ్లెట్‌ ఫోన్‌లో ఆయన మాట్లాడే భాషలో ఉన్న బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోను చూపించారు. ఆ వీడియో ఆయనకు ఎంతో నచ్చి, కొన్ని పత్రికలు ఉంటే ఇమ్మని అడిగాడు.

ఇండోనేషియాలోని ఓ పల్లెలో, స్థానిక మతనాయకుడు యెహోవాసాక్షుల్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. సాక్షులు ఆ ప్రాంతంలోని ప్రజలకు పంచిపెట్టిన పత్రికలన్నిటినీ ఆయన కాల్చేశాడు. ఆ పల్లెలోని ఇంకొందరు రాజ్యమందిరాన్ని తగలబెట్టేస్తామని బెదిరించారు. ఆ తర్వాత నలుగురు పోలిసులు ఓ సాక్షి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె కుటుంబంలో ఉన్నవాళ్లందర్నీ ప్రశ్నించారు. అయితే ఆ సహోదరి రాజ్యమందిరంలో ఏమి జరుగుతుందో ఆ పోలీసులకు చూపించాలనుకుంది. అందుకే వాళ్లకు ఇండోనేషియన్‌ భాషలో ఉన్న రాజ్యమందిరం అంటే ఏమిటి? అనే వీడియో చూపించింది.

ఆ వీడియో చూశాక ఓ పోలీసు ఇలా అన్నాడు, “ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. వాళ్లకు మీ గురించి తెలీదు.” మరో పోలీసు ఇలా అడిగాడు, “నాకు ఈ వీడియో పంపిస్తారా, దీన్ని వేరేవాళ్లకు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీ గురించి నిజమేమిటో చెప్తుంది.” ఆ వీడియో చూశాకు పోలీసులకు సాక్షుల మీద మంచి అభిప్రాయం ఏర్పడి వాళ్లకు రక్షణ కల్పిస్తున్నారు.

ఒకవేళ మీరు ఈ వీడియోలు చూడకపోతే, వాటిని ఇప్పుడే చూడండి. అవి మీ భాషలో కూడా ఉన్నాయి.