పదాలు లేకుండా అనువదించడం
యెహోవాసాక్షులు బైబిలు ఆధారిత సాహిత్యాన్ని ఇంగ్లీషు నుండి 900 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించారు. సమాచారాన్ని రాసే వీలున్న భాష నుండి ఇంకో భాషలోకి అనువదించడమే కష్టం. అయితే సంజ్ఞా భాషలోకి అనువదించాలంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. చాలామంది బధిరులు వాళ్ల చేతులు, ముఖకవళికలు ఉపయోగించి ఇతరులతో మాట్లాడతారు, కాబట్టి సంజ్ఞా భాషా అనువాదకులు సమాచారాన్ని వీడియో రూపంలోకి అనువదిస్తారు. సాక్షులు ఈ పద్ధతి ఉపయోగించి 90 కన్నా ఎక్కువ సంజ్ఞా భాషల్లోకి ప్రచురణల్ని అనువదించారు.
ఎవరు అనువదిస్తారు?
సాక్షులైన అందరు అనువాదకుల్లాగే సంజ్ఞా భాష అనువాదకులకు కూడా తమ భాష మీద పట్టు ఉండాలి. వాళ్లలో ఎక్కువమంది సంజ్ఞా భాష ఉపయోగిస్తూ పెరిగిన బధిరులు లేదా వినగలిగి, బధిర కుటుంబసభ్యుల మధ్య పెరిగినవాళ్లే. అంతేకాదు వాళ్లు శ్రద్ధగా బైబిల్ని అధ్యయనం చేస్తారు కూడా.
అనువాద సూత్రాల గురించి కొత్త అనువాదకులు విస్తృతంగా శిక్షణ పొందుతారు. ఉదాహరణకు ఆండ్రూ ఇలా చెప్తున్నాడు: “నేను చిన్నప్పటి నుండి బధిరుల పాఠశాలకు వెళ్లినా, సంజ్ఞా భాష ఉపయోగించినా, ఆ భాష వ్యాకరణ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి అనువాదకుడిగా తీసుకున్న శిక్షణ సహాయం చేసింది. సమాచారాన్ని ఖచ్చితంగా చెప్పడానికి నా సంజ్ఞల్ని, ముఖకవళికల్ని, శరీర కదలికల్ని ఎలా మెరుగుపర్చుకోవాలో ఇతర అనువాదకులు నాకు నేర్పించారు.”
నాణ్యమైన అనువాదం కోసం కృషి
అనువాదకులు ఒక టీంగా కలిసి పనిచేస్తారు. సమాచారాన్ని అనువదించడం, ఇంగ్లీషుతో చెక్ చేయడం, లేదా సహజత్వం కోసం ప్రూఫ్రీడీంగ్ చేయడం ఇలా టీంలో ప్రతీఒక్కరికి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. తర్వాత వీలైన ప్రతీచోట, అనువదించబడిన సమాచారాన్ని వేర్వేరు ప్రదేశాలకు, నేపథ్యాలకు చెందిన బధిరులు మళ్లీ ఒకసారి పరిశీలిస్తారు. వాళ్లు గమనించిన విషయాల్ని కూడా చేర్చి ఆ అనువాదాన్ని ఇంకా మెరుగుపరుస్తారు. దీనివల్ల సంజ్ఞలు, ముఖ కవళికలు సహజంగా ఉండేలా, పూర్తైన వీడియోలో సమాచారం తప్పుల్లేకుండా, స్పష్టంగా ఉండేలా చూసుకుంటారు.
సాధారణంగా సంజ్ఞా భాషా అనువాదకులు సంజ్ఞా భాషలో జరిగే కూటాలకు హాజరౌతారు. అంతేకాదు వాళ్లు సాక్షులుకాని బధిరులతో తరచూ బైబిలు స్టడీలు చేస్తారు. ఇలా చేయడం వల్ల, ఆ భాషలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని తెలుసుకోగలుగుతారు.
ఎందుకంత కష్టపడాలి?
“అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి” వచ్చిన ప్రజలు బైబిల్లోని ఓదార్పుకరమైన, ఆశాపూరిత సందేశానికి స్పందిస్తారని చెప్తుంది. (ప్రకటన 7:9) వాళ్లలో సంజ్ఞా భాష ఉపయోగించే వాళ్లు కూడా ఉన్నారు.
అనువాదకులు వాళ్ల సమయాన్ని, నైపుణ్యాల్ని ఇంత అర్థవంతమైన పని కోసం ఉపయోగిస్తున్నందుకు సంతోషిస్తారు. టోని అనే అనువాదకుడు ఇలా చెప్తున్నాడు: “నేను ఒక బధిరుడిని కాబట్టి ఇతర బధిరులు పడే బాధలు నాకు తెలుసు. బైబిల్లో ఉన్న నిజమైన నిరీక్షణ గురించి వీలైనంతమంది బధిరులకు తెలియజేయాలని నేను ఎప్పుడూ బలంగా కోరుకునేవాణ్ణి.”
సంజ్ఞా భాష అనువాద టీంతో కలిసి పనిచేస్తున్న అమండ ఇలా చెప్తుంది: “నేను ఇంతకుముందు చేసిన ఉద్యోగంలో కన్నా, బైబిలు సందేశాన్ని బధిరులకు చేరవేసే ప్రచురణల్ని అనువదించే పనిలోనే ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నానని అనిపిస్తుంది.”
మీ సంజ్ఞా భాషలోని వీడియోలను ఎలా కనుక్కోవచ్చు
jw.org వెబ్సైట్లో సంజ్ఞా భాష వీడియోలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి, “సంజ్ఞా-భాషలో ఉన్న సమాచారాన్ని కనుగొనండి” అనే భాగం మీకు సహాయం చేస్తుంది.