కంటెంట్‌కు వెళ్లు

“సినిమాల కన్నా బాగున్నాయి”

“సినిమాల కన్నా బాగున్నాయి”

యెహోవాసాక్షులు తమ సమావేశాల్లో చూపించడానికి ప్రతీ సంవత్సరం ఎన్నో వీడియోలు తయారుచేస్తారు. వాటిలో చాలా వీడియోలను ఇంగ్లీషు డైలాగ్‌లతో రికార్డు చేస్తారు. మరి, ఇంగ్లీషు కాకుండా వందలాది ఇతర భాషల్లో జరిగే సమావేశాలకు వచ్చే ప్రజలు వీటిని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎలాగంటే, వాటిలో చాలా భాషల్లోకి ఈ వీడియోల్ని డబ్బింగ్‌ చేస్తారు, అంటే వేరే భాష డైలాగ్‌లు ఉన్న సౌండ్‌ట్రాక్‌ని వీడియోకి జతచేస్తారు. ఇలా డబ్బింగ్‌ చేసిన వీడియోల్ని చూసినవాళ్లు వాటి గురించి ఏమంటున్నారు?

డబ్బింగ్‌ వీడియోల్ని చూసినవాళ్ల ప్రతిస్పందన

మెక్సికోలో, సెంట్రల్‌ అమెరికాలో జరిగిన సమావేశాలకు హాజరైన యెహోవాసాక్షులుకాని కొంతమంది ఏమన్నారో చూడండి:

  • “నాకు ఆ వీడియో అర్థమవ్వడమే కాదు, నేను కూడా అందులో ఉన్నట్టు అనిపించింది. అది నేరుగా నా హృదయాన్ని తాకింది.”​—మెక్సికోలోని వెరక్రూజ్‌లో జరిగిన పోపలూక భాష సమావేశానికి హాజరైన ఒకతను.

  • “నేను మా ఊళ్లో ఉన్నట్టు, నా క్లోజ్‌ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అవి సినిమాల కన్నా బాగున్నాయి, ఎందుకంటే వీడియోలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి.”​—మెక్సికోలోని నుయెవో లేయోన్‌లో జరిగిన నావాటల్‌ భాష సమావేశానికి హాజరైన ఒకతను.

  • “ఆ వీడియోల్ని నా భాషలో చూసినప్పుడు, వాటిలోని పాత్రలు స్వయంగా నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది.”​—మెక్సికోలోని టబస్కోలో జరిగిన చోల్‌ భాష సమావేశానికి హాజరైన ఒకామె.

  • “ప్రజలు సొంత భాషలో నేర్చుకునేలా సహాయం చేయడానికి ఈ సంస్థ ఎంతో కృషిచేస్తుంది. ఇలాంటి సంస్థ ఇంకొకటి లేనేలేదు!”​—గ్వాటిమాలలోని సోలోలాలో జరిగిన కాక్‌చికెల్‌ భాష సమావేశానికి హాజరైన ఒకతను.

యెహోవాసాక్షులు డబ్బులిచ్చి నిపుణులైన టెక్నీషియన్‌లను, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లను పెట్టుకోరు, పైగా వాళ్ల రికార్డింగ్‌ ఎక్కువగా సుదూర ప్రాంతాల్లో, అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో జరుగుతుంది; అలాంటప్పుడు వాళ్లు నాణ్యమైన రికార్డింగ్‌లను ఎలా తయారు చేయగలుగుతున్నారు?

అత్యంత సంతృప్తినిచ్చే పని

2016లో జరిగిన సమావేశాల కోసం యెహోవాసాక్షుల సెంట్రల్‌ అమెరికా బ్రాంచి కార్యాలయం స్పానిష్‌ భాషలోకి, ఇంకా 38 స్థానిక భాషల్లోకి సమావేశ వీడియోలను డబ్బింగ్‌ చేసే పనిని చూసుకుంది. దాదాపు 2,500 మంది స్వచ్ఛంద సేవకులు ఈ పనిలో సహాయం చేశారు. టెక్నీషియన్‌లు, స్థానిక అనువాద టీంలు బ్రాంచి కార్యాలయంలో, రిమోట్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసుల్లో, అలాగే తాత్కాలిక స్టూడియోలను ఉపయోగించి వేరే చోట్లలో కొత్త సౌండ్‌ట్రాక్‌ను రికార్డు చేశారు. టీంలు మొత్తం మీద బెలీజ్‌, గ్వాటిమాల, హోండూరాస్‌, మెక్సికో, పనామాల్లోని 20 కన్నా ఎక్కువ చోట్లలో రికార్డింగ్‌ చేశాయి.

సెంట్రల్‌ అమెరికా బ్రాంచి కార్యాలయంలో రికార్డింగ్‌ చేస్తున్నారు

తాత్కాలిక స్టూడియోల్ని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించాల్సి వచ్చింది. బయటి శబ్దాలు వినబడకుండా రికార్డింగ్‌ స్డూడియోలు తయారుచేయడానికి దుప్పట్లను, పరుపులను, స్థానికంగా ఏవి దొరికితే వాటిని ఉపయోగించారు.

స్థానిక భాషల్లో డబ్బింగ్‌ చెప్పినవాళ్లలో చాలామంది పేదవాళ్లే, దగ్గర్లోని రికార్డింగ్‌ స్టూడియోకు చేరుకోవడానికి వాళ్లు పెద్దపెద్ద త్యాగాలు చేశారు. వాళ్లలో కొంతమంది 14 గంటలు ప్రయాణించారు! ఒక సందర్భంలో, ఒక తండ్రీ కొడుకూ దాదాపు ఎనిమిది గంటలు నడిచి స్టూడియోకు వచ్చారు.

నయోమి కుటుంబంవాళ్లు తాత్కాలిక రికార్డింగ్‌ స్టూడియోలు ఏర్పాటు చేస్తుంటారు. నయోమి చిన్నప్పటినుండి వాళ్లకు సహాయం చేస్తూ పెరిగింది. ఆమె ఇలా అంటోంది: “రికార్డింగ్‌ జరిగే వారం కోసం మేము ఎప్పుడూ ఆసక్తితో ఎదురుచూసే వాళ్లం. అంతా చక్కగా జరిగేలా చూసుకోవడానికి నాన్న చాలా కష్టపడి పనిచేసేవాడు. అమ్మ ఒక్కోసారి 30 మంది స్వచ్ఛంద సేవకుల కోసం భోజనం సిద్ధం చేసేది.” ఇప్పుడు నయోమి మెక్సికోలోని ఒక ట్రాన్స్‌లేషన్‌ ఆఫీస్‌లో స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేస్తోంది. ఆమె ఇలా అంటోంది: “ప్రజలు సొంత భాషలో బైబిలు సందేశం వినేలా సహాయం చేయడానికి నా సమయాన్ని వెచ్చించడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇంతకన్నా సంతృప్తికరమైన పనిని నేను ఊహించుకోలేను.”

ప్రతీ సంవత్సరం యెహోవాసాక్షుల సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి, వాటికి అందరూ రావచ్చు. మరింత సమాచారం కోసం సమావేశాలు పేజీ చూడండి.