అగ్నితో పోరాడి గెలవడం
“మంటలు! అక్కడి నుండి మంటలు వస్తున్నాయి” అని ఎవరో అరిచారు. తన అత్త-మామల ఇంట్లో టిఫిన్ చేస్తున్న శాండ్రా, ఆ ఇంటి పక్కన ఉన్న షెడ్ తలుపు కింద నుండి మంటలు రావడం చూసింది. ఆమె, ఆమె భర్త థామస్ వెంటనే చర్య తీసుకున్నారు. శాండ్రా అగ్నిమాపక సాధనాన్ని తీసుకొస్తుండగా, థామస్ షెడ్ దగ్గరికి పరుగెత్తి మంటలు ఎక్కడి నుండి వస్తున్నాయో చూశాడు. శాండ్రా త్వరత్వరగా అగ్నిమాపక సాధనాన్ని తీసుకొచ్చి థామస్‌కు ఇచ్చింది. అతను దాన్ని ఉపయోగించి మంటలు ఆర్పాడు. ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “మేము వెంటనే చర్య తీసుకోకపోతే, షెడ్ అంతా కాలిపోయేది.”
థామస్, శాండ్రా కంగారుపడకుండా, అంత త్వరగా ఎలా చర్య తీసుకున్నారు? వాళ్లకు, అలాగే జర్మనీలోని సెల్టర్స్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో పనిచేసే దాదాపు 1,000 మంది స్వచ్ఛంద సేవకులకు అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు ఏం చేయాలో శిక్షణ ఇచ్చారు.
70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ సెల్టర్స్ బ్రాంచిలో ఆఫీసులు, నివాసభవనాలే కాకుండా లాండ్రీ, ప్రింటరీ ఇంకా ఇతర వర్క్‌షాపులు ఉంటాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రాంచిలోని భద్రతా-పర్యావరణ విభాగం అగ్నిప్రమాదాలు వచ్చినప్పుడు ఏం చేయాలో నేర్పించడానికి ఒక కార్యక్రమం నిర్వహించింది. మొదట అక్కడున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం స్థానిక అగ్నిమాపక సిబ్బందితో కలిసి ప్రాక్టీసు చేస్తుంది. తర్వాత బ్రాంచిలో పనిచేసే స్వచ్ఛంద సేవకులందరూ క్రమంగా ఈ పనులు చేస్తారు:
అగ్నిప్రమాదాలు వస్తే ఏం చేయాలో డ్రిల్స్ ప్రాక్టీసు చేస్తారు.
అగ్నిప్రమాదాలు-భద్రత గురించిన పాఠాలు చర్చిస్తారు.
అగ్నిప్రమాదాలు తలెత్తిన వెంటనే వాటిని ఎలా ఆపాలో నేర్చుకుంటారు.
అలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఉపయోగపడే ఎంతో విలువైన నైపుణ్యాలను సంపాదించుకుంటారు.
సురక్షితంగా మంటలు ఎలా ఆర్పాలో ప్రాక్టీసు చేయడం
ఈ ప్రాక్టీసు సెషన్స్‌లో పాల్గొనేవాళ్లు అగ్నిప్రమాదాలు వచ్చినప్పుడు సురక్షితంగా మంటలు ఎలా ఆర్పాలో నేర్చుకుంటారు. చిన్నప్పుడు స్కూల్లో అగ్నిప్రమాదాలు-భద్రత గురించి నేర్చుకున్న క్రిస్టీన్ బ్రాంచిలో జరిగిన ట్రైనింగ్ డ్రిల్ గురించి ఇలా చెప్తుంది: “నేను అగ్నిమాపక సాధనాన్ని పట్టుకొని, దాన్ని తెరిచి, గాలి వీచే వైపు నుండి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాను. లేకపోతే ఆ మంటలు నా ముఖానికి తగిలే ప్రమాదం ఉంది. తర్వాత నేనొక్కదాన్నే ఆ మంటలు ఆర్పేశాను. నేను ఒక టీంతో, అంటే నలుగురు లేదా ఐదుగురితో కలిసి మంటల్ని ఎలా ఆర్పాలో కూడా నేర్చుకున్నాను.”
బ్రాంచి కార్యాలయంలో అగ్ని-భద్రత విభాగంలో ట్రైనర్‌గా పనిచేస్తున్న డాన్యేల్ ఇలా చెప్తున్నాడు: ప్రాక్టీసు చేయడం వల్ల “అగ్నిప్రమాదాలు అంటే భయం పోతుంది.” ఆయన ఇలా వివరిస్తున్నాడు: “ఒక్కసారిగా మంటలు చెలరేగినప్పుడు ఏం చేయాలో ప్రజలకు తెలీదు. వాళ్లు భయపడిపోయి ‘ఇప్పుడు ఏం చేయాలి? అగ్నిమాపక సాధనాన్ని ఎలా వాడాలి?’ అని ఆలోచిస్తుంటారు. కానీ అప్పుడు ఏం చేయాలో వాళ్లకు తెలిసుంటే, చిన్న మంట పెద్దదవ్వకుండా వాళ్లు సులభంగా ఆపగలరు.” ట్రైనింగ్ గురించి ఆయన ఇలా చెప్తున్నాడు, “దానిలో పాల్గొనేవాళ్లకు అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక సాధనాన్ని సరిగ్గా ఎలా పట్టుకోవాలో, దాన్ని ఉపయోగించి మంటను ఎలా ఆర్పాలో నేర్పిస్తారు. దానివల్ల అవసరమైనప్పుడు వెంటనే చర్య తీసుకోవడానికి కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని వాళ్లు పెంపొందించుకుంటారు.”
శిక్షణ వల్ల చక్కని ఫలితాలు వచ్చాయి
ఈ శిక్షణ పట్ల చాలామంది తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ముందు ప్రస్తావించిన క్రిస్టీన్ ఇలా ఒప్పుకుంటోంది: “నా చేతులతో మొదటిసారిగా అగ్నిమాపక సాధనాన్ని పట్టుకున్నాను. ఇలాంటి శిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమని నాకనిపిస్తుంది.” బ్రాంచి కార్యాలయంలో పార్ట్‌టైమ్ సేవ చేస్తూ విమానాశ్రయంలో పనిచేస్తున్న నాడ్యా ఇలా చెప్తుంది: “గడిచిన పది సంవత్సరాల్లో నేను విమానాశ్రయంలో అగ్నిప్రమాదాలు-భద్రతకు సంబంధించిన పాఠాలు మాత్రమే నేర్చుకున్నాను. కానీ బ్రాంచి కార్యాలయంలో ప్రాక్టీసు చేయిస్తూ ఇచ్చిన శిక్షణవల్ల నాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఏదైనా అగ్ని ప్రమాదం తలెత్తితే, ఏం చేయాలో నాకు తెలుసు.”
బ్రాంచి కార్యాలయంలో తీసుకున్న శిక్షణే, తన అత్తగారింట్లో త్వరగా చర్య తీసుకోవడానికి సిద్ధం చేసిందని శాండ్రా నమ్ముతుంది. ఆమె ఇలా చెప్తుంది: “అగ్నిమాపక సాధనాన్ని ఉపయోగించాలంటే నాకు కొంచెం భయంగా ఉండేది. ప్రతీ సంవత్సరం ఇలాంటి శిక్షణ తీసుకోవడం చాలా మంచిది. అది నిజంగా సహాయం చేస్తుంది.”
స్థానిక అగ్నిమాపక విభాగంతో కలిసి ప్రాక్టీసు చేయడం
స్థానిక అగ్నిమాపక విభాగం బ్రాంచి కార్యాలయ పరిసరాల్లో క్రమంగా ప్రాక్టీసు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ విభాగపు ముఖ్య అధికారైన టియో నకమాన్ అందుకు గల కారణాన్ని వివరిస్తున్నాడు: “సెల్టర్స్ మున్సిపాలిటీ భద్రత మా బాధ్యత, అది గ్రామీణ ప్రాంతం. దానివల్ల మేము సాధారణంగా ఇళ్లలో లేదా ఫ్లాట్లలో జరిగే అగ్నిప్రమాదాల్ని చూసుకోవాల్సి వస్తుంది. కానీ బ్రాంచి కార్యాలయం కాస్త వేరు, అది విశాలమైన స్థలంలో ఉంటుంది, పెద్దపెద్ద భవనాలు ఉంటాయి, పారిశ్రామిక సంబంధమైన పనులు జరుగుతాయి. ఇక్కడ ఏదైనా ప్రమాదం తలెత్తితే, దాన్ని అదుపుచేయడానికి మాకు అదనపు నైపుణ్యాలు అవసరమౌతాయి. కాబట్టి ఇక్కడ ప్రాక్టీసు చేయడం మాకు సంతోషంగా ఉంటుంది, అందుకు మేము కృతజ్ఞులం.”
బ్రాంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలోని 100 కన్నా ఎక్కువమంది సభ్యులు అగ్నిమాపక విభాగంతో కలిసి రక్షణ కార్యక్రమాలు, ఫైర్ డ్రిల్స్ ప్రాక్టీసు చేస్తుంటారు. నకమాన్ ఇలా చెప్తున్నాడు: “మీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ల సహాయం, నిర్దేశం లేకపోతే ఫైర్ డ్రిల్స్, రక్షణ కార్యక్రమాలు ఇంత సాఫీగా సాగవు.”
2014 ఫిబ్రవరిలో ఒక సాయంత్రం అగ్నిమాపక విభాగం, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంవాళ్లు తమ నైపుణ్యాలను చూపించారు. బ్రాంచి నివాసభవనాల్లో ఒక అపార్ట్మెంట్ అంతా పొగతో నిండిపోయింది. ముందు ప్రస్తావించిన డాన్యేల్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “ఆ పొగ ఎంత దట్టంగా ఉందంటే కనీసం ఎదురుగా ఉన్న మా చేతుల్ని కూడా చూడలేకపోయాం. మేము వెంటనే అగ్నిమాపక విభాగానికి ఫోన్ చేసి, అక్కడున్న 88 అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్లను ఖాళీ చేయించడం మొదలుపెట్టాం. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోకముందే మేము ఆ భవనమంతా ఖాళీ చేశాం.” నకమాన్ ఇలా చెప్తున్నాడు: “ఫ్రాంక్ఫర్ట్ లాంటి నగరంలో అయితే ఇంత పెద్ద భవనాన్ని ఇంత త్వరగా ఖాళీచేయించడం నేను ఊహించలేను. మీరు చాలా క్రమశిక్షణ గల ప్రజలు. మీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం అద్భుతంగా పనిచేసింది!” అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి దాన్ని అక్కడి నుండి తీసేశారు. ఎవ్వరూ గాయపడలేదు, ఎలాంటి తీవ్రమైన నష్టం జరగలేదు.
సెల్టర్స్ బ్రాంచి కార్యాలయంలో ఉన్నవాళ్లందరూ తీవ్రమైన అగ్నిప్రమాదం ఎప్పటికీ జరగకూడదని ఆశిస్తున్నారు. ఒకవేళ జరిగినా, అగ్నితో పోరాడి ఎలా గెలవాలో అక్కడున్న సేవకులు నేర్చుకున్నారు కాబట్టి వాళ్లు సిద్ధంగా ఉన్నారు.