కంటెంట్‌కు వెళ్లు

జీవితకాల లక్ష్యం

జీవితకాల లక్ష్యం

న్యూయార్క్‌ రాష్ట్రంలోని యెహోవాసాక్షుల ఆమెరికా బ్రాంచి కార్యాలయాన్ని, ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని చూడడానికి ప్రతీ సంవత్సరం ఎన్నో వేలమంది వస్తుంటారు. వీటిని బెతెల్‌ అని పిలుస్తారు. ఆ హీబ్రూ పదానికి “దేవుని ఇల్లు” అని అర్థం. అక్కడ, పుస్తకాలను ఎలా తయారుచేస్తారో, మన పనంతా క్రమపద్థతిలో ఎలా జరుగుతుందో చూడడానికి, తమ స్నేహితులను కలవడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఒకాయన, అక్కడికి తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

మార్సెలస్‌ అనే యెహోవాసాక్షి అమెరికాలోని అలాస్కా, అంకరేజిలో నివసిస్తున్నాడు. అయనకు కొన్నేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది, అందువల్ల సరిగ్గా మాట్లాడలేడు. చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు, రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఇన్ని సమస్యలతో బాధపడుతున్నా బెతెల్‌ని చూడాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది. ఈ మధ్యే ఆయన కల నెరవేరింది!

“ఆయన పట్టువిడవలేదు” అని ప్రయాణ ఏర్పాట్లలో మార్సెలస్‌కు సహాయం చేసిన ఒక స్నేహితుడు కొరీ అంటున్నాడు. “ప్రయాణ ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు నాకు ఫోన్‌ చేస్తుండేవాడు. ‘అవును,’ ‘లేదు’ అనడం తప్ప మార్సెలస్‌ ఎక్కువగా మాట్లాడలేడు. అందుకే ఆయన ఫోన్‌ చేసినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగాల్సివస్తుంది.” వాళ్ల సంభాషణ ఇలా జరిగేది:

“నన్ను రమ్మంటారా?”

“లేదు.”

“డాక్టర్‌ని పిలవమంటారా?”

“లేదు.”

“బెతెల్‌ ప్రయాణం గురించా?”

“అవును.”

“అప్పుడు నేను ప్రయాణ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చెప్పాల్సి వచ్చేది. తన కోరిక తీరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.”

మార్సెలస్‌ బెతెల్‌కి వెళ్లడానికి కొన్ని అడ్డంకులు దాటాడు. ఆయనకు వచ్చే ఆదాయం తక్కువ. న్యూయార్క్‌కు వెళ్లాలంటే 5,400 కి.మీ. దూరం ప్రయాణించాలి. దానికయ్యే ఖర్చుకోసం రెండు సంవత్సరాల నుండి డబ్బు దాచుకున్నాడు. ఆయనకున్న అనారోగ్య సమస్యలను బట్టి ప్రయాణంలో తోడు ఉండడానికి సరైన వ్యక్తిని చూసుకోవాలి. చివరిగా డాక్టరు అనుమతి తీసుకోవాలి. విమానం బయల్దేరడానికి కొన్ని రోజుల ముందే ఆయనకు అనుమతి దొరికింది.

న్యూయార్క్‌ చేరుకున్న తర్వాత, టూర్‌ గైడ్‌ల సహాయంతో బ్రూక్లిన్‌, ప్యాటర్‌సన్‌, వాల్‌కిల్‌లలోని భవనాలను చూశాడు. పెద్దపెద్ద యంత్రాలు పుస్తకాలను, బైబిళ్లను ముద్రిస్తుంటే చూసి మన పని ఎలా జరుగుతుందో తెలుసుకున్నాడు. “ద బైబిల్‌ అండ్‌ ద డివైన్‌ నేమ్‌,” “ఎ పీపుల్‌ ఫర్‌ జెహోవస్‌ నేమ్‌” ప్రదర్శనలు కూడా చూశాడు. చాలామందిని స్నేహితుల్ని చేసుకున్నాడు. అది నిజంగా జీవితకాల లక్ష్యం!

బెతెల్‌ ప్రయాణం గురించి అడిగినప్పుడు, చాలామంది దాని గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదంటారు. అయితే, ‘బెతెల్‌కి వెళ్లేందుకు మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందంటారా?’ అని మార్సెలస్‌ని అడిగినప్పుడు, ఆయన చెప్పగలిగిన పద్ధతిలో ఇలా జవాబిచ్చాడు, “అవును. అవును. అవును!”

బెతెల్‌ను సందర్శించడం వల్ల, మార్సెలస్‌లాగే మీరు మీ కుటుంబం ఎంతో ప్రోత్సాహం పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా బ్రాంచి కార్యాలయాలను చూడమని ఆహ్వానిస్తున్నాం. మీరు సందర్శిస్తారు కదూ?

ప్రచురించడానికి ఈ ఆర్టికల్‌ని ఖరారు చేస్తుండగా 2014, మే 19న మార్సెలస్‌ చనిపోయాడు.