కంటెంట్‌కు వెళ్లు

అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఓదార్పు, సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఓదార్పు, సహాయం

తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవాళ్లు త్వరగా ఆందోళనకు గురౌతుంటారు, ఇక వాళ్లు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తే ఇంకా ఎక్కువగా వేదనకు గురౌతారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులకు సంబంధించిన ఒక పత్రికలో చెప్పినట్టు, “రోగులు ఎలా కోలుకుంటారనేది చాలావరకు వాళ్ల భావోద్వేగ, ఆధ్యాత్మిక అవసరాల మీద ఆధారపడి ఉంటుంది అని పరిశోధనలు సూచిస్తున్నాయి.” a

ఆ అవసరాల కారణంగానే, యెహోవాసాక్షులు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న తమ వాళ్లకు ఆధ్యాత్మిక ఊరటను, సహాయాన్ని అందిస్తున్నారు. తమ సంఘంలో ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే పెద్దలు చొరవ తీసుకుని వాళ్లను సందర్శిస్తారు. మరి ఒక యెహోవాసాక్షి ఇంటికి చాలా దూరంలో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంటే అప్పుడేమిటి? ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద నగరాల్లో యెహోవాసాక్షులు “రోగుల్ని సందర్శించే గుంపు” (PVG)లను ఏర్పాటు చేశారు. ఈ గుంపులకు చెందిన సంఘ పెద్దలు క్రమంగా హాస్పిటల్స్‌ను సందర్శించి, వైద్యం కోసం ఇతర ప్రాంతాల నుండి, చివరికి వేరే దేశాల నుండి వచ్చిన యెహోవాసాక్షులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు సహాయం చేస్తుంటారు. మొత్తం ఆరు ఖండాల్లో 1,900 PVGలు ఉన్నాయి, వాటిలో 28,000 కన్నా ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. b

PVGలు ఎలాంటి ఆధ్యాత్మిక ఓదార్పును ఇస్తున్నాయి?

ఒక PVG సభ్యుడైన విలియమ్‌ ఇలా అంటున్నాడు: “నేను కేవలం మాట్లాడడానికి, వినడానికి అక్కడ ఉండడం వల్ల యెహోవాసాక్షుల్ని, అలాగే సాక్షులుకాని వాళ్ల కుటుంబ సభ్యుల్ని ఓదార్చగలిగాను. వాళ్లున్న పరిస్థితి యెహోవాకు తెలుసని, ఆయన వాళ్ల గురించి పట్టించుకుంటున్నాడని నేను వాళ్లకు భరోసా ఇస్తుంటాను. పేషెంట్‌ల కోసం, వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్లు దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు.”

PVG సందర్శనాల వల్ల తాము పొందిన ప్రోత్సాహాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నామని చాలామంది చెప్పారు. అమెరికాకు చెందిన కొన్ని ఉదాహరణలు కింద చూడవచ్చు, అక్కడ దాదాపు 7,000 మంది PVG సభ్యులు పేషెంట్‌లను సందర్శిస్తున్నారు.

  • ప్రిసిల్లా ఇలా చెప్పింది: “మా నాన్నకు స్ట్రోక్‌ వచ్చినప్పుడు ఆయన్ని హాస్పిటల్‌లో కలిసినందుకు మీకు కృతజ్ఞతలు. మీ సందర్శనాలు ఆయన్ని ఎంతో కదిలించాయి! అలాంటి ఒక ఏర్పాటు ఉండడం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన త్వరగా కోలుకోవడానికి మీ సందర్శనాలు కూడా సహాయం చేశాయని నాకనిపిస్తుంది.”

  • చనిపోయిన ఒక పేషెంటు వాళ్ల అమ్మాయి ఓఫీలియ ఒక PVG ప్రతినిధితో ఇలా అంది: “మీ సందర్శనాలను అమ్మ చాలా ప్రాముఖ్యమైనవిగా ఎంచేది! మిమ్మల్ని యెహోవాయే పంపించాడని ఆమెకు తెలుసు. మీరు చూపించిన ప్రేమ, శ్రద్ధలకు కృతజ్ఞతలు.”

  • తాను ఇక కొన్ని రోజులే బ్రతుకుతానని తెలిసిన ఒక పేషెంటు ఎంతో భయాందోళనకు గురయ్యాడు. PVG సభ్యుడైన జేమ్స్‌ అతనితో కొంత సమయం గడిపి, బైబిల్లోని ఫిలిప్పీయులు 4:​6, 7లో ఉన్న ఓదార్పుకరమైన మాటల్ని అతనితో పంచుకున్నాడు. జేమ్స్‌ ఇలా అంటున్నాడు: “తర్వాతి రోజు నేను అతన్ని సందర్శించినప్పుడు అతని ఆలోచనాతీరు పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిసినా, యెహోవా తనకు సహాయం చేస్తాడని సానుకూల దృక్పథంతో ఉన్నాడు, పైగా నన్ను ప్రోత్సహించాడు!”

PVGలు ఎలాంటి సహాయం అందిస్తున్నాయి?

పౌలీన్‌ వాళ్ల భర్త, ఇంటికి దూరంగా ఉన్న హాస్పిటల్‌లో చనిపోయాడు. ఆమె ఇలా రాసింది: “మా కుటుంబానికి ఎదురైన అత్యంత ఒత్తిడికరమైన సమయంలో మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు. మీరు తర్వాతి రోజు పనికి వెళ్లాల్సి ఉన్నా అర్ధరాత్రి మా కోసం హాస్పిటల్‌ దగ్గర ఉంటారని తెలుసుకోవడమే మాకు చాలా ఊరటనిచ్చింది. మా 11 మందికి పడుకోవడానికి ఏర్పాట్లు చేసినందుకు, ఆ సమయమంతట్లో మా వెన్నంటే ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని ఓదార్చడానికి ఇంతలా సహాయం చేసినందుకు యెహోవాకు, ఆయన సంస్థకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను.”

నిక్కీ, గేల్‌, రాబిన్‌ అనే అక్కాచెల్లెళ్లు తమ ఇంటికి 300 కిలోమీటర్ల (200 మైళ్ల) దూరంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం PVG సభ్యుడైన కార్లోస్‌కి తెలియజేయడంతో, వాళ్లు హాస్పిటల్‌కి చేరుకునే సమయానికి అతను అక్కడికి వచ్చి వాళ్లను కలుసుకున్నాడు. కార్లోస్‌ ఇలా అంటున్నాడు: “వాళ్లకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను. చివరికి, నిక్కీ వైద్యం చేయించుకోవడానికి లోపలికి వెళ్లినప్పుడు ఆమె కుక్కపిల్లను పట్టుకోవాల్సి వచ్చింది.” తర్వాత కర్టస్‌ అనే PVG సభ్యుడు, తన భార్యతో పాటు అక్కడికి వచ్చాడు. కొన్ని గంటల తర్వాత ఆ పేషెంట్స్‌ తరఫు వాళ్లు అక్కడికి వచ్చారు, వాళ్లు వచ్చే వరకు ఆ జంట అక్కడే ఉంది. ఇదంతా గమనించిన ఒకతను ఇలా అన్నాడు: “తమ మీద చూపించిన శ్రద్ధ వల్ల ఆ ముగ్గురు ఓదార్పు పొందారు. నిక్కీ వాళ్ల చెల్లి రాబిన్‌ యెహోవాసాక్షి కాదు, PVG సభ్యులు చేసిన సహాయమంతటినీ చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది.”

a ద జాయింట్‌ కమీషన్‌ జర్నల్‌ ఆన్‌ క్వాలిటీ అండ్‌ పేషెంట్‌ సేఫ్టీ, డిసెంబర్‌ 2003, 29వ సంపుటి, 12వ సంచిక, 661వ పేజీలో వచ్చిన “రోగుల భావోద్వేగ, ఆధ్యాత్మిక అవసరాలు పట్టించుకోవడం” (ఇంగ్లీషు).

b యెహోవాసాక్షుల్లోని పెద్దలందరి లాగే PVGల్లో పనిచేసే పెద్దలు కూడా తమ స్థానిక సంఘాల్లో ఆధ్యాత్మిక కాపరులుగా, బోధకులుగా, సువార్తికులుగా సేవచేస్తూ వాటికి మద్దతిస్తారు. ఈ సేవలు చేసినందుకు వాళ్లకు ఎలాంటి జీతాలు ఇవ్వరు; వాళ్లు ఇష్టపూర్వకంగా, ఉత్సాహంతో ఇలా సేవచేస్తారు.​—1 పేతురు 5:2.