యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటే నేను ఖచ్చితంగా యెహోవాసాక్షిగా మారాలా?
లేదు, అలాంటి ఖచ్చితమైన నియమేమీ లేదు. మా సంఘంలో సభ్యులు కాకపోయినప్పటికీ లక్షలమంది మా దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్నారు. a బైబిల్లో ఉన్న విషయాలు నేర్పించడమే బైబిలు స్టడీ ఉద్దేశం. అయితే బైబిలు చెప్పే విషయాలు నేర్చుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మీ ఇష్టం. ఎందుకంటే ఎవరి విశ్వాసం వాళ్లది అని మేం గుర్తుంచుకుంటాం.—యెహోషువ 24:15.
బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు నా సొంత బైబిల్ని నేను ఉపయోగించవచ్చా?
ఉపయోగించవచ్చు. మేము వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ఉపయోగించినప్పటికీ, మీరు మీ సొంత బైబిల్లో చూడడం మాకు ఇష్టమే. ఒకవేళ మీరు కావాలంటే, ఒక కొత్తలోక అనువాదం బైబిలు కాపీని మీకు కూడా ఉచితంగా ఇస్తాం. నిజానికి నిరీక్షణ, రక్షణ గురించి బైబిల్లో ఉన్న విషయాల్ని మీరు ఏ అనువాదం నుండైనా నేర్చుకోవచ్చు.
మీ నమ్మకాల్ని ఒప్పుకోని వాళ్లతో మీరెందుకు బైబిలు స్టడీ చేస్తారు?
మేము యెహోవా దేవుని మీద ప్రేమతోనే అలా చేస్తాం. క్రైస్తవులందరూ తాము నేర్చుకున్న విషయాల్ని ఇతరులకు నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. (మత్తయి 22:37, 38; 28:19, 20) దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని ఇతరులకు నేర్పిస్తూ, ‘దేవుని తోటి పనివాళ్లుగా’ ఉండడం కన్నా గొప్ప అవకాశం మరొకటి లేదని మాకనిపిస్తుంది.—1 కొరింథీయులు 3:6-9.
అంతేకాదు సాటి మనుషుల మీదున్న ప్రేమతో కూడా మేము ఈ పని చేస్తాం. (మత్తయి 22:39) మేము నేర్చుకున్న అద్భుతమైన విషయాలు ఇతరులకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 20:35.
a బైబిల్ని ఎలా అధ్యయనం చేయవచ్చో చూపిస్తూ 2023 సంవత్సరంలో మేము ప్రతీనెల 72,81,212 బైబిల్ స్టడీలు చేసాం. చాలా స్టడీల్లో, ఒకటి కన్నా ఎక్కువమంది కూర్చుంటారు. అయినా ఆ సంవత్సరంలో కేవలం 2,69,517 మంది బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులు అయ్యారు.