యెహోవాసాక్షులు ఒకప్పుడు తమతో కలిసి ఆరాధించినవాళ్లను దూరంగా ఉంచుతారా?
యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకుని ఇతరులకు ప్రకటించడం బొత్తిగా మానేసినవాళ్లను, అలాగే తోటి విశ్వాసులతో సహవాసం చేయడం మానుకుంటున్న వాళ్లను దూరంగా ఉంచం. నిజానికి వాళ్లతో మాట్లాడి, ఆధ్యాత్మిక విషయాల మీద వాళ్లలో మళ్లీ ఆసక్తి రేకెత్తించడానికి ప్రయత్నిస్తాం.
ఘోరమైన పాపం చేసిన వ్యక్తిని మేము ఊరికే బహిష్కరించం. అయితే, బాప్తిస్మం తీసుకున్న ఒక యెహోవాసాక్షి బైబిలు ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తూ పశ్చాత్తాపం చూపించకపోతే అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచుతాం లేదా బహిష్కరిస్తాం. బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: ‘ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి.’—1 కొరింథీయులు 5:13.
బహిష్కరణ అయిన వ్యక్తి భార్యాపిల్లలు యెహోవాసాక్షులైతే వాళ్ల విషయమేమిటి? కుటుంబంతో ఉన్న మతపరమైన సంబంధంలో మార్పు వస్తుంది, కానీ రక్త సంబంధం అలాగే కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం, కుటుంబ బాంధవ్యాలు, వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయి.
బహిష్కారం అయిన వాళ్లు మా మతపరమైన కార్యక్రమాలకు హాజరుకావచ్చు. కావాలనుకుంటే వాళ్లు సంఘ పెద్దల నుండి ఆధ్యాత్మిక సలహా కూడా పొందవచ్చు. యెహోవాసాక్షులుగా మళ్లీ అర్హులయ్యేందుకు ప్రతీ వ్యక్తికి సహాయం చేయాలన్నదే లక్ష్యం. బహిష్కారం అయిన వాళ్లు తమ చెడు ప్రవర్తనను మార్చుకుని బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించాలని నిజంగా కోరుకుంటున్నట్టు చూపిస్తే, వాళ్లు మళ్లీ యెహోవాసాక్షులు అవ్వవచ్చు.