యెహోవాసాక్షులు ప్రొటస్టెంటులా?
కాదు. యెహోవాసాక్షులు క్రైస్తవులే, కానీ ప్రొటస్టెంట్లు కాదు. ఎందుకు?
ప్రొటస్టెంటు ఉద్యమం “రోమన్ క్యాథోలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రారంభమైన మత ఉద్యమం.” మేము కూడా క్యాథోలిక్ చర్చి బోధలతో ఏకీభవించం. అయితే, ఈ కింది కారణాలనుబట్టి మేము ప్రొటస్టెంట్లం కాము:
ప్రొటస్టెంట్ల అనేక నమ్మకాలకూ బైబిలు నిజంగా బోధిస్తున్నదానికీ పొంతనలేదు. ఉదాహరణకు, దేవుడు త్రిత్వం కాదని, “దేవుడొక్కడే” అని బైబిలు చెబుతోంది. (1 తిమోతి 2:5; యోహాను 14:28) దేవుడు దుష్టులను పూర్తిగా నాశనం చేసి వాళ్లను శిక్షిస్తాడని, నరకంలో యాతనపెట్టి శిక్షించడని కూడా అది స్పష్టంగా చెబుతోంది.—కీర్తన 37:9; 2 థెస్సలొనీకయులు 1:9.
క్యాథోలిక్ చర్చికి లేదా మరే ఇతర మత గుంపుకు వ్యతిరేకంగా మేము నిరసన (protest) గానీ, వాటిని మార్చే ప్రయత్నం గానీ చేయం. అయితే, మేము దేవుని రాజ్య సువార్త ప్రకటించి, ఆ సువార్త మీద ఇతరులు నమ్మకం పెంచుకునేందుకు సహాయం చేస్తాం. (మత్తయి 24:14; 28:19, 20) ఇతర మత గుంపుల్లో ఉన్న తప్పులు సరిదిద్దాలనే లక్ష్యం మాకు లేదు. ఆసక్తి ఉన్నవారికి దేవుని గురించిన, ఆయన వాక్యమైన బైబిలు గురించిన వాస్తవాలు బోధించడమే మా లక్ష్యం.—కొలొస్సయులు 1:9, 10; 2 తిమోతి 2:24, 25.