కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల నమ్మకాలు ఏంటి?

యెహోవాసాక్షుల నమ్మకాలు ఏంటి?

యెహోవాసాక్షులుగా మేము యేసు బోధించిన, ఆయన అపొస్తలులు పాటించిన క్రైస్తవ విధానాల్ని అనుసరించడానికి కృషి చేస్తాం. ఈ ఆర్టికల్‌ మా నమ్మకాలను క్లుప్తంగా చెప్తుంది.

  1.   దేవుడు. మేము నిజమైన, సర్వశక్తిమంతుడైన ఒకే ఒక దేవుడిని, సృష్టికర్తను ఆరాధిస్తాం. ఆయన పేరు యెహోవా. (కీర్తన 83:18; ప్రకటన 4:10, 11) ఆయనే అబ్రాహాముకు, మోషేకు, యేసుకు కూడా దేవుడు.—నిర్గమకాండము 3:6; 32:11; యోహాను 20:17.

  2.   బైబిలు. బైబిలు మనుషుల కోసం దేవుడు ఇచ్చిన సందేశమని మేము నమ్ముతాం. (యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17) మా నమ్మకాలు మొత్తం 66 పుస్తకాల మీద, అంటే “పాత నిబంధన”, “కొత్త నిబంధన” రెండిటి మీద ఆధారపడి ఉంటాయి. ప్రొఫెసర్‌ జేసన్‌ డేవిడ్‌ బెడూన్‌ కూడా సరిగ్గా అదే విషయం గురించి చెప్పాడు. యెహోవాసాక్షుల “నమ్మకాలు, ఆచారాలు బైబిలు నిజంగా చెప్పే విషయాలమీదే ఆధారపడివుంటాయి. అంతేగానీ తాము అనుకున్న విషయాన్నే బైబిలు చెప్పాలని వాళ్లు ముందుగా నిర్ణయించుకోరు” a అని ఆయన రాశాడు.

     మేము మొత్తం బైబిల్ని నమ్ముతాం. కానీ, ఫండమెంటలిస్టులం కాదు (వాళ్లు బైబిల్ని అక్షరార్థంగానే అర్థం చేసుకుంటారు). బైబిల్లోని కొన్ని భాగాలు అలంకార భాషలో అలాగే సూచనల రూపంలో ఉన్నాయని, వాటిని ఉన్నవున్నట్టుగా అర్థం చేసుకోకూడదని మా అభిప్రాయం.—ప్రకటన 1:1.

  3.   యేసు. మేము యేసుక్రీస్తు బోధల్ని, ఆదర్శాన్ని అనుసరిస్తాం. ఆయన్ని మా రక్షకుడిగా, దేవుని కుమారుడిగా ఘనపరుస్తాం. (మత్తయి 20:28; అపొస్తలుల కార్యాలు 5:31) అందుకే, మేము క్రైస్తవులం. (అపొస్తలుల కార్యాలు 11:26) అయితే, యేసు సర్వశక్తిగల దేవుడు కాదని, త్రిత్వ సిద్ధాంతానికి బైబిల్లో ఎలాంటి ఆధారం లేదని మేము బైబిల్ని పరిశీలించి తెలుసుకున్నాం.—యోహాను 14:28.

  4.   దేవుని రాజ్యం. ఇది పరలోకంలో ఉండే ఒక నిజమైన ప్రభుత్వం. అంతేగానీ ఒక క్రైస్తవుని హృదయంలో ఉండే పరిస్థితి కాదు. అది మనుషుల ప్రభుత్వాల్ని తీసేసి, దేవుని సంకల్పాన్ని భూమ్మీద నెరవేరుస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) దేవుని రాజ్యం ఆ పనులన్నీ త్వరలోనే చేస్తుంది, ఎందుకంటే, బైబిలు ప్రవచనాల ప్రకారం, మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం.—2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-14.

     పరలోకంలో ఉన్న దేవుని రాజ్యానికి రాజు యేసు. ఆయన 1914 లో పరిపాలన మొదలుపెట్టాడు.—ప్రకటన 11:15.

  5.   రక్షణ. యేసు అర్పించిన విమోచన క్రయధన బలి వల్లే మనుషులకు పాపం, మరణం నుండి విడుదల దొరుకుతుంది. (మత్తయి 20:28; అపొస్తలుల కార్యములు 4:12) ఆ బలి నుండి ప్రయోజనం పొందాలంటే, ప్రజలు యేసు మీద విశ్వాసం ఉంచాలి. అంతేకాదు తమ జీవితంలో మార్పులు చేసుకొని బాప్తిస్మం తీసుకోవాలి. (మత్తయి 28:19, 20; యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 3:19, 20) ఒక వ్యక్తి చేసే పనులే అతని విశ్వాసం నిజమైనదో కాదో నిరూపిస్తాయి. (యాకోబు 2:24, 26) అయినా, రక్షణ అనేది మనంతట మనం సంపాదించుకునేది కాదు, “దేవుని కృప” వల్ల వచ్చేది.—గలతీయులు 2:16, 21.

  6.   పరలోకం. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, నమ్మకమైన దేవదూతలు అందరూ అదృశ్య ప్రాణులు. b వాళ్లు పరలోకంలో ఉంటారు. (కీర్తన 103:19-21; అపొస్తలుల కార్యములు 7:55) పరలోకంలో యేసుతో పాటు రాజ్యపాలన చేయడానికి దేవుడు భూమ్మీద నుండి కొద్దిమందిని అంటే 1,44,000 మందిని మళ్లీ బ్రతికిస్తాడు.—దానియేలు 7:27; 2 తిమోతి 2:12; ప్రకటన 5:9, 10; 14:1, 3.

  7.   భూమి. దేవుడు ఈ భూమిని ఎప్పటికీ మనుషులకు ఇల్లుగా ఉండాలనే ఉద్దేశంతో సృష్టించాడు. (కీర్తన 104:5; 115:16; ప్రసంగి 1:4) త్వరలోనే దేవుడు ఈ భూమిని అందమైన తోటలా మారుస్తాడు. అందులో, తన మాట వినే ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని, శాశ్వత జీవితాన్ని ఇచ్చి దీవిస్తాడు.—కీర్తన 37:11, 34.

  8.   చెడుతనం, బాధ. ఒక దేవదూత దేవునికి ఎదురుతిరగడంతో ఇవి మొదలయ్యాయి. (యోహాను 8:44) అప్పటినుండి ఆ దూతకు “సాతాను,” “అపవాది” అనే పేర్లు వచ్చాయి. ఆ దూత, మొదటి మానవ జంటను తన మాటలతో మాయ చేసి, తనతో చేతులు కలిపేలా చేసుకున్నాడు. (ఆదికాండము 3:1-6; రోమీయులు 5:12) సాతాను లేవదీసిన వివాదాలను పరిష్కరించడానికి దేవుడు ఈ లోకంలో చెడుతనాన్ని, బాధను అనుమతించాడు. కానీ దేవుడు వాటిని శాశ్వతంగా కొనసాగనివ్వడు.

  9.   మరణం. చనిపోయినవాళ్లు ఎక్కడా జీవించి ఉండరు. (కీర్తన 146:4; ప్రసంగి 9:5, 10) వాళ్లేమీ నిత్యం యాతన పెట్టే నరకంలో బాధలు అనుభవించరు.

     చనిపోయిన కోట్లమందిని దేవుడు పునరుత్థానం చేస్తాడు. (అపొస్తలుల కార్యాలు 24:15) అయితే తిరిగి బ్రతికిన వాళ్లలో ఎవరైనా దేవుని మాట వినకపోతే వాళ్లు శాశ్వతంగా నాశనమౌతారు. వాళ్లకు ఇంక పునరుత్థాన నిరీక్షణ అనేదే ఉండదు.​—ప్రకటన 20:14, 15.

  10.   కుటుంబం. దేవుడు పెట్టిన ప్రమాణం ఏంటంటే: పెళ్లి అనేది ఒక పురుషునికి, ఒక స్త్రీకి మధ్యే జరగాలి, లైంగిక పాపం అనే కారణంతో మాత్రమే విడాకులు తీసుకోవచ్చు. దీనికి మేము కట్టుబడి ఉంటాం. (మత్తయి 19:4-9) కుటుంబాలు సంతోషంగా ఉండడానికి బైబిలు సహాయం చేస్తుందని మేము నమ్ముతాం.—ఎఫెసీయులు 5:22–6:1.

  11.   ఆరాధన. మేము సిలువను గానీ, ఏ విగ్రహాన్ని గానీ పూజించం. (ద్వితీయోపదేశకాండము 4:15-19; 1 యోహాను 5:21) మేము చేసే ఆరాధనలో ముఖ్యంగా ఇవి ఉంటాయి:

  12.   మా సంస్థ. మేము సంఘాలుగా ఏర్పడి పద్ధతి ప్రకారం పనిచేస్తాం, ఒక్కో సంఘాన్ని ఒక్కో పెద్దల సభ చూసుకుంటుంది. అలాగని ఆ పెద్దలు మత నాయకుల ప్రత్యేక గుంపులా ఉండరు, వాళ్లకు జీతాలు ఉండవు. (మత్తయి 10:8; 23:8) మేము దశమభాగం అనే ఆచారాన్ని పాటించం, మా కూటాల్లో చందాలు వసూలు చేయం. (2 కొరింథీయులు 9:7) విరాళాలు ఇచ్చే వాళ్ల పేర్లు బయటకు తెలియవు. అలా వచ్చిన విరాళాల సహాయంతోనే మా సంస్థలో పనులన్నీ జరుగుతాయి.

     మా ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ‘పరిపాలక సభ’ పనిచేస్తుంది. అందులో కొంతమంది పరిణతిగల క్రైస్తవులు సేవచేస్తారు. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులను నడిపిస్తారు.—మత్తయి 24:45.

  13.   మా ఐక్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులందరికీ ఒకే నమ్మకాలు ఉంటాయి. (1 కొరింథీయులు 1:10) ప్రాంతీయ, కుల, జాతి, వర్గ భేదాలు లేకుండా ఐక్యంగా ఉండడానికి మేము చాలా కృషి చేస్తాం. (అపొస్తలుల కార్యములు 10:34, 35; యాకోబు 2:4) మేమందరం ఐక్యంగా ఉన్నా, ఎవరి నిర్ణయాలు వాళ్లవే. ప్రతీ యెహోవాసాక్షి బైబిలు ఆధారంగా తన మనస్సాక్షికి శిక్షణ ఇచ్చుకుంటాడు, దాన్నిబట్టే నిర్ణయాలు తీసుకుంటాడు.—రోమీయులు 14:1-4; హెబ్రీయులు 5:14.

  14.   మా ప్రవర్తన. మేము చేసే ప్రతీ పనిలో నిస్వార్థమైన ప్రేమ చూపించడానికి కృషి చేస్తాం. (యోహాను 13:34, 35) రక్తం ఎక్కించుకోవడం లేదా ఇవ్వడం ద్వారా రక్తాన్ని తప్పుగా ఉపయోగించం. దేవున్ని బాధపెట్టే అలాంటి పనులకు మేము దూరంగా ఉంటాం. (అపొస్తలుల కార్యములు 15:28, 29; గలతీయులు 5:19-21) మేము అందరితో శాంతిగా ఉంటాం, యుద్ధాల్లో పాల్గొనం. (మత్తయి 5:9; యెషయా 2:4) మేము ఉంటున్న దేశంలోని ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, చట్టాలకు లోబడతాం; కానీ దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన పనులు చేయమని చెప్తే మాత్రం దేవునికే లోబడతాం.—మత్తయి 22:21; అపొస్తలుల కార్యములు 5:29.

  15.   ఇతరులతో మా సంబంధాలు. “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి” అని యేసు ఆజ్ఞ ఇచ్చాడు. క్రైస్తవులు “లోకసంబంధులు కారు” అని కూడా ఆయన అన్నాడు. (మత్తయి 22:39; యోహాను 17:16) కాబట్టి, మేము ‘అందరికీ మంచి చేయడానికి’ ప్రయత్నిస్తాం. అదేసమయంలో, రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటాం అలాగే వేరే మతాలతో సంబంధాలు పెట్టుకోం. (గలతీయులు 6:10; 2 కొరింథీయులు 6:14) అయితే, ఇలాంటి విషయాల్లో ఎదుటివాళ్ల నిర్ణయాల్ని మేము గౌరవిస్తాం.—రోమీయులు 14:11, 12.

 యెహోవాసాక్షుల నమ్మకాల గురించి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే, మా వెబ్‌సైట్‌లో మా గురించి మరిన్ని విషయాలు చదవవచ్చు, మా ఆఫీసుల్లో ఒకదాన్ని కాంటాక్ట్‌ చేయవచ్చు, మీ దగ్గర్లోని రాజ్యమందిరంలో కూటానికి వెళ్లవచ్చు, మీ ప్రాంతంలో ఉండే ఒక యెహోవాసాక్షితో మాట్లాడవచ్చు.

a ట్రూత్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ అనే పుస్తకంలో 165వ పేజీ చూడండి.

b చెడ్డ దూతలను పరలోకం నుండి గెంటేశారు, అయినా వాళ్లు కూడా అదృశ్య ప్రాణులే.​—ప్రకటన 12:7-9.