వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అంటే ఏమిటి?
ద వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా లాభాలు ఆశించకుండా పనిచేసే ఒక సంస్థ. ఇది 1884వ సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియా కామన్‌వెల్త్ చట్టాల ఆధ్వర్యంలో రూపొందించబడింది. బైబిళ్లను, బైబిలు ఆధారిత ప్రచురణలను ప్రచురించడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తమ పనికి మద్దతివ్వడానికి యెహోవాసాక్షులు ఈ సంస్థను ఉపయోగిస్తారు.
ఈ సంస్థ హక్కులపత్రం ప్రకారం, ఈ సంస్థ చేసే పనులు “మతపరమైనవి, విద్యాపరమైనవి, దానానికి సంబంధించినవి.” ఇది ముఖ్యంగా చేసే పని ఏంటంటే, “యేసుక్రీస్తు రాజుగా ఉండే దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించడం, బోధించడం.” ఓ వ్యక్తి సంస్థకు ఎంత విరాళం ఇచ్చాడనే దానిబట్టి కాదుగానీ కేవలం సంస్థ ఆహ్వానించినవాళ్లు మాత్రమే దానిలో సభ్యులుగా ఉంటారు. సంస్థలోని సభ్యులు, డైరెక్టర్లు యెహోవాసాక్షుల పరిపాలక సభకు సహాయం చేస్తారు.
చట్టబద్ధమైన సంస్థలతో కలిసి పనిచేయడం
యెహోవాసాక్షులు, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా సంస్థతోపాటు వేర్వేరు దేశాల్లో ఉన్న చట్టబద్ధమైన ఇతర సంస్థలను కూడా ఉపయోగిస్తున్నారు. ఆ సంస్థలు “వాచ్ టవర్,” “వాట్‌టవర్” లేదా ఆ పదాల అనువాదాల పేరుమీద ఉన్నాయి.
చట్టబద్ధమైన ఈ సంస్థలను స్థాపించినప్పటి నుండి చాలా విషయాల్లో మంచి ఫలితాలను సాధించాం. అవేమిటో ఈ కింద చూడవచ్చు:
రైటింగ్ అండ్ పబ్లిషింగ్. మేము సూమారు 22 కోట్ల బైబిళ్లను, దాదాపు 4 వేలకోట్ల బైబిలు ఆధారిత ప్రచురణలను 700 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురించాం. 120 కన్నా ఎక్కువ భాషల్లో ఉన్న బైబిలును jw.org వెబ్‌సైట్‌లో ప్రజలు ఉచితంగా చదవుతున్నారు. అంతేకాదు “దేవుని రాజ్యం అంటే ఏమిటి?” వంటి బైబిలు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోగలుగుతున్నారు.
విద్య. బైబిల్లోని విషయాలను నేర్పించడానికి మేం వివిధ పాఠశాలలను నిర్వహిస్తాం. ఉదాహరణకు 1943 నుండి ఇప్పటివరకు 8,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌లో ఇచ్చే చక్కని శిక్షణ నుండి ప్రయోజనం పొందారు. ఆ శిక్షణను వాళ్లు మిషనరీలుగా సేవచేయడానికి, ప్రపంచవ్యాప్త పనిని స్థిరపర్చి బలపర్చడానికి ఉపయోగిస్తున్నారు. ప్రతీవారం మా సంఘాల్లో జరిగే కూటాల నుండి యెహోవాసాక్షులతోపాటు యెహోవాసాక్షులుకాని లక్షలాదిమంది కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. అంతేకాదు చదువు నేర్పించడానికి మేం కొన్ని క్లాసులు పెడతాం. ప్రజలు చదవడం, రాయడం నేర్చుకునేలా 110 భాషల్లో ఒక పుస్తకాన్ని కూడా తయారుచేశాం.
దానధర్మాలు. విపత్తులవల్ల నష్టపోయినవాళ్లకు మేము వస్తుపరంగా సహాయం చేస్తాం. అవి, 1994లో రువాండాలో జరిగిన జాతి నిర్మూలనం వంటి మనుషులవల్ల కలిగే విపత్తులు కావచ్చు లేదా 2010 హయిటీలో వచ్చిన భూకంపం వంటి ప్రకృతి విపత్తులు కావచ్చు.
మా సంస్థల వల్ల మేం ఎంతో అభివృద్ధిని సాధించినప్పటికీ, ఆ ఘనత కేవలం ఆ సంస్థలది కాదు. దేవుడు అప్పగించిన సువార్తను ప్రకటించి, బోధించే పనిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతీ క్రైస్తవునికి ఉంది. (మత్తయి 24:14; 28:19, 20) మా పనంతటి వెనుక దేవుడు ఉన్నాడని, ఆయనే దీనికి ‘వృద్ధి కలుగజేస్తూ’ ఉంటాడని మేం నమ్ముతాం.—1 కొరింథీయులు 3:6, 7.