యెహోవాసాక్షులు విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటారా?
పాల్గొంటాం. విపత్తులు సంభవించినప్పుడు యెహోవాసాక్షులు తరచూ సహాయం చేస్తారు. గలతీయులు 6:10 లో ఇలా ఉంది: “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” బైబిల్లోని ఈ నిర్దేశాన్ని పాటిస్తూ మేము యెహోవాసాక్షులకు, యెహోవాసాక్షులుకాని వాళ్లకు అవసరమైన సహాయం అందిస్తాం. అలాంటి పరిస్థితుల్లో బాధితులకు భావోద్వేగ, ఆధ్యాత్మిక ప్రోత్సాహం ఎంతో అవసరమౌతుంది, ఆ అవసరం తీర్చడానికి కూడా మేము ప్రయత్నిస్తాం.—2 కొరింథీయులు 1:3, 4.
పనుల వ్యవస్థీకరణ
విపత్తు సంభవించిన తర్వాత, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లోని పెద్దలు ఆయా సంఘాలతో సహవసిస్తున్న వాళ్లందరి యోగక్షేమాలు తెలుసుకుంటారు, వాళ్లకేమైనా సహాయం కావాలేమో కనుక్కుంటారు. ఆ తర్వాత పెద్దలు ఆ వివరాలనూ, వాళ్లకందించిన ప్రాథమిక సహాయక చర్యల వివరాలనూ స్థానిక యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తారు.
ఒకవేళ స్థానిక సంఘాలు చేయగల సహాయం కన్నా ఎక్కువ సహాయం అవసరమైతే, యెహోవాసాక్షుల పరిపాలక సభ అందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఒకసారి కరువు సంభవించినప్పుడు తొలి క్రైస్తవులు కూడా ఆ విధంగానే ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ తీసుకున్నారు. (1 కొరింథీయులు 16:1-4) స్థానిక బ్రాంచి కార్యాలయం, విపత్తు సహాయక చర్యలను వ్యవస్థీకరించడానికి, నిర్దేశించడానికి కొన్ని విపత్తు సహాయక కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇతర ప్రాంతాల సాక్షులు కూడా తమ సమయాన్ని, వనరులను వెచ్చించి స్వచ్ఛందంగా సహాయం చేస్తారు.—సామెతలు 17:17.
నిధులు
యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలకు వచ్చే విరాళాల్లో కొంత మొత్తాన్ని విపత్తు బాధితుల కోసం ఖర్చుపెడతారు. (అపొస్తలుల కార్యములు 11:27-30; 2 కొరింథీయులు 8:13-15) సహాయక పనులను చేసేది స్వచ్ఛంద సేవకులే కాబట్టి, కేటాయించిన నిధులను కార్యనిర్వహణ కోసం కాకుండా బాధితుల కోసమే వాడతారు. మేము విరాళాలను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాం.—2 కొరింథీయులు 8:20.