కంటెంట్‌కు వెళ్లు

మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ కోసం నిర్దేశాలు

మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ కోసం నిర్దేశాలు

విషయసూచిక

 1. మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లో భాగం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ డాక్యుమెంటులోని నిర్దేశాలు సహాయం చేస్తాయి. అలా భాగాలున్న వారు తమ భాగానికి సిద్ధపడేముందు క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌లో అలాగే ఈ డాక్యుమెంట్‌లో ఉన్న నిర్దేశాలను చూసుకోవాలి. ప్రచారకులందర్నీ తమ విద్యార్థి నియామకాలు చేయడానికి సిద్ధంగా ఉండమని ప్రోత్సహించండి. బైబిలు బోధలు నిజమైనవని నమ్ముతూ, క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా తమ జీవితాల్లో మార్పులు చేసుకుంటూ, సంఘంతో చురుగ్గా సహవసించే ఇతరులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడు భర్తీ అవ్వాలని తన కోరికను వ్యక్తం చేసిన ప్రచారకుడు కాని వ్యక్తితో భర్తీ అవ్వడానికి అవసరమైనవాటిని చర్చించాలి. అలా చర్చించిన తర్వాత అతనికి భర్తీ అవ్వడానికి అర్హత ఉందో లేదో తెలియజేయాలి. తనతో బైబిలు అధ్యయనం చేస్తున్న వ్యక్తి సమక్షంలో (లేదా సాక్షి అయిన తల్లి/తండ్రి సమక్షంలో) ఈ చర్చ చేయాలి. ఈ చర్చలో పరిశీలించే అర్హతలు, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు అవ్వాలంటే చేరుకోవాల్సిన అర్హతలు ఒకటే.—od 8వ అధ్యా. 8వ పేరా.

ఆరంభ మాటలు

2. ఒక నిమిషం. ప్రారంభ పాట, ప్రార్థన తర్వాత క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌ ఆ వారం కార్యక్రమం గురించి చెప్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాడు. సంఘం ఎక్కువ ప్రయోజనం పొందే విషయాల గురించి ఛైర్మన్‌ ముఖ్యంగా మాట్లాడతాడు.

  దేవుని వాక్యంలో ఉన్న సంపద

 3ప్రసంగం: పది నిమిషాలు. ప్రసంగ అంశం, రెండుమూడు ముఖ్యాంశాలు క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌లో ఉంటాయి. ఈ ప్రసంగాన్ని ఒక పెద్ద లేదా అర్హుడైన సంఘ పరిచారకుడు చేస్తాడు. ఆ వారానికి సంబంధించిన బైబిలు పఠనంలో కొత్త బైబిలు పుస్తకం మొదలైతే, దాని పరిచయ వీడియో చూపించాలి. ప్రసంగీకుడు వీడియోకు, ప్రసంగ అంశానికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. అయితే, వర్క్‌బుక్‌లో ఉన్న అంశాల్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అంతేకాదు సమయాన్ని బట్టి, ప్రసంగ అంశానికి సంబంధించి ఇచ్చిన చిత్రాలను కూడా ప్రసంగంలో చక్కగా ఉపయోగించాలి. వర్క్‌బుక్‌లో ఇచ్చిన అంశాల్ని వివరించడానికి సహాయకంగా ఉంటుందనిపిస్తే, అదనపు రెఫరెన్సులను కూడా ఉపయోగించుకోవచ్చు.

 4దేవుని వాక్యంలో రత్నాలు: పది నిమిషాలు. ఇది ప్రశ్నాజవాబుల భాగం, ఇందులో ఉపోద్ఘాతం, ముగింపు మాటలు ఉండవు. దీన్ని ఒక పెద్ద లేదా అర్హుడైన సంఘ పరిచారకుడు చేస్తాడు. ఇవ్వబడిన రెండు ప్రశ్నలను ప్రసంగీకుడు ప్రేక్షకుల్ని అడగాలి. అంతేకాదు, ఇచ్చిన లేఖనాలను చదవాలో లేదో కూడా అతను నిర్ణయించుకోవచ్చు. కామెంట్‌ చెప్పే వాళ్లందరూ 30 సెకన్లు లేదా అంతకన్నా తక్కువ సమయంలో ముగించాలి.

 5చదవాల్సిన బైబిలు భాగం: నాలుగు నిమిషాలు. ఈ విద్యార్థి నియామకం ఒక పురుష విద్యార్థి చేస్తాడు. ఉపోద్ఘాతం, ముగింపు మాటలు లేకుండా నియమించిన భాగాన్ని చదవాలి. తప్పులు లేకుండా, అర్థమయ్యేలా, తడబడకుండా, భావాన్ని సరిగ్గా నొక్కి చెప్తూ, సరైన స్వరంతో, సరైన చోట ఆగుతూ, సహజంగా చదివేలా విద్యార్థులకు సహాయం చేయడం మీద మీటింగ్‌ ఛైర్మన్‌ దృష్టిపెడతాడు. చదవాల్సిన లేఖనాలు కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు తక్కువ ఉంటాయి కాబట్టి, క్రైస్తవ జీవితం, పరిచర్య పర్యవేక్షకుడు ఈ నియామకాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేటప్పుడు విద్యార్థుల సామర్థ్యాల్ని మనసులో ఉంచుకుంటాడు.

 చక్కగా సువార్త ప్రకటిద్దాం

6. పదిహేను నిమిషాలు. మీటింగ్‌లోని ఈ భాగం పరిచర్య కోసం ప్రాక్టీసు చేయడానికి, సంభాషణా నైపుణ్యాల్లో అలాగే ప్రకటించే బోధించే విషయంలో మెరుగవ్వడానికి అందరికీ సహాయపడుతుంది. అవసరమైన విధంగా, పెద్దలు కూడా విద్యార్థి నియామకాలు పొందవచ్చు. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌లోని నియామకం పక్కన బ్రాకెట్లలో కనిపించే బోధిద్దాం బ్రోషురు లేదా ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషురు నుండి ఇవ్వబడ్డ అధ్యయన పాయింట్‌ పై పనిచేయాలి. కొన్నిసార్లు చర్చించాల్సిన భాగం కూడా ఉంటుంది. అలాంటి భాగాన్ని ఒక పెద్ద లేదా అర్హుడైన సంఘ పరిచారకుడు చేయాలి.—చర్చ భాగాలను ఎలా చేయాలో తెల్సుకోడానికి  15వ పేరా చూడండి.

 7మొదటిసారి మాట్లాడేటప్పుడు: ఈ విద్యార్థి నియామకాన్ని ఒక పురుష లేదా స్త్రీ విద్యార్థి చేయవచ్చు. పురుష విద్యార్థులకు పురుషులను, స్త్రీ విద్యార్థులకు స్త్రీలను సహాయకులుగా నియమించాలి. వ్యతిరేక లింగానికి చెందినవారిని సహాయకులుగా నియమించాలనుకుంటే వాళ్లు విద్యార్థి నియామకాన్ని చేస్తున్న వ్యక్తులకు కుటుంబ సభ్యులు అయ్యుండాలి. విద్యార్థి, సహాయకుడు కూర్చోవచ్చు లేదా నిలబడవచ్చు.—ఈ నియామకంలో ఏయే విషయల గురించి మాట్లాడాలో, ఏ సెట్టింగ్‌ను ఎన్నుకోవాలో తెల్సుకోడానికి,  12, 13 పేరాలు చూడండి.

 8మళ్లీ కలిసినప్పుడు: ఈ విద్యార్థి నియామకాన్ని ఒక పురుష లేదా స్త్రీ విద్యార్థి చేయవచ్చు. పురుష విద్యార్థులకు పురుషులను, స్త్రీ విద్యార్థులకు స్త్రీలను సహాయకులుగా నియమించాలి. (km 5/97 2వ పేజి) విద్యార్థి, సహాయకుడు కూర్చోవచ్చు లేదా నిలబడవచ్చు. అప్పటికే ఒకసారి మాట్లాడిన వ్యక్తితో మళ్లీ కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో విద్యార్థి చూపించాలి.—ఈ నియామకంలో ఏయే విషయల గురించి మాట్లాడాలో, ఏ సెట్టింగ్‌ను ఎన్నుకోవాలో తెల్సుకోడానికి,  12, 13 పేరాలు చూడండి.

 9శిష్యుల్ని చేసేటప్పుడు: ఈ విద్యార్థి నియామకాన్ని ఒక పురుష లేదా స్త్రీ విద్యార్థి చేయవచ్చు. పురుష విద్యార్థులకు పురుషులను, స్త్రీ విద్యార్థులకు స్త్రీలను సహాయకులుగా నియమించాలి. (km 5/97 2వ పేజి) విద్యార్థి, సహాయకుడు కూర్చోవచ్చు లేదా నిలబడవచ్చు. ఇందులో అప్పటికే కొనసాగుతున్న బైబిలు స్టడీలోని ఒక భాగాన్ని చూపించాలి. ఉపోద్ఘాతం లేదా ముగింపు మాటలకు సంబంధించిన అధ్యాయన పాయింట్ల మీద పని చేస్తుంటే తప్ప విద్యార్థి ఉపోద్ఘాతం లేదా ముగింపు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. పేరాలన్నీ ఖచ్చితంగా చదవాల్సిన అవసరం లేదు కానీ కావాలనుకుంటే చదవవచ్చు.

 10మీ నమ్మకాలని వివరించేటప్పుడు: ప్రసంగం అని ఉన్నప్పుడు, ఈ విద్యార్థి నియామకాన్ని ఒక పురుష విద్యార్థి చేయాలి. ప్రదర్శన అని ఉన్నప్పుడు, దీన్ని ఒక పురుష లేదా స్త్రీ విద్యార్థి చేయవచ్చు. పురుష విద్యార్థులకు పురుషులను, స్త్రీ విద్యార్థులకు స్త్రీలను సహాయకులుగా నియమించాలి. వ్యతిరేక లింగానికి చెందినవారిని సహాయకులుగా నియమించాలనుకుంటే వాళ్లు విద్యార్థి నియామకాన్ని చేస్తున్న వ్యక్తులకు కుటుంబ సభ్యులు అయ్యుండాలి. ఇవ్వబడ్డ రెఫరెన్స్‌లోని సమాచారాన్ని ఉపయోగించి, విద్యార్థి అంశంలో ఉన్న ప్రశ్నకు స్పష్టంగా, నేర్పుగా సమాధానాన్ని ఇవ్వాలి. తన భాగాన్ని చేస్తున్నప్పుడు, రెఫరెన్సులో ఇవ్వబడ్డ ప్రచురణను పేర్కొనాలో వద్దో విద్యార్థి నిర్ణయించుకోవచ్చు.

 11ప్రసంగం: ఈ విద్యార్థి నియామకాన్ని ఒక పురుష విద్యార్థి సంఘానికి ప్రసంగంలా ఇవ్వాలి. ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషురు అనుబంధం Aలోని ఒక పాయింట్‌ మీద ప్రసంగం ఆధారపడి ఉన్నప్పుడు, పరిచర్యలో ఆ వచనాన్ని ఎలా ఉపయోగించవచ్చో విద్యార్థి హైలైట్‌ చేయాలి. ఉదాహరణకు, ఒక వచనాన్ని ఎప్పుడు ఉపయోగించవచ్చో, ఆ వచనం అర్థాన్ని అలాగే ఒక వ్యక్తితో దానిపై ఎలా తర్కించాలో ఆయన వివరించవచ్చు. ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషుర్‌లోని ఒక పాఠంలో ఉన్న ఒక పాయింట్‌ ఆధారంగా ప్రసంగిస్తున్నప్పుడు, ఆ విషయాన్ని పరిచర్యలో ఎలా పాటించాలి అనే విషయం పై విద్యార్థి దృష్టి పెట్టాలి. ఆయన పాఠంలోని 1వ పాయింట్‌లో ఉన్న ఉదాహరణను హైలైట్‌ చేయవచ్చు లేదా సహాయకరంగా ఉంటుందనిపిస్తే పాఠంలో ఉన్న అదనపు లేఖనాలను హైలైట్‌ చేయవచ్చు.

   12ఏయే విషయాల గురించి మాట్లాడాలి: ఈ పేరాలో, తర్వాతి పేరాలో ఉన్న మెటీరియల్‌ “మొదటిసారి మాట్లాడేటప్పుడు“ అలాగే “మళ్లీ కలిసినప్పుడు“ నియామకాలకు వర్తిస్తుంది. ప్రత్యేకంగా ఏమీ సూచించకపోతే, తాను మాట్లాడుతున్న వ్యక్తికి అనుగుణంగా ఒక సింపుల్‌ బైబిలు సత్యాన్ని పంచుకోవడం, మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకోవడం విద్యార్థి లక్ష్యంగా ఉండాలి. విద్యార్థి ప్రస్తుతం స్థానికంగా జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండే అలాగే ప్రజలు వినడానికి ఇష్టపడే అంశం గురించి మాట్లాడాలి. మన బోధనా పనిముట్లలో ఉన్న ప్రచురణను లేదా వీడియోను పరిచయం చేయాలా వద్దా అని విద్యార్థి నిర్ణయించుకోవచ్చు. విద్యార్థులు బట్టిపట్టి మాట్లాడే బదులు వ్యక్తిగత శ్రద్ధ చూపించడం, సహజంగా మాట్లాడడం లాంటి సంభాషణ నైపుణ్యాలను ప్రాక్టీసు చేయాలి.

 13సెట్టింగ్‌లు: విద్యార్థి ఇవ్వబడ్డ సెట్టింగ్‌ను స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఉపయోగించాలి. ఉదాహరణకు:

  1.  (1) ఇంటింటి పరిచర్య: నేరుగా మాట్లాడడం ద్వారా, ఫోన్‌ ద్వారా లేదా ఉత్తరం ద్వారా ఇంటింటికి ప్రకటించడం, అలాగే ఇంటింటి పరిచర్యలో కలిసి మాట్లాడిన వ్యక్తిని మళ్లీ కలవడం ఈ సెట్టింగ్‌లో ఉంటాయి.

  2.  (2) అనియత సాక్ష్యం: సహజంగా సాగే ఒక సంభాషణను ఒక బైబిలు అంశం గురించి మాట్లాడే సంభాషణగా మార్చడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడాన్ని ఈ సెట్టింగ్‌ వివరిస్తుంది. పాఠశాలలో, మీ ఇంటి పరిసరాల్లో, ప్రజా రవాణాలో లేదా మీ రోజువారీ పనుల కోసం ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీరు కలుసుకునే వారితో లేఖనాల్లో ఉన్న ఒక మంచి విషయాన్ని పంచుకోవడం ఈ అనియత సాక్ష్యంలో ఉంటుంది.

  3.  (3) బహిరంగ సాక్ష్యం: ఈ సెట్టింగ్‌లో కార్ట్‌ ద్వారా సాక్ష్యమివ్వడం, వ్యాపార స్థలాల్లో ప్రజలను కలవడం, వీధి సాక్ష్యమివ్వడం, లేదా పార్కుల్లో, పార్కింగ్‌ స్థలాల్లో అలాగే ప్రజలు ఎక్కడ కలిస్తే అక్కడ సాక్ష్యమివ్వడం వంటివి ఉంటాయి.

 14వీడియోలను, ప్రచురణలను ఉపయోగించడం: పరిస్థితులను బట్టి, ఒక విద్యార్థి వీడియోను లేదా ప్రచురణను ఉపయోగించాలని నిర్ణయించుకోవచ్చు. ఒక విద్యార్థి నియామకంలో వీడియో చూపించాలి అని ఉంటే లేదా వీడియో చూపించాలని విద్యార్థి తానే స్వయంగా నిర్ణయించుకుంటే, అతను వీడియోను పరిచయం చేయాలి, చర్చించాలి కాని దాన్ని ప్లే చేయకూడదు.

  మన క్రైస్తవ జీవితం

15. పాట తర్వాత, ఈ భాగంలోని మొదటి 15 నిమిషాల్లోని ఒకట్రెండు భాగాలు, ప్రేక్షకులు దేవుని వాక్యాన్ని పాటించేలా సహాయం చేస్తాయి. ప్రత్యేకంగా చెప్తే తప్ప ఈ భాగాన్ని పెద్దలు లేదా సంఘ పరిచారకులు చేయవచ్చు. అయితే స్థానిక అవసరాల భాగాన్ని సంఘపెద్ద మాత్రమే చేయాలి. ఏదైనా ఒక భాగం చర్చ రూపంలో ఉంటే, దాన్ని నిర్వహించే సహోదరుడు ఇవ్వబడిన ప్రశ్నలే కాకుండా భాగం అంతటా ప్రశ్నలు అడగవచ్చు. ముఖ్యమైన అంశాలను కవర్‌ చేయడానికి అలాగే ప్రేక్షకులు పాల్గొనడానికి తగినంత సమయం ఇచ్చేలా అతను తన పరిచయ మాటల్ని క్లుప్తంగా ఉంచాలి. భాగంలో ఇంటర్‌వ్యూ ఉంటే, ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తి తన సీటు నుండి కాకుండా వీలైతే స్టేజి పై నుండి మాట్లాడడం మంచిది.

  16సంఘ బైబిలు అధ్యయనం: ముప్పై నిమిషాలు. ఈ భాగాన్ని అర్హుడైన పెద్ద చేస్తాడు. (పెద్దల సంఖ్య తక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి అర్హుడైన సంఘ పరిచారకుల్ని ఈ భాగం కోసం నియమించవచ్చు.) సంఘ బైబిలు అధ్యయనం చేయడానికి ఎవరు అర్హులో పెద్దల సభ నిర్ణయించాలి. ఈ భాగాన్ని చేసే సహోదరుడు అధ్యయనం సమయానికి ముగించేలా చూసుకుంటూ, ముఖ్య లేఖనాలు నొక్కి చెప్తూ, చర్చించే అంశాలను పాటించడం ఎందుకు ప్రాముఖ్యమో అందరూ గ్రహించేలా చూసుకుంటూ అధ్యయనాన్ని అర్థవంతంగా చేయాలి. దానికోసం, ప్రశ్నాజవాబుల భాగాన్ని ఎలా చేయాలో తెలియజేసే నిర్దేశాల్ని పరిశీలించడం సహాయకరంగా ఉంటుంది. (w23.04 24వ పేజి బాక్సు) ఆ వారానికి సంబంధించిన భాగంలో ఉన్న పాయింట్లను పూర్తిగా చర్చించిన తర్వాత, అధ్యయనాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు. వీలైనప్పుడల్లా, ప్రతీవారం అధ్యయనాన్ని నిర్వహించడానికి, అలాగే చదవడానికి వేర్వేరు సహోదరులను ఉపయోగించాలి. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌ అధ్యయనాన్ని తక్కువ సమయంలో చేయమని అడిగితే నిర్వహించే సహోదరుడు ఎలా తగ్గించవచ్చో నిర్ణయించుకోవాలి. అతను కొన్ని పేరాలను చదివించకూడదని నిర్ణయించుకోవచ్చు.

  ముగింపు మాటలు

17. మూడు నిమిషాలు. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌ ఉపయోగపడే అంశాల్ని మళ్లీ చెప్తాడు. తర్వాతి వారంలో జరగబోయే విషయాల్ని కూడా క్లుప్తంగా చెప్తాడు. సమయం ఉంటే, తర్వాతి వారం నియామకాలు ఉన్న విద్యార్థుల పేర్లను చెప్పవచ్చు. ప్రత్యేకంగా చెప్తే తప్ప, సంఘానికి అవసరమైన ప్రకటనలు చేయడం కోసం లేదా ఉత్తరాలు చదవడం కోసం ఛైర్మన్‌ ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. మామూలు విషయాల గురించిన ప్రకటనలు అంటే ప్రీచింగ్‌ గురించిన ఏర్పాట్లు, క్లీనింగ్‌ వంటివాటి గురించిన ప్రకటనలు స్టేజీ నుండి చెప్పకూడదు, బదులుగా వాటిని ఇన్‌ఫర్మేషన్‌ బోర్డ్‌లో పెట్టాలి. ముగింపు మాటల కోసం కేటాయించబడిన సమయంలోపే ప్రకటనలు చేయడం లేదా ఉత్తరాలు చదవడం కుదరదు అనిపిస్తే, మన క్రైస్తవ జీవితం భాగంలో నియామకాలున్న సహోదరుల్ని వీలైనంతవరకు సమయం తగ్గించమని ఛైర్మన్‌ అడగాలి. ( 16,  19 పేరాలను చూడండి.) మీటింగ్‌ పాట, ప్రార్థనతో ముగుస్తుంది.

  మెచ్చుకోవడం, సలహాలు ఇవ్వడం

18. ప్రతీ విద్యార్థి నియామకం ముగిశాక, ఇవ్వబడిన అధ్యాయన పాయింటు ఆధారంగా మెచ్చుకోవడానికి, సలహాలు ఇవ్వడానికి క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌కు ఒక్క నిమిషం సమయం ఉంటుంది. విద్యార్థి నియామకాన్ని ప్రకటించేటప్పుడు, ఛైర్మన్‌ అధ్యయన పాయింట్‌ను చెప్పకూడదు. అయితే, విద్యార్థి నియామకం ముగిశాక, ఛైర్మన్‌ మెచ్చుకుని, ఆ తర్వాత విద్యార్థి అధ్యయన పాయింట్‌ చెప్పి, విద్యార్థి ఆ అధ్యయన పాయింట్‌ని ఎలా చూపించారో లేదా అతను ఇంకా ఎలా మెరుగుపడవచ్చో దయగా చెప్తాడు. విద్యార్థి లేదా ప్రేక్షకులు ప్రయోజనం పొందుతారని ఛైర్మన్‌కు అనిపిస్తే ప్రదర్శనలోని ఇతర అంశాల గురించి కూడా చెప్పవచ్చు. ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషురు, బోధిద్దాం బ్రోషురు లేదా పరిచర్య పాఠశాల పుస్తకం ఆధారంగా ప్రయోజనకరమైన వేరే సలహాలు ఇవ్వాలనుకుంటే మీటింగ్‌ తర్వాత, లేదా వేరే సమయంలో విడిగా ఇవ్వవచ్చు. నియమించిన అధ్యయన పాయింట్‌ గురించి లేదా వేరే ఏదైనా అధ్యయన పాయింట్‌ గురించి ఛైర్మన్‌ సలహా ఇవ్వవచ్చు.—క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌ గురించి, సహాయక సలహాదారుడి గురించి అదనపు సమాచారం కోసం  19,  24,  25 పేరాలు చూడండి.

     సమయం

19. మీటింగ్‌లోని అన్ని భాగాలూ, అలాగే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌ మాటలూ నియమించిన సమయంలోపే పూర్తవ్వాలి. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌లో ప్రతి భాగం ఎంత సమయంలో చేయాలో ఉంటుంది, మెటీరియల్లో ఉన్న అంశాలను చర్చించడం నిర్దేశించబడిన దానికన్నా తక్కువ సమయంలోనే అయిపోతే, కేవలం సమయం పూర్తి చేయడం కోసం ఆ భాగాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ భాగాలు చేసే సహోదరులు ఎక్కువ సమయం తీసుకుంటే, క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌ లేదా సహాయక సలహాదారుడు వాళ్లకు విడిగా సలహా ఇవ్వాలి. ( 24,  25 పేరాలు చూడండి.) పాటలు, ప్రార్థనలతో సహా మీటింగ్‌ మొత్తం 1 గంట 45 నిమిషాల్లో ముగించాలి.

 ప్రాంతీయ పర్యవేక్షకుడి సందర్శనం

20. ప్రాంతీయ పర్యవేక్షకుడు సంఘాన్ని సందర్శించినప్పుడు క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌లో ఇచ్చినట్లే కార్యక్రమం కొనసాగుతుంది. అయితే, ఈ కొన్ని మార్పులు ఉంటాయి: మన క్రైస్తవ జీవితం భాగంలోని సంఘ బైబిలు అధ్యయనం బదులు ప్రాంతీయ పర్యవేక్షకుడి 30 నిమిషాల సేవా ప్రసంగం ఉంటుంది. సేవా ప్రసంగానికి ముందు క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌ జరిగిన కార్యక్రమంలోని కొన్ని అంశాల్ని, వచ్చేవారం జరగబోయే కార్యక్రమంలోని కొన్ని అంశాల్ని చెప్తాడు. అలాగే, అవసరమైన ప్రకటనలు చేసి, ఉత్తరాలు చదివాక ప్రాంతీయ పర్యవేక్షకుడిని ఆహ్వానిస్తాడు. సేవా ప్రసంగం తర్వాత, ప్రాంతీయ పర్యవేక్షకుడు తాను ఎంచుకున్న పాటతో మీటింగ్‌ ముగిస్తాడు. ఆయన ముగింపు ప్రార్థన కోసం ఎవరైనా సహోదరుడిని ఆహ్వానించవచ్చు. ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం జరిగే వారంలో సంఘం భాషలోని అదనపు తరగతులు జరగకూడదు. అయితే, సంఘానికి చెందిన గ్రూప్‌లు ప్రాంతీయ పర్యవేక్షకుడు సందర్శిస్తున్నప్పుడు కూడా మీటింగ్స్‌ జరుపుకోవచ్చు. కానీ, ప్రాంతీయ పర్యవేక్షకుని సేవా ప్రసంగం కోసం గ్రూప్‌ మళ్లీ ఆతిథ్య సంఘంతో కలవాలి.

 సమావేశాలు జరిగే వారం

21. ప్రాంతీయ సమావేశం లేదా ప్రాదేశిక సమావేశం జరిగే వారంలో సంఘ కూటాలు జరగవు. ఆ వారంలో జరిగే మీటింగ్‌లకు సంబంధించిన సమాచారాన్ని కుటుంబంగా లేదా వ్యక్తిగతంగా పరిశీలించుకోవచ్చని సంఘానికి గుర్తుచేయాలి.

 జ్ఞాపకార్థ ఆచరణ జరిగే వారం

22. జ్ఞాపకార్థ ఆచరణ వారం మధ్యలో వస్తే మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఉండదు.

 క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడు

23. పెద్దల సభ ఎంచుకున్న ఒక పెద్ద క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడిగా పని చేస్తాడు. మీటింగ్‌ అంతా పద్ధతిగా, ఇక్కడ ఇచ్చిన నిర్దేశాల ప్రకారంగా జరిగేలా అతను చూసుకోవాలి. సహాయక సలహాదారుడితో ఇతను చక్కగా కలిసి పని చేయాలి. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ అందుబాటులోకి రాగానే, క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడు రెండు నెలల కోసం, వర్క్‌బుక్‌లో ఉన్న భాగాలన్నిటినీ వేర్వేరు వాళ్లకు నియమిస్తాడు. అంటే విద్యార్థి నియామకాలతోపాటు, మిగతా భాగాలు ఎవరు చేయాలో, పెద్దల సభ ఆమోదించిన వాళ్లలో ఎవరు ఛైర్మన్‌గా ఉండాలో ఆయన షెడ్యూల్‌ తయారు చేస్తాడు. ( 3-16,  24 పేరాలు చూడండి) విద్యార్థి నియామకాలను, మీటింగ్‌లో ఇతర భాగాల కోసం సహోదరులను నియమించేటప్పుడు, నియమించబడేవారి వయస్సు, అనుభవం, చర్చించే అంశం పై వాళ్లు స్వేఛ్చగా మాట్లాడగలరా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. నియామకాలన్నిటినీ కనీసం మూడు వారాల ముందే వాటిని నిర్వహించేవాళ్లకు ఇవ్వాలి. విద్యార్థి నియామకాల్ని మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ నియామకం (S-89) ఫామ్‌ ద్వారా ఇవ్వాలి. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడు పూర్తి మీటింగ్‌ సంబంధించిన షెడ్యూల్‌ను ఇన్‌ఫర్మేషన్‌ బోర్డ్‌ మీద ఉంచాలి. ఆయనకు సహాయంగా ఉండడానికి మరో పెద్దను గానీ, సంఘ పరిచారకుడిని గానీ పెద్దల సభ నియమించవచ్చు. అయితే, విద్యార్థి నియామకాలు కాకుండా మిగతా భాగాల్ని నియమించడానికి సంఘ పెద్దలనే ఉపయోగించాలి.

    క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఛైర్మన్‌

24. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ కోసం ఒక్కో వారం ఒక్కో పెద్ద ఛైర్మన్‌గా ఉంటాడు. (పెద్దల సంఖ్య తక్కువగా ఉంటే, అవసరాన్ని బట్టి అర్హులైన సంఘ పరిచారకులను నియమించవచ్చు.) అతను ఆరంభ మాటలు, ముగింపు మాటలు సిద్ధం చేసుకోవాలి. ప్రతీ భాగాన్ని అతను పరిచయం చేయాలి. అంతేకాదు పెద్దల సంఖ్యను బట్టి మీటింగ్‌లో వేరే భాగాలు కూడా అతను చేయాల్సి ఉండవచ్చు. ముఖ్యంగా, చర్చించాల్సిన అవసరం లేని వీడియోల్ని పరిచయ మాటలు లేకుండా చూపించాలి. భాగాల మధ్యలో అతను చేసే వ్యాఖ్యానాలు చాలా క్లుప్తంగా ఉండాలి. ఈ నియామకానికి ఏయే పెద్దలు అర్హులో పెద్దల సభ నిర్ణయిస్తుంది. అర్హులైన పెద్దలు ఒకరి తర్వాత ఒకరు ఛైర్మన్‌గా పనిచేస్తారు. స్థానిక పరిస్థితులను బట్టి, క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకున్ని, ఇతర అర్హులైన పెద్దల కంటే ఎక్కువసార్లు ఛైర్మన్‌గా ఉపయోగించవచ్చు. సంఘ బైబిలు అధ్యయనం నిర్వర్తించడానికి ఒక పెద్ద అర్హుడైతే, అతను మీటింగ్‌ ఛైర్మన్‌గా ఉండడానికి కూడా దాదాపు అర్హుడైనట్టే. అయితే, ఛైర్మన్‌గా పని చేసే పెద్ద, విద్యార్థి నియామకాలు ఉన్నవాళ్లను ప్రేమతో మెచ్చుకోవాలని, అలాగే అవసరమైన విధంగా ప్రేమతో వాళ్లకు సహాయపడే సలహాలు ఇవ్వాలని దయచేసి గుర్తుంచుకోండి. మీటింగ్‌ సమయానికి ముగిసేలా ఛైర్మన్‌ చూసుకోవాలి. ( 17,  19 పేరాలు చూడండి) ఛైర్మన్‌ కోరితే, అలాగే స్టేజీ మీద సరిపడా స్థలం ఉంటే స్టేజీ మీద ఇంకో స్టాండింగ్‌ మైక్‌ పెట్టవచ్చు. అప్పుడు నియామకం చేస్తున్న సహోదరుడు వచ్చి తన స్థానంలో నిలబడే సమయంలో ఛైర్మన్‌ అతను చేసే భాగాన్ని పరిచయం చేయగలడు. అదేవిధంగా, విద్యార్థులు బైబిలు చదివేటప్పుడు, అలాగే చక్కగా సువార్త ప్రకటిద్దాం భాగాలు చేస్తున్నప్పుడు ఛైర్మన్‌ స్టేజీ మీద ఒక టేబుల్‌ దగ్గర కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.

   సహాయక సలహాదారుడు

25. వీలైనప్పుడల్లా, అనుభవంగల ప్రసంగీకుడైన ఒక పెద్దను ఇందుకోసం నియమించాలి. సహాయక సలహాదారుడు విడిగా సలహాలు ఇవ్వాలి. ప్రసంగ నియామకాలు అంటే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లో నియామకాలు, బహిరంగ ప్రసంగాలు, కావలికోట అధ్యయనాన్ని, అలాగే సంఘ బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడం లేదా చదవడం వంటి నియామకాలు ఉన్న పెద్దలకు, సంఘ పరిచారకులకు సహాయక సలహాదారుడు అవసరమైతే సలహాలు ఇవ్వాలి. ( 19వ పేరా చూడండి) సంఘంలో చక్కగా ప్రసంగించే, బోధించే పెద్దలు చాలామంది ఉంటే ఒక్కో సంవత్సరం వాళ్లలో అర్హులైన ఒకరు సహాయక సలహాదారుడిగా ఉండవచ్చు. సహాయక సలహాదారుడు ప్రతీ నియామకం తర్వాత సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు.

 అదనపు తరగతులు

26. విద్యార్థుల సంఖ్యను బట్టి విద్యార్థి నియామకాల కోసం సంఘంలో అదనపు తరగతులు జరిపించవచ్చు. ప్రతీ అదనపు తరగతిలో అర్హుడైన ఒక సలహాదారుడు ఉండాలి, వీలైతే ఒక సంఘ పెద్దను అందుకోసం నియమిస్తే బావుంటుంది. అయితే పరిస్థితిని బట్టి, మంచి అర్హతలు ఉన్న ఒక సంఘ పరిచారకుడిని కూడా నియమించవచ్చు. ఈ పని ఎవరు చేస్తే బావుంటుందో, అలాగే ఈ నియామకాన్ని మారుస్తూ ఉండాల్సిన అవసరం ఉందో లేదో పెద్దల సభ నిర్ణయిస్తుంది. సలహాదారుడు  18వ పేరాలో ఇచ్చిన పద్ధతిని పాటించాలి. అదనపు తరగతి ఉంటే, దేవుని వాక్యంలో ఉన్న సంపద అనే భాగంలోని దేవుని వాక్యంలో రత్నాలు అయిపోయాక విద్యార్థుల్ని అదనపు గదికి వెళ్లమని చెప్పాలి. మీటింగ్‌లోని చివరి విద్యార్థి నియామకం అయిపోయిన తర్వాత విద్యార్థులు తిరిగి సంఘంతో కలుస్తారు.

 వీడియోలు

27. ఈ మీటింగ్‌లో కొన్ని వీడియోలను చూపిస్తారు. వారం మధ్యలో జరిగే మీటింగ్‌ కోసం అవసరమయ్యే వీడియోలు JW లైబ్రరీ® యాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయి. రకరకాల ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో వాటిని చూడవచ్చు.

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

S-38-TU 11/23